సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:48:15

పురుడోసి పునర్జన్మ నిచ్చి

పురుడోసి పునర్జన్మ నిచ్చి

  • కొవిడ్‌ సోకిన గర్భిణులకు కాన్పులు
  • ఐదు నెలల్లో 56 మందికి వైద్య సేవలు 
  • నిజామాబాద్‌ జనరల్‌ దవాఖాన ఘనత 
  • గాంధీ దవాఖాన తర్వాత అత్యధిక డెలివరీలు  

కొవిడ్‌-19 ఆపత్కాలంలో గర్భిణులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కడుపులో బిడ్డను కాపాడుకునేందుకు కరోనాతో వారు చేసిన పోరాటం చెప్పలేనిది. తమకు ఏమైనా పర్వాలేదు.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమీ కావొద్దన్న ఉద్దేశంతో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నెలవారీ పరీక్షలకు తప్పనిసరిగా దవాఖానకు వెళ్లి రావడం వల్ల చాలామంది మహమ్మారి బారినపడ్డారు. వైరస్‌ సోకిన గర్భిణులకు ప్రైవేటు దవాఖానల్లో వైద్యం నిరాకరిస్తే.. నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖాన వైద్యులు సవాల్‌గా తీసుకుని గర్భిణులకు అండగా నిలిచారు. వైద్యానికి వచ్చిన వారిని కాదనకుండా దవాఖానలో చేర్చుకొని అద్భుతమైన సేవలు అందించారు. కరోనా నుంచి గర్భిణులను కాపాడుతూనే ప్రసవాలు చేసి శభాష్‌ అనిపించుకొన్నారు. గత ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు ఐదు నెలల్లో 56 మంది కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు జనరల్‌ దవాఖానలో కాన్పులు చేయడం విశేషం.

నిజామాబాద్‌, జనవరి 5(నమస్తేతెలంగాణ ప్రతినిధి): కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తున్న సమయమది. రోజుకు జిల్లాల్లో వందలాది కేసులు వెలుగుచూస్తున్న సందర్భంలో వైద్యులు తమ ప్రాణాలను అడ్డువేసి రోగులకు సేవలందించారు. తమ సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా గర్భిణులకు సేవలందించారు. కరోనాతో వచ్చిన గర్భిణిని, పుట్టిన బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చారు. గడిచిన ఐదు నెలల కాలంలో 56 మంది కరోనా పాజిటివ్‌ గర్భిణులు డెలివరీ కోసం నిజామాబాద్‌ జనరల్‌ దవాఖానకు వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రసవ తేదీకి తగ్గట్టుగానే వారందరికీ డెలివరీలు చేశారు. వీరిలో 36 మందికి తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్‌ చేశారు. మిగిలిన 20 మందికి సాధారణ కాన్పు చేయడం విశేషం.  

సమన్వయంతో మహమ్మారిపై విజయం

నిజామాబాద్‌ జనరల్‌ దవాఖానకు వైద్యానికి వచ్చిన గర్భిణులందరూ హైరిస్క్‌తో చేరిన వారే. ఐదు నెలల కాలంలో 56 డెలివరీలు చేస్తే 53 మందిలో హిమోగ్లోబిన్‌ సమస్యను గుర్తించారు. 56 మందిలో 50 మందికి ఇన్‌ఫ్లమెటరీ మార్క్‌ (కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న వారు) ఉన్నది. మరోవైపు 10 మంది గర్భిణులకు ప్లేట్‌లెట్స్‌ తగ్గడమూ వైద్యులకు సవాల్‌గా మారింది. అంతటి విపత్కర సమయంలో మెడికల్‌, గైనిక్‌, అనస్థీషియా, పిల్లల వైద్యులు సమన్వయంతో వంద శాతం సక్సెస్‌ రేటును సాధించారు. పుట్టిన శిశువులకు తల్లి పాలనే పట్టించాలన్న ఉద్దేశంతో తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. తల్లి శ్వాసను బిడ్డకు చేరకుండా రక్షణ చర్యలు చేపట్టి కరోనాకు అడ్డుకట్ట వేయగలిగారు.

సమిష్టి కృషితోనే సాధ్యమైంది

కరోనా సోకి నిజామాబాద్‌ జనరల్‌ దవాఖానలో చేరిన గర్భిణులందరికీ కా న్పులు చేశాం. కష్టకాలంలో దవాఖానకు వచ్చిన వారెవ్వరినీ ఇతర ప్రాంతాలకు రెఫ ర్‌ చేయలేదు. 56 మంది కొవిడ్‌ సోకిన గర్భిణులకు డెలివరీలు చేస్తే శిశువులకు వైరస్‌ సంక్రమించకుండా జాగ్రత్త పడ్డాం. 

- డాక్టర్‌ ప్రతిమారాజ్‌, పర్యవేక్షకురాలు, నిజామాబాద్‌ జనరల్‌ హాస్పిటల్‌