మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:35:33

హుషారుగా.. చలో షికార్‌

హుషారుగా.. చలో షికార్‌

  • తెలంగాణ పర్యాటకానికి కొత్త శోభ
  • సరికొత్త ప్రాజెక్టులతో ప్రణాళికలు
  • ఫ్లోటింగ్‌ రెస్టారెంట్లు, సోలార్‌బోట్లు
  • ప్రతి జిల్లాకో మినీ బడ్జెట్‌ హోటల్‌
  • అందుబాటులోకి ఎలక్ట్రికల్‌ బస్సులు
  • కొత్త ఏడాదిలో పర్యాటకులకు జోష్‌

జల అందాలను వీక్షిస్తూ పసందైన భోజనం తినొచ్చు. కుటుంబసభ్యులందరితో కలిసి క్రూజ్‌లో సందడి చేయొచ్చు. స్పీడ్‌ బోట్‌లో రయ్‌మని దూసుకుపోవచ్చు. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో పర్యాటక ప్రాంతాలను చుట్టేయొచ్చు. మినీ బడ్జెట్‌ హోటళ్లలో ఉండి టూరిజం అందాలనూ ఆస్వాదించొచ్చు.. ఇవన్నీ విదేశాల్లోనే, మరెక్కడో కాదు. టూరిస్టులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ రచిస్తున్న ప్రణాళిక ఇది. గత ఏడాది కరోనాతో పర్యాటక సందడి అంతగా కానరాలేదు. నూతన సంవత్సరంలో వ్యాక్సిన్‌ వచ్చేస్తున్నది. జోష్‌లో ఉన్న పర్యాటకులు తనివితీరా ఆస్వాదించేలా చర్యలను వేగవంతం చేసింది. 

హైదరాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కరోనాతో 2020లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త ప్రాజెక్టులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నది. పర్యాటకులను ఆకట్టుకొనేందుకు పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిస్తూ విద్యుత్‌ బస్సులు, సౌరవిద్యుత్‌తో నడిచే బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నది. హుస్సేన్‌సాగర్‌, దుర్గం చెరువుతోపాటు సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌, వరంగల్‌లోని వడ్డేపల్లి చెరువులో 12 సోలార్‌ బోట్లను నడుపనున్నది. ఇందులో 150 సీట్లతో ఒక క్రూజ్‌, 80 సీట్లతో రెండు ఫ్లోటింగ్‌ రెస్టారెంట్లు, 25 సీట్లతో ఒక సాధారణ బోట్‌, నాలుగేసి స్పీడ్‌, పెడల్‌ బోట్లను తీసుకొచ్చేందుకు టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఇవి కాకుండా హైదరాబాద్‌లో పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు ఎలక్ట్రికల్‌ బస్సులను నడుపనున్నది. ఇందులో ఒక బస్సును రామోజీ ఫిలిం సిటీకే ప్రత్యేకంగా కేటాయించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

కరోనాతో సగానికిపైగా తగ్గిన శోభ

కరోనా దెబ్బకు గత ఏడాది పర్యాటకరంగం కుదేలైంది. 2014 నుంచి 2019 వరకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. జనవరిలో 1.12 కోట్లు, ఫిబ్రవరిలో 1.61 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. లాక్‌డౌన్‌ మొదలైన మార్చి నెలలో 31.73 లక్షల మంది పర్యాటకులే వచ్చారు. ఏప్రిల్‌, మే నెలల్లో అసలు పర్యాటక ప్రాంతాలు తెరుచుకోలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 46,338 మంది విదేశీయు లు రాష్ట్రంలో పర్యటించగా, ఆ తర్వాత ఆరు నెలలు ఏ ఒక్కరూ ఇటు రాలేదు. అక్టోబర్‌లో 76 మంది మాత్రమే వచ్చినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 

విదేశీయులను ఆకర్షిస్తున్న హైదరాబాద్‌

విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో హైదరాబాద్‌ మేటిగా నిలిచింది. గోల్కొండ ఖిల్లా, చార్మినార్‌, హుస్సేన్‌సాగర్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చౌమొహళ్ల ప్యాలెస్‌, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్‌, మక్కా మసీదు, నెహ్రూ జులాజికల్‌ పార్కు మొదలైనవి ఎక్కువమంది సందర్శించిన ప్రాంతాలుగా నిలిచాయి. 2014 నుంచి రాష్ర్టానికి వచ్చిన విదేశీయుల్లో 90 శాతానికిపైగా హైదరాబాద్‌ను చూడటానికే రావడం విశేషం. ఆ తర్వాత వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అత్యధికంగా విదేశీయులు పర్యటించారు.

జిల్లాల్లో వసతికి మినీ బడ్జెట్‌ హోటళ్లు

బస చేసేందుకు వసతి సౌకర్యం లేదని పర్యాటకులు బాధపడాల్సిన పనిలేదిక. త్వరలోనే జిల్లాకు ఒకటి చొప్పున మినీ బడ్జెట్‌ హోటల్‌ను 20 నుంచి 30 గదులతో నిర్మించేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. ప్రాంతాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2000 వరకు అద్దె వసూలు చేయనున్నది. ఈ హోటళ్లలో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందుబాటులో ఉంటాయని, వాటికి సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారని తెలిసింది. హోటళ్ల నిర్మాణానికి జిల్లాల్లో అవసరమైన స్థలాలు గుర్తించాలని సూచిస్తూ పర్యాటకాభివృద్ధి సంస్థ.. జిల్లాల్లోని అధికారులకు లేఖలు రాసింది. 

కట్టుదిట్టమైన చర్యలు

పర్యాటక ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నాం. పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులందరికీ బస, భోజన సదుపాయాలు అందుబాటులో ఉంచాలనేది మా లక్ష్యం. హైదరాబాద్‌ను చూసేందుకు వచ్చేవారి కోసం ఈ నెలలో రెండు ఎలక్ట్రికల్‌ బస్సులను తీసుకొస్తున్నాం. వివాదాల్లో ఉన్న పర్యాటకాభివృద్ధి సంస్థ ఆస్తులపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం. పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు సంస్థ ఆదాయాన్ని పెంచుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. 

- ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, టీఎస్‌టీడీసీ చైర్మన్‌