శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 25, 2020 , 01:52:34

క్వారంటైన్‌లోనయా ట్రెండ్‌

క్వారంటైన్‌లోనయా ట్రెండ్‌

  • ఫ్రెండ్‌ రూములు మొదలు.. ఫైవ్‌స్టార్‌ హోటళ్ల దాకా!
  • ఐసొలేషన్‌ కేంద్రాలుగా కొత్త అవతారం
  • ఈ బాటలోనే ప్రముఖ హోస్టింగ్‌ ఏజెన్సీలు
  • రూ.10 వేలు మొదలు లక్షల వరకు వ్యయం
  • ఆతిథ్యరంగం కుదేలైనవేళ.. కలిసొస్తున్న క్వారంటైన్‌
  • కరోనా సోకిన ఓ కార్పొరేట్‌ దవాఖాన వైద్యుడు.. హోస్టింగ్‌ 
  • సౌకర్యాన్ని కల్పించే ఓ ఏజెన్సీ యాప్‌ ద్వారా నగర శివారులోని 

ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో ఒక ఇంట్లో 15 రోజులపాటు కిరాయికి ఉన్నాడు. ఆయనలాగే చాలామంది ఇప్పుడు హోం క్వారంటైన్‌, ఐసొలేషన్‌కు ఇల్లు కాకుండా ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఇలాంటివారికి పలు హోస్టింగ్‌ ఏజెన్సీలు మార్గంచూపిస్తున్నాయి. వివిధ హోటళ్లలో, గేటెడ్‌ కమ్యూనిటీల్లో కొద్దికాలం ఉండే అవకాశాలు కల్పిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పెద్దగా గిరాకీ లేని వేళ.. కొన్ని హోటళ్లు కూడా తమ గదులను క్వారంటైన్‌కు అద్దెకిస్తున్నాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టకాలంలో ఆతిథ్యం రూపుమారింది. కరోనా పాజిటివ్‌ వచ్చినవారు, అనుమానితులు తమ కుటుంబసభ్యుల మేలెంచి.. వారికి దూరంగా, తాము క్షేమంగా ఉండేలా  ప్రయత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. గతానికి భిన్నంగా నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో యజమానులు సైతం కొన్ని జాగ్రత్తలతో ఆతిథ్యానికి అంగీకరిస్తున్నారు. కరోనాకు సంబంధించి ఐసొలేషన్‌, క్వారంటైన్‌ అంటే వైరస్హ్రితంగా పరిశుభ్రంగా ఉండే ఒక గది. వాటిలో అన్నిరకాల వసతులు ఉండాలి. 

అందుకే విదేశాలతోపాటు మన దేశంలోని పలు రాష్ర్టాల్లో ఐసొలేషన్‌, క్వారంటైన్‌కు స్టార్‌ హోటళ్లు వేదికగా మారాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో స్వయానా రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా పలు హోటళ్లను స్వాధీనం చేసుకొని వాటిలో వైద్యులు, సిబ్బందికి వసతి కల్పించారు. హైదరాబాద్‌లోనూ కొంతమేర ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆతిథ్యరంగం ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో హోటల్‌ యజమానులు సైతం ఈ దిశగా ముందుకొస్తున్నారు. 15 రోజుల కోసం లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. నగరంలోని ఒక కార్పొరేట్‌ దవాఖాన కరోనా ఐసొలేషన్‌, క్వారంటైన్‌ కోసం ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్‌ హోటల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. హోటల్‌ పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ వ్యయంతో కూడుకున్న ఈ సౌకర్యం హైప్రొఫైల్‌ ఉన్నవారికే కేటాయిస్తున్నారు. 


విదేశీ పర్యాటకులు లేక..

సాధారణంగా హైదరాబాద్‌ వేదికగా హోస్టింగ్‌ ఫెసిలిటీస్‌ బిజినెస్‌ భారీఎత్తున జరుగుతుంటుంది. ఇక్కడకు వచ్చే విదేశీయులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలవారి అభిరుచులకు అనుగుణంగా హోస్టింగ్‌ ఏర్పాటుకు పలు ఏజెన్సీలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాలనుంచి ఇలా వచ్చేవారు లేరు. దీంతో యజమానులు, ఏజెన్సీలు ఐసొలేషన్‌, క్వారంటైన్‌లపై దృష్టిసారించాయి. సాధారణ గదులైతే 15 రోజులకు రూ.10-20 వేలు, శివారు ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాలు, విల్లాలు వంటివైతే అన్నిరకాల వసతులు కలిపి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారు. 

ఆన్‌లైన్‌ వైద్య సేవలు

లక్షణాలులేని పాజిటివ్‌ కేసులు, పాజిటివ్‌తో క్లోజ్‌ కాంటాక్టులో ఉన్నామనే అనుమానం ఉన్నవారు ఎక్కువగా ఈ తరహా వసతుల్లో ఉంటున్నారు. ముందుగానే వైద్యుల సలహా తీసుకొని సరిపడా మందుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. 15 రోజులకు అవసరమయ్యే సరుకుల్ని ముందే తెప్పించుకుంటున్నారు. ఎక్కువ డబ్బు వెచ్చించే స్థోమత ఉన్నవారు సమయానికి భోజనం సిద్ధంచేసేవారినీ ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజూ ఆన్‌లైన్‌లో వైద్యుల సలహాలు తీసుకొని, ఆహ్లాదకర వాతావరణంలో ఉంటున్నారు. పొరుగు రాష్ర్టాలకు చెందినవారు కూడా ఇక్కడ వసతి పొందుతున్నట్టు తెలిసింది.


logo