శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 02:54:34

కొవిడ్‌తో కొత్త మార్కెటింగ్‌ ఫిజిటల్‌

 కొవిడ్‌తో కొత్త మార్కెటింగ్‌ ఫిజిటల్‌

  • టెక్నాలజీ వాడకంలో పదేండ్లు ముందుకు
  • మార్కెటింగ్‌ రంగంలో కొత్త విప్లవం.. అమాంతం పెరిగిన డిజిటల్‌ పేమెంట్లు
  • చెల్లింపు ఆన్‌లైన్‌లో, కొనేది ఆఫ్‌లైన్‌లో.. ఆటోమొబైల్‌ రంగానికి కొత్తఊపు

“ఫిజిటల్‌.. ఈ పేరు వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఫిజికల్‌, డిజిటల్‌ను కలిపితేనే ఫిజిటల్‌. ఇది హైబ్రిడ్‌ అన్నమాట”

“ఆయన పేరు శ్రీనివాస్‌.. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగి.. బ్యాంకుకు వచ్చిన వినియోగదారులతో అకౌంట్లు తెరిపించడం, హోమ్‌, ఇతర లోన్లు కావాలంటే దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేయించడం ఆయన పని.. లాక్‌డౌన్‌ విధించడంతో ఇప్పుడు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. బ్యాంకు యాజమాన్యం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతో ఇంటి వద్ద నుంచే ఇన్‌స్టా అకౌంట్లు తెరిపిస్తున్నారు. ఖాతాదారులకు ఆన్‌లైన్‌లోనే లోన్లు అప్రూవ్‌ చేయిస్తున్నారు”

కొవిడ్‌-19.. ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించి కోలుకోలేకుండా చేస్తున్నది. ఈ మహమ్మారి వల్ల అనేక రంగాలు పదేండ్లు వెనక్కి వెళ్లాయి. కానీ, ఒక్క రంగం మాత్రం కరోనాను ఎదిరించి పదేండ్లు ముందుకు ఉరికింది. సమీప భవిష్యత్తులో ఊహించుకోలేని కొత్త విధానాలకు తెరతీసింది.. టెక్నాలజీ రంగం. ఆ రంగం చూపించిన దారుల పుణ్యమా అని మనం ఇప్పుడే ఆత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొంటున్నాం. మరో పది, పది హేనేండ్ల తర్వాత వాడాల్సిన టెక్నాలజీని ఇప్పుడే ఉపయోగిస్తున్నాం. అందులో ప్రధానమైనది ఫిజిటల్‌. ఈ పేరు వినడానికే కొత్తగా ఉంది కదూ..! ఫిజికల్‌, డిజిటల్‌ను కలిపితేనే ఫిజిటల్‌. ఇది హైబ్రిడ్‌ అన్నమాట. వివరంగా చెప్పాలంటే.. ఆన్‌లైన్‌లో లాగిన్‌ అయ్యి, నచ్చిన వస్తువును ఎంచుకోవచ్చు. పనితీరు, మోడల్‌ తదితర విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. 

నచ్చితే ఆన్‌లైన్‌లోనే డబ్బును చెల్లించవచ్చు. వస్తువును మాత్రం దగ్గరలోని స్టోర్‌కు వెళ్లి తీసుకోవచ్చు. దీనివల్ల డెలివరీ సమయం ఆదా అవడమే కాకుండా, వస్తువు సరిగా లేకపోతే రిటర్న్‌ చేయడం సులభం అవుతుంది’. పలు ఈ కామర్స్‌ సంస్థల వల్ల ఆన్‌లైన్‌ బిజినెస్‌ పుట్టుకొచ్చింది. రిటైల్‌ రంగం అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిక ఫిజిటల్‌ రంగం వంతు వచ్చేసిందని, భవిషత్తు అంతా దానిదేనని నిపుణులు చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి, దగ్గరలోని స్టోర్‌కు వెళ్లి నాణ్యమైన వస్తువులను తెచ్చుకోవడం అన్నమాట. ఉదాహరణకు దుస్తులు కొనుక్కోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో వెతికి, నచ్చితే దానికి డబ్బులు చెల్లించవచ్చు. అయితే, ఉన్న సమస్య ఏంటంటే.. ఆ వస్తువు మనకు నప్పుతుందో? లేదో? సైజు వస్తుందో? రాదో? అన్నదే. 

ఈ సమస్యకు పరిష్కారమే ఫిజిటల్‌. దుస్తులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన తర్వాత దగ్గరలోని స్టోర్‌కు వెళ్లి, ఆ దుస్తులను తీసుకోవచ్చు. ప్రముఖ షూ కంపెనీ నైకీ ఫిజిటల్‌ విధానానికి మళ్లింది. కంపెనీకి చెందిన యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని, దగ్గరలోని స్టోర్‌లో ఉన్న షూలను చూడొచ్చు. అందులో ఏదైనా షూ నచ్చితే దాన్ని వెంటనే రిజర్వ్‌ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించి, కావాల్సినప్పుడు వెళ్లి తెచ్చుకోవచ్చు. సాధారణంగా.. షూ సైజ్‌ మనకు ఇబ్బందిగా మారుతుంది. స్టోర్లలో ఉండే సైజ్‌ రాకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులకు నైకీ చెక్‌ పెట్టేస్తున్నది. దగ్గరలోని స్టోర్‌కు వెళ్లి మన సైజ్‌, నచ్చిన కలర్‌ చెప్పి షూ తయారు చేయించుకోవచ్చు. ప్రస్తుతానికి పాశ్చాత్య దేశాల్లోనే ఈ తరహా సౌకర్యం ఉన్నా ఇండియావైపు కూడా ఫోకస్‌ పెట్టిందీ కంపెనీ. రాబోయే కాలాన్ని ఏలేది ఫిజిటలేనని నిపుణులు అందుకే అంటున్నారు.

ఆటోమొబైల్‌ రంగానికి మహర్దశే..

కరోనా కాలంలో ఆటోమొబైల్‌ రంగం కుదేలైంది. అయితే, ఆ కరోనానే ఇప్పుడు ఆ రంగాన్ని మరింత పటిష్టంగా తయారు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజా రవాణాకు ప్రజలు మొగ్గు చూపడం లేదని, భౌతిక దూరం పాటించాల్సి వస్తున్నందున సొంత వాహనం కొనుక్కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్తున్నారు. దీంతో ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా ఫిజిటల్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. షోరూంకు వెళ్లి కొనుక్కొనే పరిస్థితి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆన్‌లైన్‌లో అమ్మకాలను ప్రారంభించాలని చూస్తున్నాయి. గుర్‌గావ్‌కు చెందిన స్పిన్నీ అనే స్టార్టప్‌ సంస్థ సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలను, కొనుగోళ్లను ఇలాగే చేపట్టింది. ఈ వినూత్న ఆలోచనతో కరోనా కష్టకాలంలోనూ 600 కార్లను అమ్మగలిగింది. కారు కొనుక్కోవాలనుకునే వినియోగదారుడి వద్దకే కారును తీసుకెళ్తారు. కారును పరిశీలించి, టెస్ట్‌ డ్రైవ్‌ చేశాక ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

గూగుల్‌ ‘షాప్‌లూప్‌'తో  సరికొత్త షాపింగ్‌..

సందర్భం ఏదైనా ట్రెండ్‌ సెట్‌ చేయటంలో గూగుల్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడూ అదే పంథాను కొనసాగించిందీ సంస్థ. షాపింగ్‌లో కొత్త అనుభూతులను పంచేందుకు ‘షాప్‌లూప్‌' పేరుతో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో వినియోగదారులు వీడియోలు చూసి షాపింగ్‌ చేయవచ్చు. ఏదేని వస్తువును కొనాలంటే దాని పనితీరు, డిజైన్‌, మన్నిక.. అన్నీ చెక్‌ చేసుకొని కొంటాం. ఈ యాప్‌లో అలాంటి సౌకర్యమే ఉంది. యాప్‌లో పొందుపరిచే వస్తువులకు ఎక్స్‌పర్ట్‌ సమీక్ష కూడా ఉంటుంది. 90 సెకన్లకు మించకుండా ఉండే వీడియో ద్వారా వస్తువు గుణగణాలను తెలియజేస్తారు. షాప్‌లూప్‌లో ప్రస్తుతానికి మేకప్‌, చర్మసౌందర్యం సంబంధిత వస్తువుల వీడియోలను పొందుపరిచారు. మొబైల్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉండగా, త్వరలోనే డెస్క్‌టాప్‌ వెర్షన్‌ను కూడా తీసుకురానున్నారు.

‘అమెజాన్‌ గో’ వచ్చేసిందిగా..

ఈ-కామర్స్‌ రంగం వచ్చేసరికి చాలా స్టోర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నష్టాల నుంచి బయట పడేందుకు వ్యాపార రంగ నిపుణులు కొత్త దారులను వెతుకున్నారు. అందులోభాగమే.. ‘అమెజాన్‌ గో’. అమెజాన్‌ కంపెనీ ఈ స్టోర్లను ప్రారంభించింది. వీటిల్లో క్యాషియర్లు ఉండరు. క్యాష్‌ కౌంటర్లు ఉండవు. మనకు కావాల్సిన దుస్తులు, వస్తువులను తీసుకొని వెళ్లిపోవడమే. డబ్బంతా అమెజాన్‌ అకౌంట్‌ నుంచే చెల్లించుకోవచ్చు. ఈ స్టోర్లలో అత్యాధునిక కంప్యూటర్‌ విజన్‌ టెక్నాలజీ, డీప్‌ లర్నింగ్‌ అల్గారిథం, సెన్సర్‌ ఫ్యుజన్‌ టెక్నాలజీలను వాడతారు. మన మొబైల్‌లో క్యూఆర్‌ కోడ్‌ను ప్రధాన ద్వారం వద్ద స్కాన్‌ చేసి నేరుగా స్టోర్‌లోకి వెళ్లిపోవచ్చు. ఏదైనా వస్తువును మనం తీసుకోగానే వర్చువల్‌ కార్ట్‌లో దానికి సంబంధించిన బిల్లు చేరిపోతుంది. ఒకవేళ వద్దనుకొని అక్కడే పెట్టేస్తే బిల్లు డిలీట్‌ అవుతుంది. నో లైన్‌.. నో చెకౌట్‌ అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నది. అమెరికాలోని పలు చోట్ల ఈ స్టోర్లను అమెజాన్‌ తెరిచింది.

ఫిజిటల్‌దే ఫ్యూచర్‌

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఫిజిటల్‌ విధానం ఊపందుకున్నది. ఇండియాలోనూ ఈ రంగం మొగ్గ తొడుగుతున్నది. భవిష్యత్తులో ఫిజిటల్‌ వ్యాపారమే సాగుతుంది. ఇక్కడ రిటైల్‌ బ్రాండింగ్‌ అనేది గేమ్‌ చేంజర్‌గా మారింది. ఒకప్పుడు బ్రాండ్‌ను గుర్తించడం కష్టంగా ఉండేది. ఈ-కామర్స్‌ రంగం ఊపందుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కావాల్సిన బ్రాండ్‌ను ఆన్‌లైన్‌లో వెతికి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసి, దగ్గరలోని ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుక్కొనే సమయం వచ్చేసింది. అదే ఫిజిటల్‌.

- ఫ్యూచర్‌ గ్రూప్‌ అధినేత కిశోర్‌ బియానీ

భారీగా డిజిటల్‌ పేమెంట్లు నోట్ల రద్దు వల్ల 

డిజిటల్‌ పేమెంట్లు ఊపందుకున్నాయి. కరోనా దెబ్బకు ఆన్‌లైన్‌ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. కరెన్సీ నోట్ల వల్ల కరోనా వస్తుందన్న అనుమానంతో కొనేవారే కాదు.. అమ్మేవారు కూడా నోట్లను తీసుకోవడానికి జంకుతున్నారు. ‘కరోనా కంటే ముందు.. రోజుకు 15లక్షల నుంచి16 లక్షల లావాదేవీలు జరిగేవి. లాక్‌డౌన్‌లో అత్యవసర వస్తువుల విక్రయమే జరిగింది. అయినా రోజుకు 7.5 లక్షల ఉంచి 8 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇది సాధారణ రోజులతో పోల్చితే చాలా ఎక్కువ’ అని భారత్‌ పే సీఈవో అశ్నీర్‌ గ్రోవర్‌ తెలిపారు.

అంతా ఆన్‌లైన్‌మయం

ఇంట్లో సరుకులు కావాలంటే ఆన్‌లైన్‌.. దుస్తులు కొనాలంటే ఆన్‌లైన్‌.. తినే తిండి కూడా ఆన్‌లైన్‌.. చివరికి రోగమొస్తే చూపించుకోవాలన్నా ఆన్‌లైన్‌.. ప్రతీది ఇంటర్నెట్‌మయం అయిపోయింది. మొన్నటిదాకా రోగం వస్తే దవాఖానకు వెళ్లి, డాక్టర్‌ ఫీజు చెల్లించి సీరియల్‌ నంబరు రాయించుకొని మన సమయం వచ్చే వరకు వేచిచూడాలి. కరోనా దెబ్బకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి వస్తున్నది. ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తే డాక్టర్‌ ఓ టైమ్‌ చెప్తారు. ఆ సమయానికి ఆన్‌లైన్‌లోకి వచ్చి అనారోగ్య పరిస్థితిని వివరించి కావాల్సిన మందులను రాయించుకోవడమే. ఆటోమొబైల్‌, రిటైల్‌, ఫ్యాషన్‌.. ఇలా ఒక్కటేమిటి అనేక రంగాలు ‘భౌతిక దూరం’ బాటలో నడుస్తున్నాయి. టెక్నాలజీని వాడుకొని కొత్తదారుల్లో పయనిస్తున్నాయి.

2014లో ఈ కామర్స్‌ రంగం మార్కెట్‌ ధర రూ.లక్ష కోట్లు ఉండగా, అది 2027 నాటికి అది 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.

2020 జనవరి నాటికి డిజిటల్‌ వినియోగదారులు 68 కోట్లకు చేరగా, ఈ ఏడాది చివరి నాటికి ఆన్‌లైన్‌లో కొనేవాళ్లు 33 కోట్లకు చేరుకునే అవకాశం ఉందట.

ఆన్‌లైన్‌ పాపులేషన్‌ (ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న ప్రజలు)లో అమెరికాను భారత్‌ మించి పోయింది. 2017-20 మధ్య అమెరికా 2శాతం వృద్ధని నమోదు చేయగా, ఇండియా 13 శాతం వృద్ధి నమోదు చేసింది.


logo