శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:32

సోమశిలలో కొత్తరాతి యుగపు గొడ్డలి

సోమశిలలో కొత్తరాతి యుగపు గొడ్డలి

క్రీస్తు పూర్వం 4000-2000 సంవత్సరాల మధ్యకాలానిది: ఈమని శివనాగిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల గ్రామంలో కొత్తరాతి యుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. క్రీస్తు పూర్వం 4000-2000 సంవత్సరాల మధ్యకాలపు (కొత్తరాతియుగపు) రాతి గొడ్డలి బయటపడిందని పురావస్తుశాఖ స్థపతిగా పనిచేసి, ప్రస్తుతం కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతి సీఈవోగా పనిచేస్తున్న ప్రముఖ పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.  కృష్ణాతీర గ్రామమైన సోమశిలలో ఆదివారం సోమేశ్వరాలయ పరిసరాల్లో తన అన్వేషణలో కొత్తరాతియుగపు రాతిగొడ్డలి బయపడిందని తెలిపారు. ఆలయానికి తూర్పు దిశన ఉన్న తెలుగు పెంటయ్య చేనులో తనకు ఈ గొడ్డలి దొరికిందని శివనాగిరెడ్డి వెల్లడించారు. నాలుగు అంగుళాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు, అంగుళం మందమున్న ఈ గొడ్డలి నల్లశానపు రాతితో చేసి అంచుతేలేటట్టు అరగదీసి నునుపుగా తీర్చిదిద్దినట్టు ఉన్నదని పేర్కొన్నారు. గొడ్డలి చుట్టూ పాటిమట్టి, బూడిద అంటుకొని ఉన్నాయని, కొత్తరాతి యుగంలో పశువులను మచ్చిక చేసుకొని వ్యవసాయాన్ని ప్రారంభించి, స్థిరనివాసమేర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఆ కాలంలో  పనిముట్ల తయారీలో నైపుణ్యాన్ని కనబరిచారని ఆయన వివరించారు. 1980 ప్రాంతంలో   సోమశిల దేవాలయాలకు నీటి ముంపు ఉందని గ్రహించి అక్కడి నుంచి  ఎగువన పునర్నిర్మించినపుడు కూడా కొత్త రాతియుగపు విసుర్రాళ్లు, సానరాళ్లు, బయటపడ్డాయని తెలిపారు. 


logo