గురువారం 04 జూన్ 2020
Telangana - May 21, 2020 , 00:53:15

పోతిరెడ్డిపాడుకు ఎన్జీటీ బ్రేక్‌

పోతిరెడ్డిపాడుకు ఎన్జీటీ బ్రేక్‌

  • ప్రాజెక్టు పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశం 
  • నలుగురు నిపుణులతో అధ్యయన కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన వివాదాస్పద పోతిరెడ్డిపాడు డైవర్షన్‌ కెనాల్‌ విస్తరణ ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) స్టే విధించింది. కేంద్రప్రభు త్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేపట్టిన ఈ పథకాన్ని వెంటనే నిలిపివేయాలని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఏపీ ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ప్రాజెక్టులో ఎలాంటి పనులు చేపట్టవద్దని జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసింది. ఈ వివాదంపై నలుగురు సభ్యులతో కమిటీని వేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీతోపాటు కాలుష్య నియంత్రణమండలి సభ్యులు, హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన నిపుణులు, కృష్ణానదీ యాజమాన్య బోర్డులోని సీనియర్‌ సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నది. రెండునెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఏపీ ఏకపక్షంగా నిర్మిస్తున్న ప్రాజెక్టును ఆపాలని నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలుచేశారు. ప్రతివాదులుగా కేంద్ర పర్యావరణ, అటవీ, జలశక్తిశాఖలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు, కృష్ణానదీ యాజమాన్య బోర్డులను చేర్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపుతో తెలంగాణ అవసరాలకు చుక్కనీరు మిగలదని, ప్రాజెక్టును నిలిపివేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ ఎన్జీటీని కోరారు.


logo