శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:41:03

నిర్మాణ కార్మికులకు న్యాక్‌ వెబ్‌సైట్‌

నిర్మాణ కార్మికులకు న్యాక్‌ వెబ్‌సైట్‌

  • ఉద్యోగాలు వెతుక్కునేవారికి మార్గదర్శి  
  • ఆవిష్కరించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన తెలంగాణకు చెందిన నిర్మాణరంగ కార్మికుల కోసం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ను గృహ నిర్మాణం, ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో న్యాక్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. న్యాక్‌ అందుబాటులోకి తెచ్చిన వెబ్‌సైట్‌ ఉపాధికి దోహదం చేస్తుందని, స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ వర్కర్స్‌తోపాటు నిరుద్యోగులకు, వలస కార్మికులకు ఇది ఒక వరమని మంత్రి అభిప్రాయపడ్డారు. వెబ్‌సైట్‌ రూపొందించిన న్యాక్‌ అధికారులను అభినందించారు. 

ఉపాధికోసం చూసే కార్మికులకు, భవన నిర్మాణ సంస్థలకు మధ్య వెబ్‌సైట్‌ వారధిలా పనిచేస్తుందని అన్నారు. వెబ్‌సైట్‌ వల్ల భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. కంపెనీలు తమకు అవసరమైన కార్మికులను వెబ్‌సైట్‌ నుంచి ఎం పిక చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. వెబ్‌సైట్‌ ప్రాముఖ్యతపై కలెక్టర్లు, సర్పంచ్‌లు, మండల అధికారుల ద్వారా ప్రభుత్వమే అవగాహన కల్పిస్తుందని చెప్పారు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కార్మికులకు శిక్షణ, ఉ పాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం స్కిల్‌ మ్యాపింగ్‌ చేయాలని మం త్రి ఆదేశించారు. బార్‌బెండింగ్‌, మేస న్స్‌, ఎలక్ట్రిషియన్స్‌, ప్లంబర్స్‌, ఫాం వర్క్‌ కార్పెంటర్స్‌ తదితర వృత్తుల్లో న్యాక్‌ ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొం దవచ్చని చెప్పారు. 

న్యాక్‌ రూపొందించిన వెబ్‌సైట్‌లో గల్ఫ్‌ దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని, దీనివల్ల న్యాక్‌ ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుందని మంత్రి చెప్పారు. ఉద్యోగం వెతుక్కోవడం తెలియక ఎం తోమంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి ఈ వెబ్‌సైట్‌ దారి చూ పుతుందని తెలిపారు.  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణరంగానికి చాలామంది కార్మికులు అవసరమన్నారు. ఎంతోమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉండటం సంతోషించదగ్గ విషయం అన్నారు. నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, న్యాక్‌ డీజీ భిక్షపతి, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌ ప్రత్యేకత

వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన నిర్మాణ కార్మికులు తమ సమాచారాన్ని https:// tsnac.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఈ సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర నిర్మాణరంగ అసోసియేషన్స్‌ బీఏఐ, క్రెడాయ్‌, ట్రెడా, టీబీఎఫ్‌, ఐజీబీసీ ద్వారా ప్రైవేటు నిర్మాణ సంస్థలకు అందిస్తారు. ఆ సంస్థలు కార్మికులకు ఉపాధి అవకాశం కల్పిస్తాయి.


logo