మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:39:55

న్యూ టెక్‌హబ్‌ హెదరాబాద్‌

న్యూ టెక్‌హబ్‌ హెదరాబాద్‌

 • తూర్పున ఐదు ఐటీ పార్కులు
 • వరల్డ్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా సిటీ
 • నాలాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక
 • నైట్‌ఫ్రాంక్‌ ఆఫీస్‌ ప్రారంభంలో ఐటీ మంత్రి కే తారకరామారావు
 • వర్క్‌ ఫ్రం హైదరాబాద్‌  నివేదిక ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గత ఆరేండ్లలో హైదరాబాద్‌ నగరాన్ని న్యూ టెక్‌హబ్‌గా తీర్చిదిద్దగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు. ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్రమాణాలు పాటిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని డల్లాస్‌ సెంటర్‌లో నైట్‌ఫ్రాంక్‌ ఇండియా సంస్థ నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. అనంతరం ‘వర్క్‌ ఫ్రం హైదరాబాద్‌' నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆఫీస్‌ స్పేస్‌లో హైదరాబాద్‌ ఒకప్పుడు 6వ స్థానంలో ఉండేదని, తెలంగాణ రాష్ట్రంగా అవతరించాక రెండోస్థానానికి తీసుకురాగలిగామని చెప్పారు. త్వరలోనే బెంగళూరును వెనక్కి నెట్టి  నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని కేటీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గొప్ప పేరున్న నైట్‌ఫ్రాంక్‌ సంస్థ.. హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడం శుభపరిణామని అన్నారు. పెట్టుబడులు ఆకర్షించడం, గ్లోబల్‌ ఇన్వెస్టర్లను తీసుకురావడంలో విజయవంతం అయ్యామని కేటీఆర్‌ పేర్కొన్నారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకురాగలిగామని తెలిపారు. గత ఆరేండ్లలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు. ఐటీ రంగమంతా హైదరాబాద్‌ నగరానికి పశ్చిమంవైపు మాత్రమే కేంద్రీకృతం అయ్యిందన్న మంత్రి కేటీఆర్‌.. తూర్పు దిశలోనూ ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉప్పల్‌, నాగోల్‌, ఎల్బీనగర్‌, కొంపల్లి  తదితర ప్రాంతాల్లో కొత్తగా ఐదు ఐటీ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు నగరం నలువైపులా పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. గతంలో హైదరాబాద్‌ నగరం ఐటీ రంగం బ్యాక్‌ఎండ్‌  కార్యకలాపాలకే పరిమితం కాగా, తాజాగా ప్రాథమిక ఉత్పత్తులు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ వరకు విస్తరించిందని చెప్పారు.

ముఖ్యమైన బిజినెస్‌ హబ్‌..

కొన్నేండ్లుగా హైదరాబాద్‌ దేశంలోనే ముఖ్యమైన బిజినెస్‌ హబ్‌గా ఆవిర్భవించిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్ట్‌ శిశిర్‌ బైజల్‌ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ పాలసీతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయన్నారు. ఐటీతోపాటు, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, టైక్స్‌టైల్స్‌ వంటి రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసిందన్నారు. గట్టి పొలిటికల్‌ విల్‌ ఉన్న ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యపడిందన్నారు. కరోనా పరిస్థితుల నుంచి కోలుకోవడానికి రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రయత్నిస్తున్నదని, తిరిగి పూర్వ వైభవం దిశగా అడుగులేస్తున్నదని బైజల్‌ అభిప్రాయపడ్డారు. డాటా సెంటర్‌, వేర్‌హౌజెస్‌లకు డిమాండ్‌ ఒక్కసారిగా పుంజుకున్నదని చెప్పారు. ఈ-కామర్స్‌ సంస్థలకు వేర్‌హౌజ్‌లు, లాజిస్టిక్స్‌ కేంద్రాల అవసరం ఏర్పడిందన్నారు. మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, నైట్‌ఫ్రాంక్‌ ఇండియా హైదరాబాద్‌ డైరెక్టర్‌ శ్యాంసన్‌ ఆర్థర్‌, సంస్థ ప్రతినిధులు విరల్‌దేశాయ్‌, రజినీసిన్హా, సతీశ్‌రాజేంద్రన్‌, డెబిన్‌ మోజా పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా..

బల్క్‌డ్రగ్స్‌ క్యాపిటల్‌గా ఖ్యాతిగాంచిన హైదరాబాద్‌ త్వరలోనే ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా అవతరించనున్నదని మంత్రి కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడోవంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయన్నారు. కరోనాకు తొలి వ్యాక్సిన్‌ సైతం హైదరాబాద్‌ నుంచే వచ్చే అవకాశముందని చెప్పారు. 

నాలాల అభివృద్ధి.. 

హైదరాబాద్‌ నగరంలో వర్షాలు, వరదలు వచ్చినా తట్టుకునేలా స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వర్షపునీరు పోవడానికి వీలుగా డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించనున్నామని ప్రకటించారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదించిదని, ఈ పాలసీ ప్రకారం ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రజలు తమ అవసరాల కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సిన పనిలేకుండా విద్య, వైద్యం సహా వసతులన్నీ ఆయా టౌన్‌షిప్‌లలోనే అందుబాటులో ఉంటాయన్నారు. 2020 సంవత్సరంలో ప్రపంచానికి కరోనా సవాల్‌గా నిలిచిందని, ఇంతటి విపత్తును తెలంగాణ సర్కారు విజయవంతంగా ఎదుర్కొనగలిగిందని కేటీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కరోనా నియంత్రణలో ఇతర రాష్ర్టాలు, నగరాలకంటే మనమే మెరుగ్గా ఉన్నామన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలు.. 

 • కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ లావాదేవీల్లో 2014-2019 మధ్య కాలంలో హైదరాబాద్‌ 172% వృద్ధిని సాధించింది.
 • సానుకూల అద్దెల వృద్ధిని నమోదుచేసిన నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. ఏటా 2% అద్దెలు పెరుగుతున్నాయి.
 • పదేండ్లలో నివాస ధరలు 5.3% సీఏజీఆర్‌ చొప్పున పెరిగాయి. కరోనా సవాళ్లల్లో సైతం అద్దెలు స్థిరంగానే ఉన్నాయి.
 • మార్కెట్‌లో అనిశ్చితి ఏర్పడినా విక్రయా లు తగ్గినా, దేశంలో రెండు మెట్రో నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లో నివాస ధరల తగ్గుదలలో తేడాలు కనిపించలేదు.
 • కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో 2014లో 6వ ర్యాంక్‌లో ఉన్న నగరం 2019లో 2వ ర్యాంక్‌కు చేరుకున్నది.
 • విమాన ప్రయాణాల్లో దేశీయంగా హైదరాబాద్‌ విమానాశ్రయం వాటా భారీగా పెరిగుతున్నది. 2014 -15లో 5.5% వాటా ఉంటే, 2019-20లో 6.4శాతానికి చేరింది.
 • డాటా సెంటర్‌ ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.