బుధవారం 03 జూన్ 2020
Telangana - May 18, 2020 , 00:48:20

వెదజల్లే పద్ధతితోనే వరిసాగు..కూలీల కొరతకు చెక్‌

వెదజల్లే పద్ధతితోనే వరిసాగు..కూలీల కొరతకు చెక్‌

వరిసాగుకు ముందుగా నారు పోయాలి.. తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వెదజల్లే పద్ధతిని ఎంచుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నాడు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ రైతు చల్లబట్ల సైదిరెడ్డి. తనకున్న 10 ఎకరాల్లో ఈ పద్ధతి ద్వారా నాలుగేళ్లుగా వరిసాగు చేస్తూ అధిక దిగుబడి సాధించడంతో పాటు ఎకరాకు రూ.4500 వరకు ఆదా చేస్తున్నాడు.

క్రమపద్ధతిలో నీరు పెట్టాలి

పొలమంతా వడ్లు వెదజల్లడం పూర్తి కాగానే రెండు రోజుల తర్వాత నీరు పెట్టి కొన్ని గంటల తర్వాత తొలగించాలి. ఈవిధంగా వడ్లు పూర్తిగా మొలిచి పిలక రెండు ఇంచులు పెరిగే వరకు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి నీరు పెడుతూ.. తొలగిస్తూ ఉండాలి. వరి పిలకలు మూడు ఇంచులు పెరిగిన అనంతరం పొలంలో నీళ్లు నిలబెట్టాలి. 20రోజుల తర్వాత కలుపు నివారణకు ఎకరాకు లీటర్‌ చొప్పున కలుపు మందు పిచికారీ చేయాలి. దీంతో పొలంలో కలుపు పెరగదు. 

ముందుగానే దుక్కులు

    • సీజన్‌కు ముందుగానే దుక్కిదున్ని, ఆ తర్వాత పొలాన్ని నాలుగుసార్లు దమ్ము చేసి సిద్ధం చేసుకోవాలి.
    • మరో రెండు సార్లు దమ్ము చేసి, దమ్ములోనే అడుగుపిండి చల్లాలి. అనంతరం గొర్రు తోలి పొలంలో మడుల నిండా నీరు పెట్టాలి. 
    • కరిగట్టుకు ఓరోజు ముందు వడ్లు నీటిలో నానబెట్టి 24 గంటల తర్వాత బస్తాలో వేసి మరో 24 గంటలు ఉంచాలి. ఈ దశలో వడ్లు కొద్దిగా మొలకెత్తుతాయి.
    • కరిగట్టు చేసిన అనంతరం మరుసటి రోజు మడుల్లో నీరు తీసి పొడవాటి తాడు సాయంతో ప్రతి మూడు మీటర్ల తర్వాత కాలిబాట ఉండేలా తయారు చేసుకోవాలి. ఇప్పటికే నానబెట్టి మొలకలు వచ్చిన ఒడ్లను చల్లే ప్రక్రియ ప్రారంభించి.. కాలిబాటల్లో నడుస్తూ క్రమ పద్ధతిలో పొలమంతా వడ్లు వెదజల్లాలి.

ఎకరాకు 40బస్తాల దిగుబడి...

కూలీలతో వరినాట్లు పెట్టడం కంటే వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేసిన రైతు అధిక దిగుబడి సాధించాడు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తే.. వెదజల్లే పద్ధతి వల్ల 40 బస్తాల దిగుబడి వచ్చినట్లు రైతు సైదిరెడ్డి తెలిపాడు. కూలీల కొరత అధిగమించడంతో పాటు సమయానికి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ సదరు రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సాగు ఇలా..

సైదిరెడ్డి తన 10ఎకరాల భూమిలో వెదజల్లే పద్ధతితోనే వరిసాగు చేస్తున్నాడు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకొని సాగు పనులు మొదలు పెడతాడు. ఇందుకు గాను అతనికి కూలీల అవసరం ఉండదు. కేవలం ఒక సహాయకుడితో సాగుపనులు పూర్తి చేసుకుంటున్నాడు. 

ఎకరాకు రూ.4500 ఆదా

వరిసాగు సీజన్‌లో నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో కూలీల కొరత అధికంగా ఉంటుంది. నాట్లు వేసేందుకు ఎకరాకు సుమారు రూ.3500 వరకు ఖర్చు వస్తుంది. కూలీలు దొరక్క నిర్ణీత సమయంలో వరినాట్లు వేయకపోతే పంట దిగుబడి తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అయితే వడ్లు వెదజల్లే పద్ధతి ద్వారా కూలీల కొరత అధిగమించడంతో పాటు సమయానికి సాగు చేసుకునే వీలుంది. కలుపు నివారణ మందులు వాడటం వల్ల వరిపొలం ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తోంది. ఈ పద్ధతి ద్వారా కలుపు నివారణతో పాటు వరినాటేందుకు కూలీల ఖర్చు ఎకరాకు రూ.4500 వరకు ఆదా అవుతోంది. 

కూలీల బాధలు తీరినై..

సాగర్‌ ఆయకట్టులో వరిసాగుచేసే సీజన్‌లో కూలీల కొరత ఉంటది. దీంతో సాగు ఆలస్యమై దిగుబడి తగ్గుతుండేది. అందుకే ఆలోచించి నాకున్న 10 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తున్నా. దీంతో కూలీల ఖర్చు రూ.4500 మిగులుతున్నై. సరైన సమయంలో సాగు చేస్తుండడంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తోంది. అందరికీ ఎకరాకు 35 బస్తాలు వస్తే.. నాకు 40బస్తాలు వచ్చింది.  

- చల్లబట్ల సైదిరెడ్డి, రైతు, శెట్టిపాలెం, వేములపల్లి logo