గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 01:56:55

కేసీఆర్‌ యుగపురుషుడు

కేసీఆర్‌ యుగపురుషుడు

  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
  • తెలంగాణభవన్‌లో సంబురాలు
  • సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నూతన రెవెన్యూ చట్టం ద్వారా సీఎం కేసీఆర్‌ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రతి యుగానికి ఒక యుగపురుషుడు జన్మిస్తారని ఆయనే సీఎం కేసీఆర్‌ అని అభివర్ణించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత తలసాని సాయికిరణ్‌యాదవ్‌ శనివారం తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ ప్రజలు, రైతాంగం పడుతున్న కష్టాలకు చరమగీతం పాడటానికి సీఎం కేసీఆర్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చారని మంత్రి తలసాని పేర్కొన్నారు. దసరా, బోనాలు, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలప్పుడు సంబురాలు చేసుకున్నట్టే.. కొత్త చట్టం వచ్చినప్పుడు కూడా రైతులు, ప్రజలు సంతోషంతో సంబురాలు చేసుకున్నారని చెప్పారు. కేటీఆర్‌ మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉండటం హైదరాబాద్‌ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. సైబరాబాద్‌లో ఉన్న దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిని చూస్తే స్విట్జర్లాండ్‌లో ఉన్నట్టు అనిపిస్తుందని తలసాని అభివర్ణించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ లాగానే త్వరలో బీఆర్‌ఎస్‌ను తీసుకొస్తామని ఆయన తెలిపారు.

కేంద్రమంత్రి మాటలు హాస్యాస్పదం

ఆరోగ్యశ్రీ ముందు ఆయుష్మాన్‌ భారత్‌ పనికిరాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్ర బృందాలు సైతం మెచ్చుకున్న విషయాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గుర్తుచేసుకోవాలని హితవుపలికారు. పీపీఈ కిట్లు దాచిపెట్టుకున్నామని కేంద్రమంత్రి అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

కొత్త రెవెన్యూ చట్టం సాహసోపేతం

రైతులకు పంట పండించడమే పనిగా ఉండాలి తప్ప.. వేరే కష్టాలు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ అన్నదాతల కోసం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది సాహసోపేతమైన చర్య. తెలంగాణ రైతులు, ప్రజలను రెవెన్యూ కష్టాల నుంచి బయటపడేసేందుకు రెవెన్యూ చట్టాన్ని తెచ్చారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు .

- వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి 

సీఎం గొప్ప దార్శనికుడు 

అనేక చరిత్రాత్మక నిర్ణయాలకు రూపకల్పన చేస్తున్న సీఎం కేసీఆర్‌ యుగ పురుషుడు. రైతులను ఇబ్బంది కలిగించే అనేక విధానాలను తొలగించి సరళమైన నూతన విధానాలను అమలుచేస్తున్న గొప్ప దార్శనికుడు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతోపాటు కొత్త రెవెన్యూ విధానాన్ని అమలుచేస్తున్న ఘనత ఆయనకే దక్కుతున్నది.

-కొప్పుల ఈశ్వర్‌, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి (పెద్దపల్లి జిల్లా కార్యక్రమంలో)

చరిత్రలో నిలిచిపోతుంది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతనంగా అమలుపరుస్తున్న రెవెన్యూ చట్టం చరిత్రలో నిలిచిపోతున్నది. సమాజంలో 90 శాతం ఘర్షణలకు భూవివాదాలే కారణం. వాటిని పరిష్కరించేందుకు సీఎం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టంతో తెలంగాణ నేరరహిత రాష్ట్రంగా అవతరించబోతున్నది.

- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి  (వనపర్తి జిల్లా కార్యక్రమంలో)

భూ వివాదాలకు చెక్‌

నూతన రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం. ఈ చట్టంతో రాష్ట్రంలో లక్షలమంది రైతులకు మేలు జరుగుతుంది. ప్రజల కష్టాలు తీరనున్నాయి. భూవివాదాలకు చెక్‌ పడనున్నది. అవకతవకలకు తావులేని విధంగా ప్రతి అంగుళం భూమిని మ్యాపుల ద్వారా డిజిటలైజేషన్‌ చేస్తారు. బంగారు తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా.. సీఎం కేసీఆర్‌ సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. 

-పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణాశాఖ మంత్రి (ఖమ్మంలో మీడియాతో..)

పేదలకు మేలు

ముఖ్యమంత్రి తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం చాలా గొప్పది. పేదలకు ఎంతో మేలు చేస్తుంది. భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దుచేసింది. కొత్త చట్టంపై సీఎం కేసీఆర్‌కు ఊరూరా క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని అన్నివర్గాల ప్రజలు హర్షిస్తున్నారు. 

- అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, న్యాయశాఖ మంత్రి (మంచిర్యాల జిల్లా కార్యక్రమంలో)

కొత్త  చట్టంతో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ

కొత్త రెవెన్యూ చట్టంతో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ మరింత పటిష్టం అవుతున్నది. నూతన చట్టం తీసుకొచ్చినందుకు ముస్లిం సమాజం తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. చట్టంలో వక్ఫ్‌ భూములకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌.. దేశంలోనే ఏకైక సెక్యులర్‌ సీఎం. వక్ఫ్‌ ఆస్తులను రక్షించేందుకు అవిరళ కృషిచేస్తున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దిశగా ఆలోచించలేదు. కబ్జాకు గురైన వక్ఫ్‌ ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం. వక్ఫ్‌ భూముల రిజిస్ట్రేషన్లు రద్దుచేస్తాం.

-మహ్మద్‌ సలీం , వక్ఫ్‌బోర్డు చైర్మన్‌  (హైదరాబాద్‌లో మీడియాతో..)


logo