మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 21:35:06

'కోవిడ్ డైట్‌' పై ఎన్ఐఎన్ వెబినార్‌

'కోవిడ్ డైట్‌' పై ఎన్ఐఎన్ వెబినార్‌

హైద‌రాబాద్ : జాతీయ పోష‌కాహార వారోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) గురువారం ‘కోవిడైట్’ పేరుతో వెబ్‌నార్ నిర్వహించింది. వివిధ రంగాల‌కు చెందిన నిపుణుల‌ను వెబినార్ ఒకే వేదిక‌పైకి తెచ్చింది. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో పోషకాహారానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు త‌మ అనుభ‌వాన‌లు పంచుకున్నారు. ఎన్ఐఎన్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌. హేమ‌ల‌త మాట్లాడుతూ... ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడానికి వ్యవసాయం, న్యూట్రిష‌న్‌ను అనుసంధానించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. వెబినార్ ముఖ్య అతిథి, యూనిసెఫ్, పూణె క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ కే. ఎం. నాగ‌ర్గేజే మాట్లాడుతూ.. పోష‌కాహారం కోసం వ్య‌వ‌సాయం ఇందుకు ఎదుర‌య్యే స‌వాళ్లు, ప‌రిష్కార మార్గాల‌పై మాట్లాడారు.

చెన్నైలోని ఎం.ఎస్‌.స్వామినాథ‌న్ రీసెర్చ్ ఫౌండేష‌న్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఆర్‌వీ భ‌వానీ మాట్లాడుతూ... కోవిడ్‌-19, వ్య‌వ‌సాయ ప్రాముఖ్య‌త‌పై చ‌ర్చించారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఎం. సోమ‌శేఖ‌ర్ మాట్లాడుతూ... న్యూట్రిష‌న్ అండ్ హెల్త్‌ని క‌మ్యూనికేట్ చేయ‌డంలో మీడియా పాత్ర‌ను వివ‌రించారు. అదేవిధంగా కోవిడ్‌-19 నేప‌థ్యంలో స‌వాళ్లు, ప‌రిధి గురించి మాట్లాడారు. ఎన్ఐఎన్ శాస్ర్త‌వేత్త డాక్ట‌ర్ అయేషా ఇస్మాయిల్ మాట్లాడుతూ విట‌మిన్‌-డి ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు. ఈ కార్యక్ర‌మంలో ఎన్ఐఎన్ ఎక్స్‌టెన్ష‌న్ అండ్ ట్రైనింగ్ డివిజ‌న్ హెడ్‌, వెబినార్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఎం. మ‌హేశ్వ‌ర్ పాల్గొన్నారు. 


logo