మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:55:18

యాసంగిలో 1.13 కోట్ల టన్నుల ధాన్యం

యాసంగిలో 1.13 కోట్ల టన్నుల ధాన్యం

  • దిగుబడిపై వ్యవసాయశాఖ అంచనా
  • మద్దతు ధరపై స్పష్టత ఇవ్వని కేంద్ర ప్రభుత్వం
  • అమల్లోకి వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు
  • రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేదు 
  • సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • వానకాలంలో రూ. 9,456 కోట్ల పంట కొనుగోళ్లు
  • ధాన్యంలో నిజామాబాద్‌, మక్కల్లో కామారెడ్డి టాప్‌

హైదరాబాద్‌, జనవరి 16(నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.13 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. యాసంగి పంట ఉత్పత్తులు, కొనుగోళ్లకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని మంత్రి చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే అవకాశం లేదని పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ కొనుగోళ్లకు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాలను రైతులకు వివరించాలని సూచించారు. రాష్ట్రంలోని 191 మార్కెట్లు, 72 సబ్‌ యార్డుల్లో నిత్యం క్రయవిక్రయాలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ఒకేసారి మార్కెట్‌కు రాకుండా క్రమబద్ధీకరించాలని సూచించారు. ఏఈవోలు క్రాప్‌ బుకింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రాంరెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ భాస్కరాచారి పాల్గొన్నారు.

వానకాలంలో 50.17 లక్షల టన్నుల పంటల కొనుగోలు

వానకాలం పండించిన ధాన్యం, మక్కలు కలిపి 50.17 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 47.65 లక్షల టన్నుల ధాన్యం, 2.52 లక్షల టన్నుల మక్కలు ఉన్నాయి. కొనుగోలు చేసిన పంటల విలువ రూ.9,456.36 కోట్లు ఉంటుంది. ధాన్యం కొనుగోలుకు రూ.8,990 కోట్లు, మక్కలకు రూ.466.36 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఇప్పటివరకు 10.78 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా రూ. 8,375.16 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్‌ జిల్లా ప్రథమ స్థానం లో నిలిచింది. ఈ జిల్లాలో 1.08 లక్షల మంది రైతుల నుంచి 1099.80 కోట్ల విలువైన 5.82 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ద్వితీయ స్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లాలో 61,664 మంది రైతుల నుంచి రూ.580.95 కోట్ల విలువైన 3.89 లక్షల టన్నులు సేకరించారు. మూడో స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లాలో రూ.709.59 కోట్ల విలువైన 3.75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. తర్వాత స్థానంలో సూర్యాపేట జిల్లా ఉన్నది. ఇక్కడ 2.66 లక్షల టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మక్కల కొనుగోళ్లలో కామారెడ్డి ముందున్నది. ఈ జిల్లాలో రూ.95.33 కోట్ల విలువైన 51,529 టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. రెండో స్థానంలో ఉన్న జగిత్యాలలో రూ. 91.88 కోట్ల విలువైన 49,665 టన్నుల మక్కలను కొనుగోలు చేసింది. అత్యల్పంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 401 టన్నుల మక్కలను మాత్రమే కొనుగోలు చేసింది. గతేడాది జనవరి 15వ తేదీ నాటికి 43.35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ప్రస్తుతం 47.65 లక్షల టన్నులు సేకరించింది.

VIDEOS

logo