జీహెచ్ఎంసీ పోలింగ్లోకొత్త రికార్డు

- 46.55 శాతం ఓటింగ్ నమోదు
- మందకొడిగా మొదలైనా.. సాయంత్రానికి జోరు
- ఆర్సీపురం, పటాన్‌చెరుల్లో 65 శాతానికిపైగా నమోదు
- అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99%
- 2016 ఎన్నికల కంటే 1.28% అధికం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి,నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరూ అనుకున్నట్టు గా పోలింగ్ శాతం తక్కువగా నమోదు కాలేదు. క్రితంసారి కంటే కాస్త ఎక్కువగానే నగర పౌరులు పోలింగ్‌లో పాల్గొన్నారు. మంగళవారం 149 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారం వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల చరిత్రలోనే ఇది అత్యధికమని చెప్పారు. క్రితంసారి జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.28 శాతం మంది ఎక్కువగా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు. గత రెండు దశాబ్దాలలో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల సరళిని పరిశీలిస్తే ప్రతిసారి పోలింగ్ శాతం పెరుగుతూ వస్తున్నదని పేర్కొన్నారు. తొలుత మందకొడిగా ఓటింగు మొదలైనప్పటికీ మధ్యాహ్నం నుంచి ఊపందుకున్నదని చెప్పారు. గ్రేటర్‌వ్యాప్తంగా 9,101 పోలింగు కేంద్రాల నుంచి వచ్చిన వివరాలను క్రోడీకరించి.. పొరపాట్లు జరుగకుండా పరిశీలించడంతో తుది వివరాలను ప్రకటించడంలో ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు.
మందకొడిగా మొదలై..
మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగు మొదలుకాగా, అన్ని డివిజన్లలోనూ తొలుత మందకొడిగా సాగింది. మొదటి రెండు గంటల్లో కేవలం 3.95 శాతం మాత్రమే నమోదైంది. ఆపై రెండు గంటల తర్వాత 11.62 శాతం, తదుపరి రెండు గంటల్లో 20.35 శాతానికి చేరుకుంది. దీంతో గ్రేటర్ ఓటర్లు మహా నిర్లిప్తతను ప్రదర్శించినట్లుగా అందరూ ఆందోళన చెందారు. కానీ మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగు కేంద్రాలకు రావడం మొదలుకావడంతో సాయంత్రానికి గ్రేటర్ ఎన్నికల చరిత్రలో అత్యధిక పోలింగు శాతం నమోదైంది. పాతబస్తీ పరిధిలోని డివిజన్లలోనూ మధ్యాహ్నం తరువాత పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య 9.41 శాతం పోలింగ్ నమోదు కాగా... సాయంత్రం 5-6 గంటల మధ్యలో 8.81 శాతం ఓటింగ్ జరిగింది. ఎన్నికల అధికారులు వెల్లడించిన తుది నివేదిక ప్రకారం..149 డివిజన్లలో 34,50,331 మంది అనగా 46.55 శాతం పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్లో 67.71 శాతం పోలింగు నమోదు కాగా... అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్లో 32.99 శాతం పోలింగు జరిగింది. సర్కిళ్లవారీగా రామచంద్రాపురం పరిధిలోనే అత్యధికంగా 65.09 శాతం పోలింగ్ జరుగగా.. రెండో స్థానంలో గాజులరామారం (53.65 శాతం), మూడోస్థానంలో చాంద్రాయణగుట్ట (53.07 శాతం) ఉన్నాయి.
నేడు మలక్‌పేటలో రీపోలింగ్
బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారైన కారణంగా నిలిచిపోయిన మలక్‌పేట్ డివిజన్ ఎన్నిక గురువారం జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలకు కలెక్టర్ శ్వేతా మహంతి సెలవు ప్రకటించారు.
సమయం పోలైన ఓట్లు శాతం ఆ రెండు గంటల్లో పోలింగు శాతం
ఉదయం 9.00 గంటల వరకు 2,92,819 3.95 - -
ఉదయం 11 గంటల వరకు 8,61,654 11.62 5,68,835 7.67
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 15,08,766 20.35 6,47,112 8.73
మధ్యాహ్నం 3 గంటల వరకు 22,06,173 29.76 6,97,407 9.41
సాయంత్రం 5 గంటల వరకు 27,50,532 37.11 5,44,358 7.35
సాయంత్రం 6 గంటల వరకు 34,04,060 45.92 6,53,528 8.81
తుది నివేదిక 34,50,331 46.55 46,271 0.63
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు