e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home Top Slides తెలంగాణలో నీళ్లు దుంకుతున్నట్టు ఓట్లు దుంకాలె!

తెలంగాణలో నీళ్లు దుంకుతున్నట్టు ఓట్లు దుంకాలె!

తెలంగాణలో నీళ్లు దుంకుతున్నట్టు ఓట్లు దుంకాలె!
 • భగత్‌కు ఎట్లెట్ల ఓట్లు పడితే
 • అట్లట్ల నెల్లికల్‌ లిఫ్టులో నీళ్లు
 • వాటిలో కేరింతలు కొట్టాలె
 • నాకు సీఎం పదవి ఎవరి భిక్షనో కాదు.. అది తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష
 • పదవుల కోసం తెలంగాణను వదిలేసిన కాంగ్రెస్‌
 • తెలంగాణ కోసం పదవుల్ని వదిలేసింది టీఆర్‌ఎస్‌
 • రోజూ నల్లా నీళ్లలో కేసీఆర్‌ కనిపిస్తలేడా?
 • మీకు రైతుబంధు, రైతుబీమా వస్తలేదా?
 • గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే రావు
 • నందికొండ జాగల సమస్య పరిష్కరిస్త
 • సాగర్‌కు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్త
 • హాలియాలో షాదీఖానా బాధ్యత నాది
 • బల్లగుద్ది, రొమ్ము విరిసి చెప్తున్న.. యాసంగి వరి సాగులో తెలంగాణే నెం.1
 • హాలియాలో సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

ఒకాయన వచ్చి విచిత్రంగా మాట్లాడిండు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని మాట్లాడిండు. ఒకవేళ నాకు ముఖ్యమంత్రి పదవిని జానారెడ్డి భిక్షపెట్టే పరిస్థితే ఉంటే ఆయనే కావాలనుకుంటడు కానీ నాకిస్తడా! ఇది జరిగే పనేనా! కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి భిక్ష పెట్టింది మీరు.. తెలంగాణ ప్రజలు. నాకెవరూ భిక్ష పెట్టలే. వీళ్లంతా భిక్షగాళ్ల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్లు.

నా వెంట అనేకమంది అనేక సందర్భాల్లో గడ్డిపోచల్లా మా పదవులు ఇసిరేసినం. పదవుల కోసం తెలంగాణను ఆంధ్రోళ్లకు వదిలిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్‌ అయితే.. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్‌ఎస్‌. ఇది నిజమా కాదా మీకే తెలుసు. ఎన్ని రాజీనామాలు చేసినం.. ఎన్ని ఉప ఎన్నికల్లో పోరాటం చేసినం! ఇలాంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినం! ఇదంతా ఎక్కడో ఎప్పుడో జరిగింది కాదు. నిన్న మొన్న మీ కండ్లముందు జరిగిన చరిత్ర.

గత పాలకులు వదిలిపెట్టిన తిరుమలగిరి సాగర్‌కు నీళ్లిచ్చే లిఫ్ట్‌ను ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానని మా మంత్రి సవాల్‌ విసిరారు. వందశాతం ఆయన కరెక్ట్‌గానే చెప్పిండు. మా మంత్రి ప్రకటనను సమర్థిస్తూ నేను మీకు హామీ ఇస్తున్న. ఎక్కడైనా భిక్షమెత్తయినా సరే ఆ లిఫ్ట్‌ పూర్తి చేయించే బాధ్యత నాది.

మంచి చేసేవాళ్లను సమర్థిస్తే మనకు మంచి జరుగుతది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయాలంటే ముండ్ల చెట్లకు పండ్లు కాయయి. పండ్ల చెట్లు పెడితేనే పండ్లు కాస్తయి. కాబట్టి దేన్ని పెట్టాలో దేన్ని పెట్టొద్దో ఆలోచించాలె. సేవ కోసం ఎవర్ని వినియోగించాలనేది నిర్ణయించాల్సింది మీరు.

ఆనాడు నాకు ధనబలం లేదు.. గూండాల తండాల బలం లేదు.. మీడియా బలం లేదు. ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన. చివరికి హైదరాబాద్‌లో నిజాం హాస్పిటల్‌లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు. ‘నువ్వు రేపే కోమాలోకి పోతవ్‌.. ఎల్లుండే కోమాలోకి పోతవ్‌.. కోమాలోకి పోతే బతుకవ్‌’ అని భయపెట్టిండ్రు. కానీ నేను దీక్ష విరమించలేదు. నేను దీక్ష పట్టిననాడే చెప్పినా.. ‘కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని దీక్ష పట్టిన. ఆ దీక్షనే కదా నేడు తెలంగాణ తెచ్చింది!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నీళ్లు దుంకుతున్నట్టు నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు దుంకాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. నెల్లికల్‌ లిఫ్ట్‌ దుంకుతుంటే ప్రజలంతా ఆ నీళ్లలో కేరింతలు కొడుతుంటే చూడాలనేది తన కోరికన్నారు. ఏడాదిన్నరలో నెల్లికల్‌ లిఫ్ట్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కరెంటు నుంచి నీళ్ల వరకు అన్ని గోసలను ఏ విధంగా తీర్చిందో మీ కండ్ల ముందే ఉన్నాయని, ఇవన్నీ ఆలోచించి ఓటువేయాలని కోరారు. గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే పాలు రావని అన్నారు. మాట్లాడితే తనది ముప్పై ఏండ్ల చరిత్ర అని చెప్పుకొనే పెద్దమనిషి సాగర్‌కు చేసిందేమీ లేదని, ఈ ముప్పై ఏండ్లలో సాగర్‌లో కనీసం ఓ డిగ్రీ కాలేజీకి కూడా దిక్కులేదని విమర్శించారు. ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజీ వచ్చిందని, రేపు సాగర్‌లోనూ డిగ్రీ కాలేజీ రాబోతున్నదని ప్రకటించారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం హాలియాలో సాగర్‌ గర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఎట్లెట్ల ఓట్లు దుంకితే.. అట్లట్ల నెల్లికల్‌ లిఫ్ట్‌ నీళ్లు

నా మిత్రుడు నర్సింహయ్యను కోల్పోయినందుకు నాకూ దుఃఖం ఉంది. నర్సింహయ్య తన జీవితం అంతా లెఫ్ట్‌ రాజకీయాల్లో పనిచేశారు. ప్రజాపోరాటాల్లో, అనేక ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి. అదే స్ఫూర్తితో మంచి విద్యావంతుడు, యువకుడు, మంచి సేవ చేస్తడని ఆయన కుమారుడు నోముల భగత్‌ను ఇక్కడ అభ్యర్థిగా పెట్టిన. భగత్‌కు గాలి బాగానే ఉన్నదని అర్థమైంది. ఈ గాలి 17వ తారీఖు దాకా ఉండాలి. ఓట్ల రూపంలో డబ్బాలోకి రావాలి. ఎట్లెట్ల భగత్‌కు ఓట్లు దుంకుతయో.. అట్లట్ల మీ నెల్లికల్‌ లిఫ్ట్‌ నీళ్లు దుంకుతయని హామీ ఇస్తున్న. అలంపూర్‌ నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్‌ నాయకులే పదవుల కోసం ఒంగి లొంగి ఉన్న కాలంలో అక్కడి ఆర్డీఎస్‌ కాలువ ఆగమైపోతే దానిపై తుమ్మిళ్ల దగ్గర లిఫ్ట్‌ పెట్టినం. ఆ లిఫ్ట్‌ బాగా సక్సెస్‌ అయింది. మొన్న ఎలక్షన్‌ సమయంలో అక్కడికి పోయిన. తుమ్మిళ్లలో నీళ్లు ఎట్ట దుంకుతున్నయో మీ ఓట్లు అట్ల దుంకాలని చెప్తే.. 50 వేల ఓట్లతో అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించిండు. మీకు కూడా హామీ ఇస్తున్న. గత పాలకులు వదిలిపెట్టిన తిరుమలగిరిసాగర్‌కు నీళ్లిచ్చే లిఫ్ట్‌ను ఏడాదిన్నరలో పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానని మా మంత్రి సవాల్‌ విసిరారు. వందశాతం ఆయన కరెక్ట్‌గానే చెప్పిండు. మా మంత్రి ప్రకటనను సమర్థిస్తూ నేను మీకు హామీ ఇస్తున్న. ఎక్కడైనా భిక్షమెత్తయినా సరే ఆ లిఫ్ట్‌ పూర్తి చేయించే బాధ్యత నాది. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలున్నయి. చిన్న చిన్న వాగులన్నయి.. బ్రిడ్జిలు లేవు.. కట్టించాలని కోరారు. అది పెద్ద సమస్య కాదు.

నెల్లికల్‌ నీళ్లలో కేరింతలు కొట్టాలె

కరెంటు బాధలు తీర్చినం. మంచినీళ్ల బాధ తీర్చినం. పేదలకు సంక్షేమం చేస్తున్నం. ఇయ్యాల సాగు నీళ్లపై పడ్డాం. అక్కడ గోదావరిపై బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదారి నీళ్లు తెచ్చి ప్రజల కాళ్లు కడుగుతున్నం. పేపర్లలో చదువుతున్నం.. టీవీల్లో చూస్తున్నం.. ఏప్రిల్‌ నెలలో వాగుల్లో, చెరువుల్లో, చెక్‌డ్యాంలలో నీళ్లు పొంగి పొర్లుతుంటే కేరింతలు కొట్టి ప్రజలు డ్యాన్స్‌ చేస్తున్నరు. అట్లనే మీరంతా రేపు నెల్లికల్‌ లిఫ్ట్‌ నీళ్లలో కేరింతలు కొట్టాలే. ఆ కేరింతలు మా భగత్‌ చెవిలో, నా చెవిలో, మా మంత్రి చెవిలో పడాలే. మేం కోరేది గది. నాగార్జునసాగర్‌ కట్టాల్సింది ఇక్కడ కాదు.. 19 కి.మీ. పైకి ఏలేశ్వరం దగ్గర కట్టాలే. అట్ల కడితే ఇయ్యాల తిరుమగిరిసాగర్‌ దానంతట అదే పారేది. ఈ లిఫ్ట్‌లు అవసరమయ్యేవే కావు. ఇవన్నీ మీకు, ఇక్కడున్న విద్యాధికులకు తెలుసు.

సభ జరుగొద్దని కుట్రలు చేశారు..

ఈ రోజు ఈ సభ జరగకూడదని, మీరు, నేను కలువకూడదని కొందరు చెయ్యని ప్రయత్నం లేదు. హైకోర్టుకు పోవుడు.. ఎలక్షన్‌ కమిషన్‌కు పోవుడు.. ఇవన్నీ ఎందుకుచేసిండ్రో మీరు ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే సభలు పెట్టుకొని ప్రజలకు మంచి చెడ్డలు చెప్పి, మమ్మల్ని సమర్థించాలని అడుగుతరు. ప్రధానమంత్రి, చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఈ మధ్య ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ప్రచారంచేస్తున్నారు. అక్కడెక్కడా ఇలా సభను రద్దుచేయాలని కోరలేదు. కానీ ఇక్కడనే ఎందుకో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభ జరగనియ్యొద్దని చాలా ప్రయత్నం చేశారు. ఉర్దూలో ఒక సామెత ఉంది…‘ముదాయీ లాఖ్‌ బురా చాహేతో క్యా హోతా హై.. వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతాహై’ ఆ విధంగా జరుగుతా ఉంది.

తెలంగాణలో నీళ్లు దుంకుతున్నట్టు ఓట్లు దుంకాలె!

రైతుబంధు, రైతుబీమా వస్తలేవా?

ముప్పై ఏండ్లుచేసినం.. అరవై ఏండ్లు చేసినం అంటారు. పచ్చజెండా వాడేమో పింఛను 75 రూపాయలు ఇచ్చిండు. వీళ్లు రూ.200 ఇచ్చిండ్రు. అదే మేము ఇయ్యాల పదిరెట్లు పెంచి రూ.2016 ఇస్తున్నం. అనేక పథకాలను అమలుచేస్తున్నం. మీ కండ్ల ముందే వాటి ఫలితాలు ఉన్నయి. మీ గ్రామాల్లో రైతుబంధు వస్తలేదా? రైతుబీమా వస్తలేదా? కల్యాణలక్ష్మి వస్తలేదా? గతంలో ఇవన్నీ ఉండెనా? గతంలో ఓ రైతు చచ్చిపోతే ఓ పైరవీకారు దగ్గరికి పోతే ఓ 50 వేలు ఇవ్వడానికి ఐదారు నెలలు తిప్పి.. ఆఖరికి పది ఇరవై వేలు చేతిలో పెట్టేవారు. కానీ ఇయ్యాల గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజుల్లోపల రూ.5 లక్షలు వారి బ్యాంకులో పడుతున్నయి. ఇదే కాంగ్రెస్‌ పరిపాలన ఉంటే టింగుటింగుమంటూ మీ సెల్‌ఫోన్లకు రైతుబంధు మెసేజ్‌లు వస్తులేవా? మధ్యల దరఖాస్తులు దఫ్తర్లు.. గీకేటోడు.. గోకెటోడు! సగం బోయి సగం చేతికొస్తుండే. కానీ ఈ రోజు ఈ పైరవీ లేదు.. ఇప్పుడు ఎక్కడికి పోయే అవసరం లేదు. ధరణి పోర్టల్‌లో నీ భూమి వచ్చిందంటే నీకు ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు పంటకు రూ.5 వేల చొప్పున సంవత్సరానికి రూ.10 వేలు మీ బ్యాంకుకు డబ్బులు వస్తున్న మాట వాస్తవం కాదా? కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు ఉన్న తేడా ఇదీ. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చినం. ఇదొక చరిత్ర. గతంలో ఎవరి భూముల్ని పడితే వారివి గుంజుకునేటోళ్లు.. ఇష్టమొచ్చినట్లు చేసేది. ప్రజలకు ఈ దరఖాస్తులు, దఫ్తర్లు పెట్టే బాధలు ఉండొద్దని హైదరాబాద్‌లో ఒక రూపాయి రిలీజ్‌ చేస్తే నేరుగా మీ ఖాతాలో వచ్చేటట్టు ఏర్పాట్లు చేసినం. ఇది కూడా మీ కండ్ల ముందే ఉన్నది.

రొమ్ము విరిసి.. కాలర్‌ ఎగరేసి చెప్తున్న..

ఇయ్యాల నేను బల్లగుద్ది.. రొమ్ము విరుసుకొని.. కాలర్‌ ఎగురేసుకొని చెప్తున్న. ఇండియాలో ఈ యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో వరి నా తెలంగాణ సాగుచేసింది. ఎవరైతే మనల్ని ఎక్కిరించిండ్రో.. ఎగతాళి చేసిండ్రో ఆ ఆంధ్రా కేవలం 20 లక్షల ఎకరాలతో మూడో స్థానంలో ఉంది. ఇయ్యాల తలసారి ఆదాయం పెరిగింది.. తలసారి విద్యుత్తు వినియోగం పెరిగింది. తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది. ముందుకు పోతున్నాం.

ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలె

గతంలో నేను హాలియా సభకు వచ్చినప్పుడు.. నేను చెప్పిందే మీరు వేదం అనుకోవాల్సిన అవసరం లేదు.. మీ ఊర్లకు పోయిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టండి.. నిజానిజాలు తేల్చండి.. పరిణతితో, ఆలోచనతో ఓటు వేయాలని చెప్పిన. ఆ రోజు సభలో కూడా మీలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ రోజు కూడా మళ్లీ విజ్ఞప్తి చేస్తున్న. ఎలక్షన్‌ రాగానే ఆగంమాగం కావొద్దు. ఎవరు చెప్పేది వారు చెప్తరు. కానీ మన విచక్షణ వినియోగించాలి. నిజమేందో గమనించాలి. మంచి చేసేవాళ్లను సమర్థిస్తే మనకు మంచి జరుగుతది. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు రావు. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయాలంటే ముండ్ల చెట్లకు పండ్లు కాయయి. పండ్ల చెట్లు పెడితేనే పండ్లు కాస్తయి. కాబట్టి దేన్ని పెట్టాలో దేన్ని పెట్టొద్దో ఆలోచించాలె. సేవ కోసం ఎవర్ని వినియోగించాలనేది నిర్ణయించాల్సింది మీరు. వాస్తవాలన్నీ మీ కండ్ల ముందు ఉన్నయి. ఒక నెల రోజుల నుంచి గ్రామాల్లో చర్చలు జరుగుతున్నయ్‌.. చర్చలు తేలిపోయినయ్‌.. అన్ని విషయాలు అర్థమైనయ్‌.. ఎవరు గెలిస్తే మంచిదో.. ఎవరు గెలిస్తే మీ నియోజకర్గం అభివృద్ధి చెందుతదో.. మీకు ఈపాటికే ఓ అవగాహన వచ్చి ఉంటది.

తెలంగాణలో నీళ్లు దుంకుతున్నట్టు ఓట్లు దుంకాలె!

నాన్న హామీలు నెరవేరుస్తా

2018లో సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో మా నాన్న నోముల నర్సింహయ్యను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆయన ఆఖరిశ్వాస వరకు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. 35 ఏండ్లలో చేయని అభివృద్ధిని ఐదేండ్లలో చేస్తానని నాన్నగారు హామీ ఇచ్చారు. ఆయన అకాల మరణంతో సీఎం కేసీఆర్‌ నాపై నమ్మకాన్ని ఉంచి నా ద్వారా ఆ హామీలు నెరవేర్చేందుకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మూడేండ్లలో ఆ హామీలన్నీ నెరవేర్చేందుకు మీ ముందుకు వచ్చా. నన్ను గెలిపిస్తే మీ కొడుకులా, అక్కలు అన్నలకు తమ్ముడిలా సేవ చేసుకుంటా.

-టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్

త్యాగాల టీఆర్‌ఎస్‌..

ఉద్యమం మొదలు పెట్టిననాడే నాకున్న డిప్యూటీ స్పీకర్‌ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసి వచ్చి ఈ గులాబీ జెండా ఎగరేసిన. ఉద్యమంలో నా ప్రాణం అన్న పోవాలే.. లేదా రాష్ట్రం అన్నా రావాలే కానీ మధ్యలో మాత్రం మడమ తిప్పా.. ఎనుకకు తిరుగా.. అని చెప్పిన. ఒకవేళ ఎనుకకు తిరిగితే రాళ్లతో కొట్టి చంపుమని చెప్పిన. ఇట్ల ఎవడూ చెప్పలే. కాంగ్రెస్‌ నాయకులు సక్కగా ఉంటే గులాబీ జెండా ఎందుకు ఎగిరేది? నా వెంట అనేకమంది అనేక సందర్భాల్లో గడ్డిపోచల్లా మా పదవులు ఇసిరేసినం. పదవుల కోసం తెలంగాణను ఆంధ్రోళ్లకు వదిలిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. పదవుల కోసం తెలంగాణను వదిలిపెట్టింది కాంగ్రెస్‌ అయితే.. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది టీఆర్‌ఎస్‌. ఇది నిజమా కాదా మీకే తెలుసు. ఎన్ని రాజీనామాలుచేసినం.. ఎన్ని ఉప ఎన్నికల్లో పోరాటం చేసినం! ఇలాంటి ఎన్నికలు ఎన్ని కొట్లాడినం! ఇదంతా ఎక్కడో ఎప్పుడో జరిగింది కాదు. నిన్న మొన్న మీ కండ్లముందు జరిగిన చరిత్ర. మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ ఆలోచన చేయాలి. న్యాయం ఎటువైపు ఉంది.. నిజం ఎటువైపు ఉందో ఆలోచించాలి.

ఎవరి భిక్షో కాదు.. తెలంగాణ ప్రజల భిక్ష

ఎవరేం చేసిండ్రో మీరంతా ఆలోచన చేయాలె. పార్టీల చరిత్ర కూడా చూడాలె. ఒకాయన వచ్చి విచిత్రంగా మాట్లాడిండు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అని మాట్లాడిండు. ఒకవేళ నాకు ముఖ్యమంత్రి పదవిని జానారెడ్డి భిక్షపెట్టే పరిస్థితే ఉంటే ఆయనే కావాలనుకుంటడు కానీ నాకిస్తడా! ఇది జరిగే పనేనా! కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి భిక్ష పెట్టింది మీరు.. తెలంగాణ ప్రజలు. నాకెవడు భిక్ష పెట్టలే. వీళ్లంతా భిక్షగాళ్ల లెక్క వంగి లొంగి పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్లు.

అప్పుడు జానారెడ్డి ఏడ పన్నడో తెల్వదు

గోదావరిలో మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నయి. కానీ కృష్ణలో కొద్దిగా షార్టేజీ ఉంది. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తయి. అప్పుడు కూడా వీళ్లు నోరే మూసిండ్రు. నీళ్లు రాలే. ఓ నాడు నేనే 40 వేల మందిని జమచేసి నాగార్జునసాగర్‌ కట్టపై బొబ్బ చేసినా.. అప్పుడు ఈ జానారెడ్డి ఏడ పన్నడో ఎవడికీ తెలియదు. వీళ్లు నీళ్ల కోసం మాట్లాడలేదు.. కొట్టాడలేదు. అన్యాయం జరుగుతుంటే ఏ రోజూ నోరు విప్పలే. తెలంగాణ నాశనమై, ఆత్మహత్యలపాలై ఆగమాగమైందంటే పదవుల కోసం వంగీ లొంగీ నంగినంగి ఉన్నటువంటి వీళ్లు కారణం కాదా? దయచేసి ఆలోచన చేయాలి.

ఆ నీళ్లలో కేసీఆర్‌ కనిపిస్తలేడా?

ఒకప్పుడు ఈ జిల్లాల్లో మంచి నీళ్లు ఉండెనా? ఈ జిల్లా నీళ్ల గోసపై ‘ఏమాయె నా నల్లగొండ.. ఏడుపే నీ గుండె నిండా.. గుండె మీద ఫ్ల్లోరైడ్‌ బండ’ అంటూ నేనే పాట రాసిన. ఈ ముప్పై ఏండ్ల చరిత్ర ఉన్నోళ్లు ఏం చేసిండ్రు? కృష్ణానది ఒడ్డున ఉన్న తిరుమలగిరిసాగర్‌ వద్ద అనేక గ్రామాల్లో మంచినీరు లేకుండే. గోస అనుభవించినోళ్లు మీరు కాదా? ఈ రోజు బ్రహ్మాండంగా మిషన్‌ భగీరథలో ప్రతిరోజు వచ్చే నల్లా నీళ్లల్లో కేసీఆర్‌ మీకు కనిపిస్తలేడా?

ఒక్క కరెంటు ఉదాహరణ చాలదా!

కాంగ్రెసోళ్లు అరవై ఏండ్లు పాలన చేసి తెలంగాణను అగం పట్టించిండ్రు. మేం ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ వస్తున్నాం. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం కుండను పిసుకం.. ఒక్క మెతుకును చూస్తం. ఒక్క కరెంటు ఉదాహరణ చాలదా మీకు! అనాడు మీకు కరెంటు ఎట్ల ఉండే? ఇయ్యాల ఎట్ల ఉన్నది? ఇదంతా ఉట్టిగనే ఉహూ అని మంత్రం ఏస్తే అయిందా? 25 వేల కోట్లు ఖర్చు పెట్టి.. అహోరాత్రులు భయంకరంగా కష్టపడిపనిచేస్తే ఇయ్యాల మీ నెత్తిమీద తిరిగే ఫ్యాన్‌ ఆగుతలేదు. తెల్లందాకా పొలంకాడికి పోయి తేలు కాటుకు, పాము కాటుకు గురయ్యే బాధలు తప్పినయ్‌.

ముప్పై ఏండ్ల చరిత్రలో జానా చేసిందేంటి?

జానారెడ్డి మాట్లాడితే నాది ముప్పై ఏండ్ల చరిత్ర.. అంత పొడుగు.. ఇంత పొడుగు.. అని అంటరు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చేదాకా ఆ నందికొండ మున్సిపాలిటీ ఒక అనాథ. అది పంచాయతీ కాదు.. మున్సిపాలిటీ కాదు. దాని ఖర్మానికి దాన్ని వదిలిపెట్టారు. మొన్ననే దాన్ని మున్సిపాలిటీ చేస్తే మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినయ్‌. గతంలో అక్కడ అవకాశం ఉన్నోళ్లు, అధికారం ఉన్నోళ్లు జాగలను ఆక్రమించుకున్నరు. వాళ్ల బంగ్లాలైతే కట్టుకున్నరు కానీ పేద ప్రజల్ని పట్టించుకోలేదు. నందికొండ మున్సిపాలిటీలో ఇరిగేషన్‌ జాగల సమస్యను భగత్‌ను ఎమ్మెల్యేగా తీసుకొని వచ్చి, నేనే అక్కడ కూర్చొని, నా చేతితోనే ఆ సర్టిఫికెట్టు మీకు అందిస్త. జానారెడ్డి ముప్పై ఏండ్లకాలంలో నాగార్జునసాగర్‌కు ఓ డిగ్రీ కాలేజీ కూడా దిక్కులేకుండా ఉంది. నర్సింహయ్య నన్ను ఊకే కోరితే ఈ మధ్యనే హాలియాలో డిగ్రీ కాలేజీ వచ్చింది.. రేపు సాగర్‌లోనూ డిగ్రీ కాలేజీ రాబోతున్నది. సాగర్‌లో ఓ బీసీ గురుకుల పాఠశాల ఉంది. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడే హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. ఆ రోజే మంత్రిగారితో మాట్లాడినా.. వసతులన్నీ బాగున్నయి.. నాగార్జునసాగర్‌ మంచి విద్యాకేంద్రం.. అలాంటి ఇక్కడ డిగ్రీ కాలేజీ ఎందుకు పెట్టకూడదని అడిగితే తప్పకుండా పెట్టాలే సార్‌ అని అన్నరు. వెంటనే మంజూరు చేసిన. నాగార్జునసాగర్‌ నందికొండలో కూడా గురుకుల పాఠశాలగా ఉన్న ఆ స్కూలును డిగ్రీ కాలేజీగా మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నా.

డాక్టర్లు నన్ను బెదిరిచ్చిండ్రు

గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ ఓ అనాథలాగా ఉండేది. అడిగేవాడు లేడు.. నిలదీసేవాడు లేడు.. మాట్లాడేవాడు లేడు. దానికి బాధ్యులెవరు? ఇదే కాంగ్రెస్‌ పార్టీ కాదా? ఇదే పెద్దలు కాదా? దయచేసి మీరు ఓటువేసే ముందు ఆలోచించాలే. ఆనాడు నాకు ధనబలం లేదు.. గూండాల, తండాల బలం లేదు.. మీడియా బలం లేదు. ఆత్మబలంతోని అడుగు ముందుకేసిన. చివరికి హైదరాబాద్‌లో నిజాం హాస్పిటల్‌లో డాక్టర్లు నన్ను బెదిరించిండ్రు. ‘నువ్వు రేపే కోమాలోకి పోతవ్‌.. ఎల్లుండే కోమాలోకి పోతవ్‌.. కోమాలోకి పోతే బతుకవ్‌’ అని భయపెట్టిండ్రు. కానీ నేను దీక్ష విరమించలేదు. నేను దీక్ష పట్టిననాడే చెప్పినా.. ‘కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని దీక్ష పట్టిన. ఆ దీక్షనే కదా నేడు తెలంగాణ తెచ్చింది! తెలిసి కూడా తెలియనట్లు ఉండొద్దు.. అర్థం అయి కూడా అర్థం కానట్లు ఉండొద్దు. దయచేసి ఓటు వేసే ముందు ఇవన్నీ ఆలోచించాలని కోరుతున్న.

షాదీఖానా కట్టించే బాధ్యత నాది..

కులం, మతం, జాతి అనే తేడా లేకుండా అందరి కోసం టీఆర్‌ఎస్‌ పనిచేస్తున్నది. అన్ని మతాలను ఆదరిస్తున్నది. ముస్లిం సోదరులు హాలియాలో షాదీఖానా కావాలని, మసీదులు రిపేర్లు చేయాలని కోరుతున్నారు. హాలియాలో షాదీఖానా కట్టించే బాధ్యత నాది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో నీళ్లు దుంకుతున్నట్టు ఓట్లు దుంకాలె!

ట్రెండింగ్‌

Advertisement