హైదరాబాద్ : ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సూర్యాపేటలో ప్రస్తుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారి కోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖను ఆదేశించింది. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది.
బుధవారం నుంచి ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, టుడీ ఈకో తోపాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎలర్జీ జబ్బుల పరీక్షలు ట్రీట్ మెంట్ కోసంగా ప్రత్యేక కేంద్రాలను హైద్రాబాద్ వరంగల్లు సిద్దిపేట లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెరుగుతున్న రోగుల రద్దీ రీత్యా ప్రస్థుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని డయాలసిస్ యంత్రాలను పెంచడంతో పాటు నూతనంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
కేన్సర్ రోగులకు జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ, రేడియో థెరపీ కొరకు అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్ని దవాఖానాల్లో అవసరాలను అందుకునే విధంగా బ్లడ్డు బ్యాంకుల ఆధునీకరించి అవసరమైన మేరకు నూతన బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైద్యానికి సంబంధించి ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాలలో, మెరుగైన వైద్య సేవలకోసం కావలసిన మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.
వరంగల్లులో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో దేశంలోనే అత్యుత్తమంగా వైద్యసేవలందిస్తున్న ఎయిమ్స్ తరహాలో దవఖానను ఏర్పాటు చేసి అన్ని రకాల స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో ఎండీ హాస్పటల్ అడ్మిస్ట్రేషన్ కోర్సు అభ్యసించిన అర్హులైన వారిని నియమించుకుని హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వినియోగించాలని నిర్ణయించింది. వైద్య సేవల్లో భాగం పంచుకునే నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులను, లాబ్ టెక్నీషియన్ రేడియాలజీ టెక్నిషియన్ డయాలసిస్ టెక్నిషియన్ వంటి ప్రత్యేక నైపుణ్య కోర్సులను అవసరమైనంత మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యకళాశాలల్లో అందుబాటులోకి తేవాలని వైద్యశాఖను ఆదేశించింది.
రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ కు సంబంధించిన వైద్య సేవలను మరింతగా పటిష్టపరిచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇతర రోగులతో కలపకుండా తల్లీ బిడ్డలకు ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని, అందులో భాగంగా, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ప్రధాన దవఖాన భవనంలో కాకుండా ప్రత్యేక భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన మేరకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ ప్రత్యేక భవనంలోనే హై రిస్క్ ప్రసవాలవసరమైన గర్భిణీల వైద్యసేవలం కోసం ప్రత్యేక ‘ మెటర్నల్ ఐసీయూ’ లను, నవజాత శిశువుల కోసం ఎస్ ఎన్ సీ యూ లను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిషలు కృషి చేయాలని కెబినెట్ ఆదేశించింది. గర్భం దాల్చిన మూడో నెలనుంచి గర్భిణీలకు సమతుల పౌష్టికాహార కిట్టును అందించాలని నిర్ణయించింది. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని అవసరమైన మౌలిక వసతులను, సిబ్బందిని, ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ వైద్యశాఖను ఆదేశించింది.