గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 02:18:03

త్వరలో కొత్త ఐటీ పాలసీ

త్వరలో కొత్త ఐటీ పాలసీ

  • మరిన్ని పెట్టుబడుల కోసం కొత్త విధానం: కేటీఆర్‌
  • గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలకు పిలుపు

హైదరాబాద్‌, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలుచేస్తున్న ఐటీ విధానం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని, భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీశాఖను మరింత బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. త్వరలోనే నూతన ఐటీ పాలసీని తీసుకొస్తామని వెల్లడించారు. ఐటీ పాలసీ తీసుకొచ్చి ఐదేండ్లు పూర్తికావస్తున్న సందర్భంగా టాస్క్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ ఐటీ శాఖ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. నూతన ఐటీ పాలసీ గురించి, అందులో పొందుపర్చాల్సిన అంశాల గురించి మార్గనిర్దేశం చేశారు. 

‘ఏ పాలసీ అయినా పౌరులు కేంద్రంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన. ఆ దిశగానే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అనేక నూతన విధానాలకు రూపకల్పన చేసింది’ అని పేర్కొన్నారు. గత ఆరేండ్లుగా ఐటీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి కేటీఆర్‌, ఐటీ శాఖను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఐటీశాఖ ద్వారా ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ సేవలపైనా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పౌరుడే కేంద్రంగా ప్రభుత్వసేవలు అందించే విధానాలకు రూపకల్పన చేయాలని చెప్పారు. గత ఆరేండ్లుగా ఈ-గవర్నెన్స్‌, ఆన్‌లైన్‌, మొబైల్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలను ఉంచిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సమీప భవిష్యత్తులో టీ- ఫైబర్‌ ద్వారా అందించాల్సిన కార్యక్రమాలపై ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.

విద్యార్థులను ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దాలి

ప్రస్తుతం రాష్ట్రంలో ఆవిష్కరణల సృష్టికి బలమైన ఎకో సిస్టం ఏర్పడిందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. విద్యార్థులను ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దేందుకు కావల్సిన కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిందని, తెలిపారు. దీంతోపాటు స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా శిక్షణ కార్యక్రమాలను రూపొందించనున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్‌ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, ఫలితంగా స్థానిక యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ దిశగా అవసరమైన కార్యాచరణను చేపట్టామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ విభాగాధిపతులతో పాటు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. 

ఏ పాలసీ అయినా పౌరులు కేంద్రంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన. ఆ దిశగానే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అనేక నూతన విధానాలకు రూపకల్పన చేసింది. రాష్ట్రంలో ఐటీశాఖను మరింత బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాం. త్వరలోనే నూతన ఐటీ పాలసీని తీసుకొస్తాం.

-మంత్రి కేటీఆర్‌

VIDEOS

logo