బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 02:42:31

మత్తుమందిచ్చి 40 లక్షలతో పరార్‌

మత్తుమందిచ్చి 40 లక్షలతో పరార్‌

  • ఇంట్లో పనికి కుదిరి.. భారీ చోరీ
  • భోజనంలో మత్తుమందు కలిపి దోపిడీ
  • లాకర్‌ పగులగొట్టి బంగారం కొట్టేశారు
  • నగదు, నగలతో ఉడాయించిన దొంగలు
  • రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్‌ దారుణం

హడావుడిగా రాత్రుళ్లు కన్నాలేసి ఏం సాధిస్తామనుకున్నాడో ఏమో! దోచుకుంటే పక్కా ప్రణాళికతో భారీగా ఉండాలనుకున్నాడేమో! అందుకే.. ఒక ఇంటిని ఏడాదిపాటు టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పనికికుదిరి.. నమ్మకస్థుడిగా మెలిగాడు. మరికొందరిని పనికి కుదిర్చి.. ‘ఓ మంచి పనోడు..’ అని ఇంటిల్లిపాదితో అనిపించుకున్నాడు! తనను పూర్తిగా నమ్మారని అనిపించిన తర్వాత అసలు పని మొదలుపెట్టాడు. ఓ మంచిరోజు చూసి.. అప్పటికే తాను పనికి కుదిర్చినవారితో కలిసి.. పన్నాగం అమలుచేశాడు. ఇంట్లోవారికి  భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. వారు స్పృహకోల్పోగానే.. నగలు.. నగదు మూటకట్టుకుని తోటి దొంగలతో కలిసి ఉడాయించాడు. శేరిలింగంపల్లిలో ఓ బోర్‌వెల్‌ వ్యాపారి ఇంట్లో నేపాలీగ్యాంగ్‌ చేసిన ఘరానా చోరీ ఇది!

శేరిలింగంపల్లి: నమ్మకంగా పనికి కుదిరారు.. అదనుచూసి యజమాని కుటుంబానికి భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి భారీ చోరీకి పాల్పడ్డారు. 15 లక్షలు నగదు, 25 లక్షల విలువచేసే బంగారంతో ఉడాయించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. రాయదుర్గం బీఎన్నార్‌హిల్స్‌ కాలనీలో బోర్‌వెల్‌ వ్యాపారం చేసే గూడూరు మధుసూదన్‌రెడ్డి (55) తన భార్య శైలజ (50), కుమారుడు నితీశ్‌రెడ్డి (35), కోడలు దీప్తిరెడ్డి (32), మనుమడు అయాన్‌రెడ్డి (5)తో కలిసి నివాసం ఉంటున్నారు. వీళ్ల ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజేందర్‌ అలియాస్‌ రవి ఏడాది క్రితం హౌజ్‌కీపింగ్‌ పనికి కుదిరాడు. అప్పటినుంచి నమ్మకంగా పనిచేశాడు. కొన్నిరోజుల తర్వాత రవి తన సోదరి సీతను తీసుకువచ్చి అదే ఇంట్లో హౌజ్‌కీపింగ్‌ పనికి కుదిర్చాడు. 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన మనోజ్‌, జానకి అనే ఇద్దరిని కూడా తీసుకొచ్చాడు. మనోజ్‌ హౌజ్‌కీపింగ్‌కు, జానకి వంట పనికి కుదిరారు. వీరందరికీ ఇంటి సెల్లార్‌లో ఉన్న సర్వెంట్‌ క్వార్టర్‌ను మధుసూదన్‌రెడ్డి కేటాయించారు. పక్కా ప్లాన్‌తో ఇంట్లో చేరిన వీరు అదను కోసం వేచిచూశారు. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మధుసూదన్‌రెడ్డి కుటుంబం కోసం పప్పు, చపాతీ చేశారు. పప్పులో మత్తుమందు కలిపారు.

మధుసూదన్‌రెడ్డి భార్య పప్పు తినకపోవడంతో గ్రీన్‌ టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. మత్తుమందు కలిపిన పదార్థాలు తినడంతో మధుసూదన్‌రెడ్డి, నితీశ్‌రెడ్డి, దీప్తిరెడ్డి స్పృహ కోల్పోయారు. మత్తుమందు కలిపిన గ్రీన్‌ టీ తాగిన శైలజ మైకంతో పడిపోయారు. దీనికోసమే ఎదురుచూస్తున్న రవి, సీత, మనోజ్‌, జానకిలతోపాటు అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కలిసి శైలజను కుర్చీలో తాళ్లతో కట్టేశారు. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదు సర్దేశారు. నితీశ్‌రెడ్డి బెడ్‌రూంలో ఉన్న లాకర్‌ తెరుచుకోకపోవడంతో దానిని సర్వెంట్‌ క్వార్టర్‌కు తీసుకొచ్చి పగులగొట్టారు. దాంట్లో ఉన్న సుమారు 25 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు చోరీచేశారు. రాత్రి 10 గంటల సమయంలో మెయిన్‌గేట్‌కు గడియపెట్టి పారిపోయారు. మొత్తం రూ.40 లక్షల సొత్తు చోరీకి గురైంది. తెల్లవారుజామున మెలకువ వచ్చిన చిన్నారి అయాన్‌రెడ్డి.. శైలజ కట్టు విప్పడంతో ఆమె తన బంధువులకు సమాచారం అందించారు. అప్పటికీ స్పృహ కోల్పోయే ఉన్న మధుసూదన్‌రెడ్డి, నితీశ్‌రెడ్డి, దీప్తిరెడ్డిని ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.



logo