శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:57

ఫొటో క్లిక్‌ చేస్తే 10 వేలు కట్టాల్సిందే!

ఫొటో క్లిక్‌ చేస్తే 10 వేలు కట్టాల్సిందే!

  • వాట్సాప్‌లో వచ్చే ఫొటోలు, లింకులతో మాల్‌వేర్‌
  • వ్యక్తిగత ఫొటోలు పంపి డబ్బు డిమాండ్‌
  • సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

ఫొటోనే కదా అని క్లిక్‌ చేస్తే తేడాలొచ్చేస్తాయ్‌..! సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు.. మాల్‌వేర్‌ (ప్లగ్‌ ఇన్స్‌) సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫొటోలు, లింకుల ఆధారంగా ఆటమొదలెడతారు. మీ వ్యక్తిగత ఫొటోలను చోరీ చేసి.. మీకే పంపి డబ్బులివ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  ప్రస్తుతంస్మార్ట్‌ఫోన్ల వినియోగం బా గా పెరిగింది. దానికి తగ్గట్టుగా మొబైల్‌ బ్యాంకింగ్‌, పేమెంట్‌ గేట్‌వేలు, ఫొటోలు, వ్యక్తిగత సమాచారం ఎక్కువగా మొబైల్‌ఫోన్లలో నిక్షిప్తమై ఉంటున్నది. ఇదే అదనుగా భావించిన నేరగాళ్లుఫొటోలు, లింక్‌ల రూ పంలో ఈ మాల్‌వేర్‌ స్మార్ట్‌ఫోన్లకు పంపుతున్నారు. వాటిని క్లిక్‌ చేయగానే మాల్‌వేర్స్‌ మొబైల్‌లో ప్రవేశిస్తున్నాయి. ఇక ఫోన్‌ వారి ఆధీనంలోకి వెళ్తుంది. అందులోని వ్యక్తిగత సమాచారం, ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారు. 

రుణం తీసుకున్నారని బురిడీ

హైదరాబాద్‌లో నివాసంఉంటున్న ఓ యువతికి ఇటీవల గుర్తు తెలియని నంబరు నుంచి వాట్సాప్‌ మెసేజ్‌తోపాటు ఓ ఫొటో, లింక్‌ వచ్చింది. ‘మేడమ్‌ మీరు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపడతారా. ఇతను మీ ఫోన్‌ నంబరుతో రుణం తీసుకున్నాడు. ఆ రుణా న్ని సరిగా కట్టడం లేదు. అతను మీకు తెలిస్తే మాకు కిందఉన్న లింక్‌లో సమాచారం ఇవ్వండి’ అనే మెసేజ్‌ ఉంది. కంగుతిన్న యువతి అసలు నా నంబరు ఎలా లింక్‌ చేశాడంటూ వాట్సాప్‌ చాటింగ్‌లో గొడవకు దిగింది. ‘మాకేం తెలియదు మేడం.. మీ నంబరు మీద రుణం ఉంది. అతని ఆచూకీ చెప్పండి’ అని చాటింగ్‌ ఆపేశాడు. మూడ్రో జుల తర్వాత అదే నంబరు నుంచి కొన్ని ఫొ టోలతో కూడిన మెసేజ్‌ వచ్చింది. అది చూడగానే యువతి కంగుతిన్నది. తన వ్యక్తి గత ఫొటోలు ఎలా బయటకొచ్చాయంటూ నిలదీసింది. రూ.10వేలు ఇస్తే మెసేజ్‌ డిలీట్‌ చేస్తానని, లేదంటే మీ తల్లిదండ్రుల నంబర్లకూ పంపుతానని బెదిరించాడు. పట్టించుకోకపోవడంతో కొద్ది సేపటికి యువతి తల్లిదండ్రుల నంబర్లకు ఫొటోలు పంపాడు. కలవరానికి గురై.. డబ్బు పంపేందుకు అంగీకరించి ఐటీ నిపుణులను సంప్రదించింది.

అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్లు ఫొటోలు, లింక్‌లలో ప్లగ్‌ ఇన్స్‌ నింపి పంపుతున్నారు.  వాళ్లు పంపే మెస్సేజ్‌లు మ నం క్లిక్‌ చేసేంత ఆసక్తిగా ఉంటున్నా యి. క్లిక్‌ చేయగానే మీ చేతిలో ఫోన్‌ వాళ్ల హస్తగతమవుతుంది. వ్యక్తిగత సమాచారం, ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. లింక్‌లను క్లిక్‌ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి.

-సందీప్‌ ముదల్కర్‌, ఐటీ నిపుణులు