గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 03:06:13

ఇక్కడ జలం.. అక్కడ ధనం..

ఇక్కడ జలం.. అక్కడ ధనం..

  • పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్‌
  • రాయలసీమ ప్రాజెక్టులకు నిధులకోసం నీతిఆయోగ్‌కు లేఖ.. రూ.35వేల కోట్లకు వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇక్కడ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కరువు ప్రాంతాలకు సాగునీటి పేరిట అనుమతులులేని ప్రాజెక్టులకు పాలనా అనుమతులు ఇవ్వడం.. అక్కడ ఢిల్లీలో అదే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కరువు ప్రాంతాల అభివృద్ధి పేరిట ఆ అక్రమ ప్రాజెక్టులకే నిధులు అడగడం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్విముఖంగా పావులు కదుపుతున్న తీరిది! తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం గుట్టుగా ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సమీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. రాయలసీమ ప్రాంతానికి కృష్ణా, గోదావరిజలాల్ని తరలించేందుకు చేపట్టే ప్రాజెక్టులకు ఏకంగా రూ.35,463 కోట్ల ఆర్థికసాయం చేయాలంటూ ఈ ఏడాది మార్చిలోనే ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నీతిఆయోగ్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. సదరు ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలంటూ నీతిఆయోగ్‌.. కేంద్ర జలసంఘాన్ని తాజాగా కోరడంతో విషయం బయటికి పొక్కింది.

అనుమతులకు ముందే లేఖ

శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు ఆరునుంచి ఎనిమిది టీఎంసీల కృష్ణాజలాల తరలింపునకు రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు పోతిరెడ్డిపాడు, ఇతర కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గత మే 5న రూ.6,829.15 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటు పోలవరం కుడికాలువ ప్రవాహసామర్థ్యాన్ని పెంచి రోజుకు అదనంగా మూడు టీఎంసీలు తరలించేలా గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడుతున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సంబంధిత నదీ యాజమాన్య బోర్డులు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. స్పందించిన కేంద్ర జల్‌శక్తి.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణపై ముందుకుపోవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే, పాలనా అనుమతులు మంజూరుచేయడానికి ముందే.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 46(3) ప్రకారం రాయలసీమ కరువు నివారణ పథకం (ఆర్డీఎంఎస్‌) కింద నిధులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నీతిఆయోగ్‌ను కోరింది. ఆర్డీఎంఎస్‌ కింద సివిల్‌ పనులకు రూ.19,133 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్‌ పనులకు రూ.11,459 కోట్లు, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌కు మరో రూ.4,871 కోట్లు కలిపి మొత్తం రూ.35,463 కోట్లు ఇవ్వాలని కోరారు.  

బేసిన్‌ అవతల అంటూనే..

రాయలసీమలో కృష్ణాప్రాజెక్టు జలాలు ప్రవహించడం లేదని ఏపీ ఆర్థికమంత్రి పంపిన ప్రతిపాదనల్లోనే స్పష్టంగా పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లోని ఎగువ రాష్ర్టాలు ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో నదిలో నీటి లభ్యత తగ్గుతున్నదని తెలిపారు. ఈ క్రమంలో 30-40 రోజుల తక్కువ సమయం మాత్రమే వచ్చే వరదను రాయలసీమకు మళ్లించేందుకు ఎత్తిపోతల పథకాలు, కాలువల విస్తరణ, కొత్త రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆర్డీఎంఎస్‌ కింద నిధులు ఇస్తే ఈ ప్రాజెక్టులను చేపడతామని వివరించారు. ఈ ప్రతిపాదనల్లో కొత్తగా చేపట్టే రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు పెన్నాబేసిన్‌లోని అన్ని రిజర్వాయర్లు, కాలువల సామర్థ్య పెంపునకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉన్నట్టు తెలిసింది. దాదాపు 40-50 పేజీల ప్రతిపాదనల్లో బేసిన్‌కు సంబంధంలేని ప్రాంతానికి కృష్ణాజలాలను అందించేందుకు కేంద్రం నిధులను కోరుతుండటం గమనార్హం.

అనుమతుల మాటేమిటి?

కరువు ప్రాంతానికి సాగునీరు అంటూ ఏపీ ప్రభుత్వం చెపుతున్నా.. ఆ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగనున్నది. దీనిపై తెలంగాణ ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. అయితే.. నీతిఆయోగ్‌, సీడబ్ల్యూసీ ఎలా స్పందిస్తాయో చూడాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు సంబంధించి ఏ ప్రాజెక్టుకూ జాతీయహోదా ఇవ్వలేదు. పైగా నీతిఆయోగ్‌ సిఫారసు చేసిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు చిల్లిగవ్వ విదల్చలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం.. నీతి ఆయోగ్‌కు ఎలాంటి నివేదిక ఇస్తుందనేది వేచిచూడాలి.


logo