బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:57:23

ప్లాస్టిక్‌ వ్యర్థానికి కొత్త అర్థం

ప్లాస్టిక్‌ వ్యర్థానికి  కొత్త అర్థం

సూర్యాపేట, నమస్తే తెలంగాణ: పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ ప్రధానమైనది. దీన్ని ఒకసారి వాడిపడేస్తే భూమిలో కలిసిపోవడానికి వందల ఏండ్లు పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు చేసినా తగిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఆ  ముప్పును కొంతైనా తగ్గించేందుకు సూర్యాపేట మున్సిపాలిటీ ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ చేపట్టింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను చిన్న బిళ్లలుగా మార్చి పైపులతయారీ కంపెనీకి విక్రయిస్తున్నది. సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రంలో ప్రత్యేకస్థానం ఉన్నది. పరిశుభ్రతలో అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని గతంలో రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా నిలిచింది. ప్రస్తుతం సూర్యాపేట మున్సిపల్‌ అధికారులు పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌కు రాష్ట్రంలోనే తొలిసారిగా శ్రీకారం చుట్టారు. దీనికోసం రూ.15 లక్షల వ్యయంతో రీసైక్లింగ్‌ మిషన్‌ కొనుగోలు చేశారు. కొద్దిరోజులుగా సూర్యాపేట, పరిసర ప్రాంతాల నుంచి సేకరించిన క్వింటాళ్ల కొద్ది చెత్తను ఈ యంత్రం ద్వారా రీసైక్లింగ్‌ చేశారు. దానిద్వారా వచ్చిన రా మెటీరియల్‌ను హైదరాబాద్‌లో పీవీసీ పైపుల తయారీ కంపెనీలకు కిలో రూ.25 చొప్పున విక్రయించారు. తొలి ప్రయత్నంగా 1006 కిలోలను విక్రయించగా.. మున్సిపాలిటీకి రూ.25,150 ఆదాయం లభించింది. 

వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేశారిలా.. 

సూర్యాపేటలోని 48 వార్డుల నుంచి తడి, పొడి చెత్తను సేకరించిన మున్సిపల్‌ సిబ్బంది కొంతకాలంగా అందులో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరుచేస్తున్నారు. వాటిని రీ సైక్లింగ్‌ చేసేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి చొరువతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, కమిషనర్‌ రామానుజులరెడ్డి రూ.15 లక్షలతో యంత్రాన్ని కొనుగోలుచేశారు. దాన్ని జమునానగర్‌లోని డంపింగ్‌ యార్డువద్ద ఏర్పాటుచేశారు. అక్కడికి వచ్చే ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులతోపాటు ప్లాస్టిక్‌ వస్తువులను  చిన్నచిన్న ముక్కలుగా చేసి మిషన్‌లో వేసి పొడిగా తయారుచేశారు. దానిని మరోమిషన్‌లో వేసి వేడిచేయగా మట్టి, ఇతర వ్యర్థాలు వేరై ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ (చిన్న బిళ్లలు)గా బయటకొచ్చారు. ఇలా వచ్చిన బిళ్లలను పీవీసీ పైపులతోపాటు ఇతర ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి వినియోగిస్తారు. సూర్యాపేటలో తొలి ప్రయత్నంగా ఏర్పాటుచేసిన మిషనరీ ద్వారా గత కొద్దిరోజుల్లో వచ్చిన ప్లాస్టిక్‌ ద్వారా 1,006 కిలోల రా మెటీరియల్‌ తయారుచేశారు.

పర్యావరణానికి ఇబ్బంది కలుగకుండా చర్యలు

వాడి పారేసే ప్లాస్టిక్‌ ద్వారా పర్యావరణానికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకే ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేపట్టాం. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌లో భాగంగా ఇలా చేస్తున్నాం. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరువతో రాష్ట్రంలోనే తొలి ప్రయత్నం విజయవంతమవుతున్నది. రీసైక్లింగ్‌ ద్వారా వచ్చే రా మెటీరియల్‌ను పీవీసీ పైపులతో పాటు ఇతర ఉత్పత్తులకు కూడా వినియోగిస్తారు. రా మెటీరియల్‌తో మరింత ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారిస్తాం. - రామానుజులరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట
logo