శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 02:12:08

ఇదేం అఫిడవిట్టు!

ఇదేం అఫిడవిట్టు!

  • తప్పులతడకగా ఎంవోఈఎఫ్‌ డైరెక్టర్‌ అఫిడవిట్‌
  • ట్రిబ్యునల్‌ కేటాయింపులు చేసిందంటూ నిర్ధారణ
  • సీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ విచారణ నేడు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘కృష్ణాజలాల వివాద ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ) జలాల పంపిణీని నిర్ధారిస్తే.. కృష్ణానదీ యాజమాన్య బోర్డు వాటిని అమలును పర్యవేక్షిస్తున్నది’ అంటూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ సునమని కేర్‌కట్ట పేర్కొనడంపై సాగునీటిరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అసలు కృష్ణా ట్రిబ్యునల్‌ ఏపీ-తెలంగాణ మధ్య జలాల పంపిణీ చేసిందా? ఒకవేళ చేస్తే.. బచావత్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-1) చేసిందా? లేక బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-2) వాటాలు నిర్ధారించిందా? బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపు చేసిందే తప్ప తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదనే అత్యంత బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఎంవోఈఎఫ్‌ డైరెక్టర్‌కు తెలియకపోవడం విడ్డూరం. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ఇంకా మనుగడలోకే రాలేదు. 

సుప్రీంకోర్టు ఆదేశానుసారం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీపై ఇంకా విచారణను కొనసాగిస్తూనే ఉన్నది. కానీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ మాత్రం రెండు రాష్ర్టాల మధ్య కేటాయింపులు చేసిందని అఫిడవిట్‌లో పేర్కొనడం విడ్డూరంగా ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎంఓఈఎఫ్‌ డైరెక్టర్‌ కేర్‌కట్ట ఎన్జీటీ నియమించిన సంయుక్త నిపుణుల కమిటీ మెంబర్‌ సెక్రటరీగానూ వ్యవహరిస్తున్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఆధారాలతోసహా అభ్యర్థించడంతో తిరిగి వాదనలను వినేందుకు ఎన్జీటీ అంగీకరించింది. శుక్రవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తరపున ఆశాఖ డైరెక్టర్‌ కేర్‌కట్ట సమర్పించిన అఫిడవిట్‌ కూడా ఇలా లోపభూయిష్టంగా ఉండటం గమనార్హం.


logo