సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 13:55:43

ధరణి పోర్టల్‌ ప్రారంభంతో తెలంగాణలో నవ శకం : మంత్రి పువ్వాడ

ధరణి పోర్టల్‌ ప్రారంభంతో తెలంగాణలో నవ శకం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భూలావాదేవీల్లో ఇవాళ్టి నుంచి సరికొత్త అంకం ప్రారంభం అయిందని, రెవెన్యూ చట్టంలో భాగంగా భూమికి సంబంధించి ఎలాంటి అవకతవకలు లేకుండా అత్యంత పారదర్శకంగా రెవిన్యూ సేవలు అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను రూపొందించి ప్రారంభించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసిఆర్  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లి మండల ఆఫీస్ లో ధరణి పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించడం శుభపరిణామం అన్నారు.

అందులో భాగంగా మంత్రి పువ్వాడ దత్తత మండలం ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ను సందర్శించి లాంఛనంగా సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెవెన్యూ చరిత్రలో ఇలాంటి రోజు రైతుల భూములు క్రయవిక్రయాలకు మంచి రోజులన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి వచ్చిన ఆలోచనలకు నేడు కార్యరూపంలోకి తీసుకురావడం పట్ల కేసీఆర్ కు రైతులపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా 570 తాసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములకు నేటి నుంచి  రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయన్నారు. ఇప్పటికే తాసిల్దార్ నాయబ్ తాసిల్దార్లకు, సిబ్బందికి ప్రభుత్వం శిక్షణ పూర్తి చేసిందన్నారు. ఈ రోజు నుంచే స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారని, నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయన్నాయని పేర్కొన్నారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్లు ఒకేసారి జరగనున్నాయని, కోటీ 55 లక్షల ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తారన్నారు.

ఇక నుంచి పోర్టల్ ద్వారానే భూక్రయవిక్రయాలు జరగనున్నాయని, అవకతవకలకు ఆస్కారం లేని.. పూర్తి పారదర్శక విధానంలో సేవలందేలా ధరణి పోర్టల్‌ రూపొందించబడిందన్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒకే కార్యాలయంలో ఏకకాలంలో జరుగుతాయని దీనితో భూ సమస్యలు తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి , అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ వరుణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.