ఆదివారం 07 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 01:18:16

ఆటోను వేగంగా ఢీకొట్టిన కంటెయినర్‌...9 మంది మృతి

ఆటోను వేగంగా ఢీకొట్టిన కంటెయినర్‌...9 మంది మృతి

  • మినీ ట్రక్కును ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఘటన
  • మరో 11 మంది కూలీలకు తీవ్రగాయాలు
  • మృతులంతా చింతబాయి గ్రామవాసులే
  • నల్లగొండ జిల్లా అంగడిపేట స్టేజీ వద్ద ఘోరం

ఉత్సాహంగా వరినాట్లు వేసిన ఆ చేతుల్లో చలనం ఆగిపోయింది. పొలంలో పాటలు పాడిన ఆ గొంతులు మూగబోయాయి.. పొద్దంతా పనిచేసిన ఆ కూలీలు పొద్దెక్కేసరికి విగతజీవులయ్యారు. వరినాట్లతో అలసిపోయి.. పిల్లలను తలుచుకుంటూ తిరుగుపయనమైన 9 మంది కూలీలను రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకున్నది. కన్నోళ్లు, కట్టుకున్నోళ్లకు కన్నీటినే మిగిల్చింది.

పెద్దఅడిశర్లపల్లి/ దేవరకొండ, జనవరి 21: నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఓ కంటెయినర్‌ లారీ ఎదురుగా 20 మంది వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటోను అతివేగంగా ఢీకొట్టింది. 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి 9 మంది ప్రాణాలను బలిగొన్నది. ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపింది. ప్రమాదంలో మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మితిమీరిన వేగం వద్దని, రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అధికారులు విన్నవిస్తూనే ఉన్నా.. పట్టించుకోని ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో జీవితాలు అంధకారంలోకి వెళ్లాయి. హైదరాబాద్‌-సాగర్‌ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. దేవరకొండ మండలం చింతబాయికి చెందిన 20 మంది కూలీలు గురువారం ఉదయం ఆటోలో పెద్దఅడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెం సమీపంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కొండమల్లేపల్లి నుంచి పెద్దవూర వైపు తోళ్ల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కును కంటెయినర్‌ లారీ ఓవర్‌టేక్‌ చేస్తున్న క్రమంలో ఎదురుగా కూలీలతో వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. 30 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా ఒకరు, హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌ కొట్టం మల్లేశ్‌ (35), అతని భార్య చంద్రమ్మ(30), తల్లి పెద్దమ్మ(52), నోముల అంజమ్మ (50), నోము ల పెద్దమ్మ(40), నోముల సైదమ్మ(37), గొడుగు ఇద్దమ్మ (48), బడుగు లింగమ్మ (55), అలివేలు (35) ఉన్నారు. వీరంతా సమీప బంధువులే. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదంలో మినీ ట్రక్కు డ్రైవర్‌ కంగారు పడి ఒకేసారి బ్రేక్‌ వేయడంతో అదికూడా బోల్తా పడింది. డ్రైవర్‌ క్షేమంగా బయటపడ్డాడు. ఎస్పీ రంగనాథ్‌ దేవరకొండ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.

అమ్మా.. నాన్న.. నాయినమ్మ..

ప్రమాదంలో చింతబాయిలో ఒకే కుటుంబానికి చెందిన కొట్టం మల్లేశ్‌, భార్య చంద్రమ్మ, తల్లి పెద్దమ్మ మృత్యువాతపడ్డారు. 12 ఏండ్లలోపు ఉన్న మల్లేశ్‌ ఇద్దరు కొడుకులకు వారి తాత లింగయ్యే అన్నీ అయ్యారు. 

ప్రమాదంపై గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. 


  1. రంగారెడ్డి గూడెం గ్రామ శివారులోని వ్యవసాయ పొలం నుంచి 20 మంది కూలీలతో ఆటో బయలు దేరింది.
  2. 5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అంగడిపేట స్టేజీ వద్దకు చేరుకున్నది.
  3. కొండమల్లేపల్లి నుంచి పెద్దవూర వైపు మినీ ట్రక్కు వెళ్తుండగా కంటెయినర్‌ లారీ దాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయింది. 
  4. ఈ క్రమంలో లారీ వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. 
  5. అప్పటికే ముందుకు వెళ్లిన మినీ ట్రక్కు డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి బోల్తాపడింది.  
  6. హైదరాబాద్‌-సాగర్‌ హైవేపై నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఊహాచిత్రం

VIDEOS

logo