గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 19:11:30

క‌రోనా రిలీఫ్ ఫండ్‌..భారీగా విరాళాలు

క‌రోనా రిలీఫ్ ఫండ్‌..భారీగా విరాళాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌  నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.  కరోనా నివారణ చర్యలకు, మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకు   ప్రభుత్వానికి  అండ‌గా ప‌లువురు త‌మ‌వంతు స‌హాయాన్ని అంద‌జేస్తున్నారు.   హీరో నితిన్‌ పది లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్‌ అందించారు. 

తాజాగా ముఖ్యమంత్రి  కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిశారు. కరోనా నిరోధానికి ఒకరోజు మూల వేతనాన్నిప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు  విరాళంగా అందించారు. కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిసి జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, మమత చెక్‌ అందించారు.

కరోనా నివారణ చర్యలకు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల సతీమణి భారీ విరాళం ప్రకటించారు.  ముఖ్యమంత్రి సహాయనిధికి సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు. ఈ సందర్భంగా అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ కేఆర్‌ వేణుగోపాల్‌ సీఎంను కలిసి చెక్‌ అందజేశారు. 

ముఖ్యమంత్రి సహాయ నిధికి తన ఒక నెల జీతం  లక్ష రూపాయలను విరాళంగా అందించినట్లు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మంగళవారం మీడియాకు తెలిపారు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్మూలన  కోసం   ముఖ్యమంత్రి కేసీఆర్‌  తీసుకుంటున్న చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, సహాయ కార్యక్రమాల కోసం  ఒక నెల వేతనాన్ని విరాళంగా  ఇస్తున్నానని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కోవిడ్‌-19 ఎదుర్కొనేందుకు కట్టదిట్టమైన చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ కార్యక్రమం విజయవంతానికి ములుగు జిల్లాలోని అధికారులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని తెలిపారు. ములుగు జిల్లాలో కోవిడ్‌ నిర్మూలనకు   ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలంతా సహకరించాలని  తాను కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌కి  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి   రెండు నెలల జీతం 5లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. logo