బుధవారం 03 జూన్ 2020
Telangana - May 06, 2020 , 01:21:00

కోహెడ మార్కెట్‌ పునరుద్ధరణకు చర్యలు

కోహెడ మార్కెట్‌ పునరుద్ధరణకు చర్యలు

  • తాత్కాలికంగా గడ్డిఅన్నారం మార్కెట్లో క్రయవిక్రయాలు
  • బాధితులను ఆదుకుంటాం: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రంగారెడ్డి జిల్లాలోని కోహెడ పండ్ల మార్కెట్‌ పునరుద్ధరణకు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ చర్యలు చేపట్టింది. పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు గడ్డిఅన్నారం మార్కెట్లో క్రయవిక్రయాలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు మంగళవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో మొదటిరోజు 1,500 టన్నుల మామిడికాయలు గడ్డిఅన్నారం మార్కెట్‌కు తరలివచ్చాయి. సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం, సుడిగాలి కారణంగా కోహెడ మార్కెట్లో షెడ్డు కూలి న దుర్ఘటనలో గాయపడిన 30మందిని సమీపంలోని అమ్మ, సన్‌రైజ్‌, షాడో, టైటాన్‌ దవాఖానలకు తరలించి, ప్రభుత్వ ఖర్చులతో చికిత్స అందిస్తున్నారు. వీరిలో స్వ ల్పంగా గాయపడిన 12 మందిని మంగళవారం డిశ్చార్జ్‌ చేశారు. 

ఆయా దవాఖానల్లో మరో 18 మంది చికిత్సపొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని కామినేని దవాఖానకు తరలించారు. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆయా దవాఖానల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రమాదంలో దెబ్బతిన్న మార్కెట్‌కు రూ.8 కోట్లు, రైతులకు రూ.4కోట్ల చొప్పున ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ చేయించి ఉన్నందున, ప్రమాదబీమా పరిహారం లభిం చే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. దెబ్బతిన్న వాహనాలకు కూడా పరిహారం వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదం వల్ల వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు.

ఘటనపై రాజకీయాలు తగవు 

కోహెడ పండ్ల మార్కెట్లో జరిగిన ఘటన దురదృష్టకరం. దీని ని రాజకీయం చేయొద్దు. రాజకీయాలు పక్కనబెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు భరోసా ఇవ్వాలి. మార్కెట్‌ను పునరుద్ధరించే వర కు కొనుగోళ్ల కోసం రైతులకు, ట్రేడర్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను  పరిశీలిస్తున్నాం. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాం. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి


logo