శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 17, 2020 , 01:53:32

విత్తినవాడే విలువకట్టేది!

విత్తినవాడే విలువకట్టేది!

 • నిత్యావసర వస్తువుల చట్టసరవణతో రైతుకు స్వేచ్ఛ 
 • డిమాండ్‌ ఉన్నచోటే అమ్ముకొవచ్చు       
 • మౌలికవసతుల్లేని  సంస్కరణ నిష్ఫలం  
 • రైతుకు నేరుగా సాయమే మేలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గుండుసూది నుంచి రాకెట్ల వరకు ఉత్పత్తిదారుడిదే ధరపై నిర్ణయాధికారం. రైతుకు మాత్రం తాను పండించిన పంటకు ధరను నిర్ణయించే అధికారంలేదు. ఇప్పుడు ఈ విధానాన్ని కేంద్రప్రభుత్వం మార్చివేస్తున్నది. నిత్యావసర వస్తువుల చట్టం-1955ను సవరించటం ద్వారా రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛనిస్తున్నది. ఈ మార్పు రైతుకు మేలుచేస్తుందా..కీడు చేస్తుందా అనే అంశంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది. ఎక్కువ ధర ఉన్నచోట పంట అమ్ముకొనే ఉన్నందున రైతు లాభపడుతాడని ప్రభుత్వం చెప్తుండగా, పంటనిల్వ, మార్కెటింగ్‌, మద్దతుధర వంటి వసతులు కల్పించినప్పుడే నిజమైన మేలని నిపుణులంటున్నారు.

ధర నిర్ణయాధికారం రైతుదే..!

మనదేశంలో రైతులు తమ పంటను అనేక ఆంక్షలు, పరిమితుల మధ్య విక్రయిస్తూ వస్తున్నారు. ఏపీఎంసీ (అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ)ల ద్వారానే ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. వ్యవసాయోత్పత్తుల ధరలను కేంద్రప్రభుత్వమే నిర్ణయిస్తుండటంతో అంతకంటే ఎక్కువ రేటుకు అమ్ముకునే అవకాశం లేకుండాపోతున్నది. తాజాగా ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా నిత్యావసర వస్తువుల చట్టం-1955ను సవరిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దాంతో పంటను ఇకనుంచి వ్యవసాయ మార్కెట్లోనే అమ్ముకోవాలనే నిబంధన ఉండదు. ఈ-మార్కెట్‌ (ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌) జాతీయస్థాయిలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇందుకు అవసరమైన మౌలికవసతులను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. అయితే, దేశంలో ఎక్కువమంది చిన్నరైతులు ఉండటం, బ్లాక్‌మార్కెట్‌ సమస్యల వంటివి తీవ్ర ప్రతిబంధకాలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

తెలంగాణలో వాణిజ్య పంటలకు ఊతం

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు లేకపోవడం తెలంగాణ వంటి రాష్ర్టాల్లో వాణిజ్య పంటల సాగుకు ఊతమిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగానే ఉంటుంది. పత్తికి మంచి డిమాండు ఉన్నందున సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో భారీగా పండే పంటను బ్రెజిల్‌, పిలిపీన్స్‌, ఇండోనేషియా,చైనాకు వంటి అంతర్జాతీ య మార్కెట్లకు కూడా ఎగుమతి చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. బియ్యం, కందులు, మిరపకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. పంటలు రాష్ట్ర అవసరాలకు మించిఉంటే ఎగుమతి చేసుకోవచ్చు. 

నిపుణుల అభిప్రాయాలు

 • తక్షణం కాకపోయినా కాలక్రమేణా సాధారణ రైతుకు అంతర్జాతీయ మార్కెట్‌ సైతం అవగాహనలోకి వచ్చే అవకాశముంది. వ్యవసాయం లాభసాటిగా మారి ఈ రంగంవైపు యువత పెద్దఎత్తున ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయని ఉద్యాన విశ్వ విద్యాలయం పరిశోధకుడు పిడిగం సైదయ్య అభిప్రాయపడ్డారు.
 • వ్యవసాయరంగంలో పోటీతత్వం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. కార్పొరేట్‌ ప్రవేశంతో భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఎఫ్‌పీఓలు, పెద్ద రిటైలర్లకు అమ్ముకునే అవకాశం లభిస్తుందన్నారు విశ్రాంత వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఎస్కే పట్నాయక్‌. 
 • ఆహారశుద్ధి పరిశ్రమలు, భారీ రిటైలర్లతో రైతులు నేరుగా ఒప్పందాలు చేసుకొని పొలం నుంచే ఉత్పత్తులు విక్రయిస్తారు. - సాగులో నూతన సాంకేతికత, ఆధునిక యంత్రాల వినియోగం పెరిగి ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
 • పెట్టుబడులు పెరిగేకొద్దీ మౌలిక వసతులు కూడా పెరిగి రైతుల ఆదాయం 25-30శాతం పెరుగుతుందని వ్యవసాయ, ఆర్థికరంగ నిపుణుడు పీకే జోషి అంటున్నారు. 
 • ఆహారశుద్ధి పరిశ్రమలకు మౌలికవసతుల కోసం రూ.లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తుండటం ఆ పరిశ్రమకు కొండంత అండగా మారుతుందని కార్గిల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ అధ్యక్షుడు సైమన్‌ జార్జ్‌ అభిప్రాయపడ్డారు. 
 • స్వేచ్చావ్యాపార విధానం రైతుకు ప్రయోజనమేనని ఆలిండియా పప్పుల ఉత్పత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు సురేష్‌ అగర్వాల్‌ అన్నారు. 
 • ఆంక్షలు తొలగటంతో వ్యవసాయోత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమమైందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు శరద్‌కుమార్‌ సరఫ్‌ అన్నారు. 
 • ఎగుమతులపై ఆంక్షలు తొలిగితే సరఫరా, డిమాండ్‌లో సమతూకం వచ్చే అవకాశం ఉంది. 

స్వేచ్ఛామార్కెట్‌ నష్టాలు

 • వ్యవసాయోత్పత్తుల నిల్వకు మనదేశంలో సరిపడా మౌలిక వసతులు లేవు. పంటను నిల్వచేసుకునే అవకాశం లేనప్పుడు తక్కువ ధరకైనా అమ్ముకోవాల్సిందే. ఈ పరిస్థితితి వ్యాపారులకు మాత్రమే లభసాటిగా ఉంటుంది.
 • కృతిమ కొరత మొదలై ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. 
 • సరైన పర్యవేక్షణ లేక పంటంతా ఒకేచోటికి చేరే ప్రమాదమూ ఉంది. 
 • ఎగుమతులు ఎక్కకు కావటంవల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. 
 • పంటకు మద్దతు ధర పెంచినప్పుడే రైతుకు నేరుగా లాభం జరుగుతుంది. పంట వేసేముందే మద్దతు ధర ప్రకటించే విధానం రావాలి. కనీసం 20శాతం మద్దతు ధర పెంచితే రైతుకు మేలు జరిగేది. 
 • ప్రస్తుత కష్టసమయంలో రైతులకు నేరుగా కొంత డబ్బు అందిస్తే ప్రోత్సాహకంగా ఉండేది. కానీ ప్యాకేజీలో అవేమీ చెప్పలేదు.
 • చట్ట సవరణ ద్వారా వెంటనే కలిగే లాభమేదీ లేదని  నిపుణులు అల్దాస్‌ జానయ్య అన్నారు. 


logo