బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:46

కొత్త మోసగాళ్లు

కొత్త మోసగాళ్లు

  • ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసినట్టు ఫేక్‌ మెసేజ్‌
  • కిరాణా, చిన్న దుకాణాదారులకు బురిడీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రద్దీగా ఉండే షాపులే టార్గెట్‌! ముగ్గురు, నలుగురు కలిసి వెళ్లి కావ్సాలిన వస్తువులన్నీ కొంటారు.. ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తామని నంబర్‌ అడుగుతారు.. డబ్బులు వచ్చినట్టు ఫేక్‌ మెసేజ్‌ పంపించి జారుకుంటారు! ఇప్పుడు ఇదే కొత్త తరహా మోసం. కరోనా నేపథ్యంలో కరెన్సీ కాకుండా, గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే వంటి ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వేను వాడుతున్నారు. ఇదే అదనుగా కేటుగాళ్లు కిరాణా, ఇతర దుకాణాలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. అవసరాన్ని బట్టి రద్దీ ఉండే ప్రాంతాల్లో బట్టలు, చెప్పులు, కిరాణా దుకాణాలను టార్గెట్‌ చేసి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు.

‘బిల్లు కట్టేందుకు డబ్బుల్లేవు.. మీ పేటీ ఎం, గూగుల్‌పే, ఫోన్‌పే నంబర్‌ చెప్పండి. మా ఫ్రెండ్‌ ఫోన్‌ నుంచి వేయిస్తాం’ అంటారు. దుకాణం యజమాని ఫోన్‌నంబర్‌, షాప్‌ పేరు ఇతర వివరాలు చెప్పగానే అప్పటికే కంప్యూటర్‌ ముందు సిద్ధంగా ఉన్న స్నేహితుడికి ఈ వివరాలు చెప్పి, ఎంత జమచేయాలో కూడా చెబుతారు. వెంటనే నిమిషాల్లో సదరు వ్యాపారి ఫోన్‌నంబర్‌కు ఓ కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అది అచ్చం డిజిటల్‌ పేమెంట్‌ చేశాక వచ్చే మెసేజ్‌లా ఉంటుంది. కానీ వాస్తవానికి అది బ్యాంక్‌ సందేశం కాదు. కంప్యూటర్‌ ద్వారా దాన్ని ఈ గ్యాంగ్‌వాళ్లే సృష్టిస్తారు. బిజీలో ఉండడం, రెగ్యులర్‌గా వచ్చే మెసేజ్‌లను పోలి ఉండటంతో దుకాణం వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. అది కంప్యూటర్‌ మెసేజ్‌ కావడంతో ఎవరు మోసం చేశారన్నది కూడా తెలియకుండాపోతున్నది. ఈ తరహా మోసం ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకున్నది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో మొత్తం గ్యాంగ్‌తోపాటు, రూ.10 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తతరహా మోసాల నేపథ్యంలో దుకాణాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.  


logo