శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 27, 2020 , 01:04:19

డిగ్రీలో కొత్త ఉపాధి కోర్సులు

డిగ్రీలో కొత్త ఉపాధి కోర్సులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఉద్యోగ ఉపాధి కల్పనకు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఉపాధి కోర్సులు అందించడానికి ముందుకు రావాలని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సాధారణ కోర్సులతోపాటు గేమింగ్‌, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, రోబోటిక్‌ స్వల్పకాలిక కోర్సులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాటాసైన్స్‌ అనాలిసిస్‌, మిషన్‌ లెర్నింగ్‌ వంటి డిమాండ్‌ ఉన్న కోర్సులను డిగ్రీ కాలేజీల్లో అందించాలని కోరారు. ఇప్పటికే కొన్ని అటానమస్‌ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో అధికారులు చర్చించగా.. వారంతా సానుకూలత వ్యక్తంచేశారు.  


యాజమాన్య కోటా అమలు 

2020-21 విద్యాసంవత్సరం నుంచే ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా అమలుపై దాదాపు నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై యాజమాన్యాలు కూడా అంగీకారం తెలిపాయన్నారు.  యాజమాన్య కోటా అమలుతో 25 శాతం సీట్లు ఇంజినీరింగ్‌ కాలేజీ మాదిరిగా స్వయంగా భర్తీకి అవకాశం ఉన్నది. విద్యార్థులు యాజమాన్య కోటాలో సీట్లు పొందవచ్చు. 2020-21 విద్యాసంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ ఏర్పాట్లపై ఫిబ్రవరిలో ‘దోస్త్‌' కమిటీ సమావేశం ఏర్పాటుకు ఎజెండా రూపొందిస్తున్నారు. దోస్త్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రవేశాలప్రక్రియ తదితర అంశాలపై చర్చంచనున్నారు. 


logo