తెలంగాణ సూపర్

- మానవాభివృద్ధి సూచీలో అద్భుత పురోగతి
- 9వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదుగుదల
- రాష్ట్ర ప్రభుత్వంపై నీతిఆయోగ్ ప్రశంసలు
- తెలంగాణలో ఆర్థిక వృద్ధికూడా బాగున్నది
- మిషన్ భగీరథ పథకం అందరికీ ఆదర్శం
- రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో పెరిగిన నాణ్యత
- ముఖ్యమంత్రి, అధికారులతో నీతిఆయోగ్
- ప్రగతి పరిశీలనకు ప్రత్యేకంగా రావాలని బృందానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం
మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. గతంలో ఈ విషయంలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగడం ప్రశంసనీయం.
రాష్ట్రంలో ఆర్థిక వృద్ధికూడా బాగున్నది. రాష్ట్రంలో తలసరి ఆదాయం బాగా పెరిగింది. మిషన్ భగీరథ పథకంతో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
రాష్ట్రంలో మూలధన వ్యయం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో నాణ్యత పెరిగింది. దీనివల్ల రాష్ట్రంలో సత్వర అభివృద్ధి సాధ్యమవుతున్నది.
- సీఎం కేసీఆర్‌తో నీతిఆయోగ్ బృందం
మానవాభివృద్ధి సూచీ
ఓ రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధినే కాకుండా అక్కడి ప్రజలు, వారి సామర్థ్యం ఆధారంగా మానవాభివృద్ధి సూచీని లెక్కిస్తారు. ఈ సూచీలు ఆ రాష్ట్రం లేదా దేశం సాధించిన సమగ్ర అభ్యున్నతికి అద్దం పడుతాయి.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. గతంలో ఈ విషయంలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగటాన్ని ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధికూడా బాగున్నదని కితాబిచ్చింది. నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, ఆయన పీఎస్ రవీంద్ర ప్రతాప్‌సింగ్, సలహాదారు అవినాశ్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రతాసింగ్ పన్వర్, రిసెర్చ్ ఆఫీసర్ కామరాజుతో కూడిన బృందం శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసింది. నీతి ఆయోగ్ బృందాన్ని సాదరంగా ఆహ్వానించిన సీఎం.. వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్‌కు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిణామాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎం కేసీఆర్, ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు.
ఈ సందర్భంగా నీతిఆయోగ్ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా బాగా పెరిగిందని అన్నారు. మిషన్ భగీరథ అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో 100శాతం ఇండ్లకు రక్షిత మంచినీరు అందించడాన్ని నీతిఆయోగ్ సభ్యులు ప్రశంసించారు. వందశాతం ఇండ్లకు నీళ్లిచ్చిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇటీవలే ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని నీతిఆయోగ్ సభ్యులు కొనియాడారు. రాష్ట్రంలో మూలధన వ్యయం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో నాణ్యత పెరిగిందని బృందం అభిప్రాయపడింది. దీనివల్ల రాష్ట్రంలో సత్వర అభివృద్ధి సాధ్యమవుతున్నదని పేర్కొన్నది. మరోవైపు చిన్నారుల్లో పోషకాహారలేమి, మహిళల్లో రక్తహీనత సమస్యలను అరికట్టే విషయంలో మరింతగా దృష్టిసారించాలని నీతిఆయోగ్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే.. ఇప్పటికే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీలద్వారా పోషకాహారం అందిస్తున్నదని సీఎం సమక్షంలో ఉన్నతాధికారులు నీతిఆయోగ్ బృందానికి వివరించారు.
తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిపై కొద్దిపాటి చర్చల్లో వివరంగా తెలియదని, రాష్ట్ర ప్రగతిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒకసారి రావాలని నీతిఆయోగ్ వైస్‌చైర్మన్, బృందాన్ని సీఎం కేసీఆర్ కోరారు. ఈ చర్చల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ మానవాభివృద్ధి సూచీ
ఓ రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధినే కాకుండా అక్కడి ప్రజలు, వారి సామర్థ్యం ఆధారంగా మానవాభివృద్ధిని సూచిని లెక్కిస్తారు. ఇందుకు మూడు ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. ప్రజలకు ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు, విద్యా పరిజ్ఞానం, మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉండటం. ఆరోగ్యవంతమైన దీర్ఘాయుష్షును పుట్టుక సమయంలోనే అంచనా వేయగలగాలి. 25 ఏండ్ల వయస్సులోపే విద్యాభ్యాసం పూర్తి కావాలి. తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని బట్టి ప్రజల జీవన ప్రమాణాలను కొలుస్తారు. మానవాభివృద్ధి సూచి ఆధారంగానే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ)ని నిర్దేశించుకుంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి సులభంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందు అతని ఆరోగ్య పరిస్థితిని, ఇతర బాధ్యతలను (ఇంటివద్ద), విద్యార్హతలను, రవాణా సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవటం.
A team comprising @NitiAayog Vice Chairman Dr Rajiv Kumar, Advisor Sri Avinash Mishra, Consultant Dr Namrata Singh Panwar, Research Officer Sri Kamaraju and PS to Vice Chairman Sri Ravindra Pratap Singh, met CM Sri KCR today and discussed several issues with the CM. pic.twitter.com/MCQQbjEFTF
— Telangana CMO (@TelanganaCMO) January 22, 2021