e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home తెలంగాణ వచ్చే ఏడాది నుంచే కొత్త మెడికల్‌ కాలేజీలు!

వచ్చే ఏడాది నుంచే కొత్త మెడికల్‌ కాలేజీలు!

  • భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
  • రోడ్లు భవనాల శాఖకు క్యాబినెట్‌ ఆదేశం
  • పెరుగనున్న మరో 900 మెడికల్‌ సీట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఏర్పాటుచేయనున్న ఏడు నూతన మెడికల్‌ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం కాలేజీల భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని వైద్యారోగ్య, ఆర్‌అండ్‌బీ శాఖలను ఆదేశించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సమావేశమైన క్యాబినెట్‌.. హాస్టళ్లు, కాలేజీలు, బెడ్లు తదితర అంశాలపై చర్చించింది. అవసరమైన వసతులను సత్వరమే ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే మెడికల్‌ కాలేజీల కోసం స్థలాన్వేషణ, సౌకర్యాల కల్పనకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని వైద్యాధికారులకు సూచించింది. సంగారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌, నాగర్‌కర్నూల్‌లలో కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం రెండు నెలల క్రితం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అధికారులు అందించారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలుపుకొని మెడికల్‌ కాలేజీల సంఖ్య 40కి చేరనున్నది. దీంతో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు.

ఒక్కో కాలేజీలో 150 సీట్లు..
కొత్త మెడికల్‌ కాలేజీల్లో 150 చొప్పున మొత్తం 1,050 సీట్లు అందుబాటులోకి వస్తాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ విభాగం తమ ప్రతిపాదనల్లో ఇదే అంశాన్ని చేర్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 మెడికల్‌ కాలేజీలుండగా, వీటిల్లో 1,615 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీలో 100, బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఉన్న మరో 50 సీట్లు కలిపితే ప్రభుత్వం ఆధ్వర్యంలో సీట్ల సంఖ్య 1,765. కొత్తగా వచ్చే 1,050 సీట్లు కలుపుకుంటే మొత్తం 2,815 ఎంబీబీఎస్‌ సీట్లు అవుతాయి. రాష్ట్రంలోని 23 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఉన్న 3,350 సీట్లతో కలిపి మొత్తం 6,165 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం జగిత్యాలలో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ ఉండగా, అక్కడ 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో కొత్తగా ఏర్పాటుచేయబోయే ఏడు మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఒక్కో నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఒక్కో నర్సింగ్‌ కాలేజీకి 100 సీట్లు రానున్నాయి. మొత్తం 1,250 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

- Advertisement -

సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలకు త్వరలో శంకుస్థాపన
కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐదు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలపై క్యాబినెట్‌ చర్చించింది. వాటి సత్వర నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై ఆరా తీసింది. వీటి నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. గచ్చిబౌలిలోని టిమ్స్‌ దవాఖానతోపాటు, హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన్లకు ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ (టిమ్స్‌)గా నామకరణం చేయాలని క్యాబినెట్‌ తీర్మానించింది. టిమ్స్‌ గచ్చిబౌలి, టిమ్స్‌ సనత్‌నగర్‌, టిమ్స్‌ ఎల్బీ నగర్‌, టిమ్స్‌ అల్వాల్‌ దవాఖానాలుగా అభివృద్ధిచేసి అన్నిరకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను ఒకచోటే అందించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. వరంగల్‌లో ఇప్పటికే మంజూరు చేసిన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన పురోగతిపై చర్చించిన క్యాబినెట్‌, త్వరలో నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించింది. పటాన్‌చెరులో కార్మికుల కోసం కొత్తగా మల్టీ స్పెషాలిటీ దవాఖానను నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ స్థాపన లక్ష్యంగా రానున్న రెండుమూడేండ్లలో దశలవారీగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌ తీర్మానించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana