మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 01:16:07

నెలలు నిండని చిన్నారికి ఊపిరి

నెలలు నిండని చిన్నారికి ఊపిరి

  • తల్లికి క్యాన్సర్‌.. ఏడు నెలలకే  బిడ్డ జననం
  • 55 రోజులు శ్రమించిన నిలోఫర్‌ వైద్యులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఆమెకు క్యాన్సర్‌.. పైగా గర్భిణీ.. ప్రాణాపాయమైన వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఓవైపు చికిత్స అందిస్తూనే మరోవైపు ఆమె గర్భంలో ఉన్న బిడ్డను రక్షించాలని వైద్యులు నిర్ణయించారు. ఎక్యూట్‌ మైలోమా క్యాన్సర్‌తో బాధపడుతున్న సూర్యాపేట జిల్లాకు చెందిన ఆ మహిళను క్యాన్సర్‌ దవాఖానకు ఎదురుగానున్న నిలోఫర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కు చికిత్స అందించడంతో ఏడు నెలలకే ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండా పుట్టిన శిశువు తక్కువ బరువు ఉండటంతో ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో 55 రోజులపాటు చికిత్సనందించి ఆ బిడ్డకు ప్రాణం పోశారు. నియోనాటల్‌ (నవజాతశిశు సంరక్షణ) వార్డులో ఆ విభాగం అధిపతులు డాక్టర్‌ అలివేలు, డాక్టర్‌ హిమబిందు పర్యవేక్షణలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ స్వప్న, డాక్టర్‌ రాకేశ్‌, పీడియాట్రిక్‌ విభాగం వైద్యులు డాక్టర్‌ నరహరితో కూడిన ప్రత్యేక బృందం ఆ శిశువుకు చికిత్స అందించారు. శిశువు పూర్తిగా కోలుకోవడంతోపాటు బరువు 1.6కిలోలు పెరగడంతో శనివారం ఆ బిడ్డను తల్లికి అప్పగించారు. ఇలా నెలలు నిండకుండా.. తక్కువ బరువుతో పు ట్టిన బిడ్డకు ప్రైవేటు దవాఖానలో చికిత్స అందించేందుకు కనీసం రూ.5 లక్షలు అవుతుందని వైద్యనిపుణులు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులుండడం వల్లనే ఇలాంటి క్రిటికల్‌ కేసులకు విజయవంతంగా చికిత్సనందించినట్టు డాక్టర్‌ అలివేలు చెప్పారు.


logo