బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 22:48:03

బండి సంజయ్‌ కొత్త నాటకం!

బండి సంజయ్‌ కొత్త నాటకం!

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ను  ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు పోలీసులు కూడా  సిద్దంగా ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు,  మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు.  ప్రచారం గడువు ముగిసినా, బయటి వ్యక్తులు నగరం విడిచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం అదేశించినా బీజేపీకి చెందిన పలువురు నాయకులు ఇంకా డివిజన్లలో తిరుగుతూ ఓట్ల కొనుగోలుకు తెరదీశారు. దీంతో పలుచోట్ల స్థానిక ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు బీజేపీ నేతలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందిస్తున్నారు.

ఉదయం ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేసి అలజడి సృష్టించాలని బీజేపీ ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రాత్రివేళ మళ్లీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కొత్త నాటకానికి తెరదీశాడు. డివిజన్లలో పర్యటిస్తూ  శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టి   ఘర్షణ వాతావరణం సృష్టించాలని  కుట్రలు పన్నుతున్నాడు.  ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలతో  నెక్లెస్‌రోడ్డుకు వచ్చిన సంజయ్‌ కారును పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు.    

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో సంజయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ధ్వంసమైన ఇంకో  కారులో అసలు బండి సంజయ్‌ లేనేలేడని పోలీసులు చెబుతున్నారు.  సంజయ్‌ గో బ్యాక్‌..సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఓటర్లను తప్పుదోవ పట్టించి సానుభూతి పొందాలని సంజయ్‌ చూస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంజయ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ శ్రేణులు తప్పుడు పోస్టులతో సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. 
logo