సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:39

పక్కాగా గ్రేడ్‌ల నిర్ధారణ

పక్కాగా గ్రేడ్‌ల నిర్ధారణ

  • నాలుగు ఫార్మెటివ్‌ పరీక్షల మార్కులతో  జీపీఏల నిర్ణయం 
  • 20% నుంచి వందశాతానికి ఇంటర్నల్‌ మార్కుల పెంపు
  • ఎప్పటిలాగానే  పదో తరగతి గ్రేడ్‌ల కేటాయింపు 
  • రెండు వారాలలోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల ఆధారంగా జీపీఏలు నిర్ధారించి ఫలితాలు వెల్లడించడానికి సెకండరీబోర్డు సన్నాహాలు చేస్తున్నది. అన్ని పాఠశాలలనుంచి ఇప్పటికే సేకరించిన ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల జాబితా ప్రకారం గ్రేడ్‌లను నిర్ణయించనున్నారు. ఇప్పటికే ఇంటర్నల్‌ మార్కులు బోర్డుకు రావడంతో అందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను బ్లాక్‌చేసి అక్రమాలకు తావులేకుండాచేశారు. పదో తరగతి పరీక్షలు రద్దుచేయడంతో దాదాపు 5లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు 40 వేల మంది ప్రైవేట్‌ విద్యార్థులకు (గత ఏడాది ఫెయిలైనవారు) ప్రయోజనం కలుగనున్నది. ఫలితాలు కూడా రెండు వారాలలోపే విడుదలచేసే అవకాశాలున్నాయి.

గ్రేడింగ్‌ ఎలా లెక్కిస్తారు

రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా ప్రత్యేకమైన విధానంలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగు ఫార్మెటివ్‌, రెండు సమ్మెటివ్‌, ఒక ప్రీఫైనల్‌ పరీక్షలు పాఠశాలలోనే నిర్వహిస్తారు. ప్రతి ఫార్మెటివ్‌ పరీక్ష 25మార్కుల చొప్పున జరుగుతుంది. సమ్మెటివ్‌, ప్రీఫైనల్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఒక్కో ఫార్మెటివ్‌ పరీక్షనుంచి 5 శాతం మార్కుల చొప్పున 20 శాతం మార్కులను లెక్కిస్తారు. ఈ ఇరవై శాతం మార్కులను వందశాతానికి పెంచి ఆ మేరకు ప్రతి విద్యార్థికి గ్రేడ్‌ పాయింట్‌ యావరేజీ (జీపీఏ)ని కేటాయిస్తారు.

ఎలాంటి ఇబ్బందులుండవు

ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు విడుదలచేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. 1969లో పదో తరగతి పరీక్షలు రద్దుచేసిన సమయంలో ఇప్పటిలాగా ఇంటర్నల్‌ మార్కులు లేవని.. ఇప్పుడు ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభ ఎస్‌ఎస్‌సీ బోర్డు రికార్డుల్లో సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. దీని ప్రకారం ఎప్పటిలాగానే పదో తరగతి పరీక్షల ఫలితాలు, గ్రేడ్లు, సర్టిఫికెట్లు జారీచేస్తామంటున్నారు. జీపీఏ ద్వారా పది ఫలితాలు విడుదలచేయడం వల్ల జూనియర్‌ కాలేజీలలో ప్రవేశాలకు ఎలాంటి సమస్యలు రావు. అదేవిధంగా పాలిటెక్నిక్‌, ట్రిపుల్‌ ఐటీల్లో కూడా ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెప్తున్నారు. 

జీపీఏ లెక్కించే విధానం

25 మార్కుల చొప్పున జరిగిన 4 ఫార్మెటివ్‌ టెస్టుల మార్కులను పరీక్షవారీగా 5%కి కుదిస్తారు. (5x4=20%)20 శాతానికి చేరిన పీటీ మార్కులను వంద శాతానికి పెంచుతారు. ఆ వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు కేటాయిస్తారు.

జీపీఏ గ్రేడ్లు .. వివరాలు

 మొదటి, మూడో భాష ఇతర సబ్జెక్టుల్లో మార్కులు
హిందీ లేదా రెండో భాషలో వచ్చిన మార్కులు
గ్రేడ్‌
గ్రేడ్‌ పాయింట్లు
91-100
90-100
A110
81-90
79-89
A2
9
71-80
68-78
B1
8
61-70
57-67
B2
7
51-60
46-56
C1
6
41-50
35-45
C2
5
35-40
20-34
D4logo