మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 02:11:04

టెస్కాబ్‌ చైర్మన్‌గా రవీందర్‌రావు

టెస్కాబ్‌ చైర్మన్‌గా రవీందర్‌రావు
  • వరుసగా రెండోసారి కొండూరి ఎన్నిక
  • వైస్‌చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి
  • ఎన్నికలు ఏకగ్రీవం.. సీఎం అభినందన
  • రైతు సమన్వయ సమితుల పేరు మార్పు
  • ఇకపై రైతుబంధు సమితి: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌/ సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టెస్కాబ్‌) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కరీంనగర్‌ డీసీసీబీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, వైస్‌చైర్మన్‌ పదవికి నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలుచేశారు. రెండు పదవులకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం టెస్కాబ్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్లు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ముఖ్యమంత్రి అభినం దించారు. టెస్కాబ్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొండూరి రవీందర్‌రావు, గొంగిడి మహేందర్‌రెడ్డిలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌, మండలిలో విప్‌ భానుప్రసాద్‌, వివిధ జిల్లాల సహకార సంఘాల ప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. 


బడ్జెట్‌లో వ్యవసాయానికి 60 వేల కోట్లు 

బడ్జెట్‌లో వ్యవసాయానికి ఏటా రూ.60 వేల కోట్లకుపైగా కేటాయిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. టెస్కాబ్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు అభినందనల సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూపీ వంటి పెద్దరాష్ట్రాలు సైతం మన బడ్జెట్‌లో మూడోవంతు ఖర్చుపెట్టడం లేదన్నారు. రైతు సమన్వయసమితి పేరును త్వరలో ‘రైతుబంధు’ సమితిగా మారుస్తామని తెలిపారు. టెస్కాబ్‌ ఆధ్వర్యంలో 799 ప్రాథమిక సహకారసంఘాల పరిధిలో 10.61 లక్షల మంది రుణాలు పొందారని తెలిపారు. 2019-20 వానకాలం సీజన్‌లో రూ. 2,653 కోట్లు, యాసంగిలో ఇప్పటివరకు రూ. 1,095 కోట్ల రుణాలు, రూ.262.81 కోట్ల రుణాలు టెస్కాబ్‌ ద్వారా తీసుకున్నారని చెప్పారు.  


రెండోసారి టెస్కాబ్‌.. మూడోసారి డీసీసీబీ

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మం డలం గజసింగవరానికి చెందిన రవీందర్‌రావు వరుసగా మూడోసారి డీసీసీబీ చైర్మన్‌గా, రెండోసారి టెస్కాబ్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గంభీరావుపేట సహకార సంఘం అధ్యక్షుడిగా 2005, 2013లో, ఇటీవల ఫిబ్రవరిలో గెలిచి డీసీసీబీ చైర్మన్‌గా హ్యాట్రిక్‌ సాధించారు. 2015లో మే నెలలో టెస్కాబ్‌ తొలిచైర్మన్‌గా రవీందర్‌రావు బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి దాదాపు 15 ఏండ్లుగా రాష్ట్రస్థాయిలో సహకార నేతగా సేవలందిస్తున్నారు. కొండూరి అనుభవానికి గుర్తింపుగా నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.


logo
>>>>>>