ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:47

బ్యాంకింగ్‌ రంగానికి కొత్త జీవం!

బ్యాంకింగ్‌ రంగానికి కొత్త జీవం!

  • మన పీవీ ఘనతలివీ 

అప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.. బ్యాంకింగ్‌ రంగం బేజారైంది.. ఎలాగైనా బ్యాంకింగ్‌ వ్యవస్థను గాడిలో పెట్టాలన్న కృత నిశ్చయంతో పీవీ ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రభావవంతంగా పనిచేయించేలా చర్యలకు ఉపక్రమించింది. రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ ఎం నరసింహం నేతృత్వంలో 1991 ఆగస్టులో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ భారత విత్త వ్యవస్థ నిర్మాణాన్ని, పనితీరును పరిశీలించి మెరుగుపరిచే అవసరమైన సంస్కరణలను ప్రతిపాదించాలి. తొమ్మిది మంది సభ్యులున్న ఈ కమిటీ మూడు నెలలపాటు అధ్యయనం చేసి 1991 డిసెంబర్‌ 17న పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. 

ఆ నివేదికలో విత్త సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని కమిటీ ప్రతిపాదించింది. బ్యాంకుల నిర్వహణలో రాజకీయ జోక్యం తగ్గించాలని, బ్యాంకులకు స్వయంప్రతిపత్తి హోదాను కల్పించాలని వెల్లడించింది. ప్రభుత్వం, ఆర్బీఐ ద్వంద నియంత్రణ ఉండొద్దని స్పష్టం చేసింది. 1991 నాటికి చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌), నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) పాయింట్లు ఎక్కువగా ఉండేవి. ఎస్‌ఎల్‌ఆర్‌ పాయింట్లను మూడేండ్ల కాలంలో 38.5 శాతం నుంచి 25 శాతానికి, సీఆర్‌ఆర్‌ను కనిష్ట స్థాయికి తగ్గించాలని కమిటీ పేర్కొంది. ప్రైవేటు, ప్రభుత్వ, విదేశీ బ్యాంకుల మధ్య తేడా ఉండకూడదని, అదేవిధంగా బ్యాంకు లను జాతీయం చేసే విధానాన్ని మానుకోవాలని తెలిపింది. 


ఈ సూచనలను చాలా మంది విమర్శించారు కూడా. అవేవీ పట్టించుకోకుండా అప్పటి పీవీ ప్రభుత్వం నరసింహం కమిటీ సిఫారసులను ఆమోదించింది. ఫలితంగా 1993లో ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. అప్పుడే ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. వాస్తవానికి పీవీ ప్రధాని కాకముందు బ్యాంక్‌ లోన్‌ కావాలన్నా, పరిశ్రమ మొదలుపెట్టాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. లోన్‌ కావాలంటే ప్రభుత్వంలో పెద్ద స్థాయి వ్యక్తుల సిఫారసు ఉండాల్సి వచ్చేది. కానీ, పీవీ తీసుకున్న స్వేచ్ఛాయుత బ్యాంకింగ్‌ వ్యవస్థ వల్ల రుణాలు సులభంగా అందాయి. ప్రాజెక్టు రిపోర్టుతో వెళ్తే చాలు.. వాటిని పరిశీలించి బ్యాంకులు రుణాలు ఇవ్వటం మొదలుపెట్టాయి. బ్యాంకింగ్‌ రంగానికి సరికొత్త ఊపును తీసుకొచ్చిన పీవీని ఈ సందర్భంగా గుర్తుచేసుకోకుండా ఉండలేం.


logo