సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:23

పల్లెలు జాగ్రత్త!

పల్లెలు జాగ్రత్త!

  • పట్నం నుంచి గ్రామాలకు కరోనా విస్తరణ
  • కొంపముంచుతున్న అవగాహన లేమి
  • కొందరి నిర్లక్ష్యంతో పొంచి ఉన్న ప్రమాదం
  • ‘గోల్డెన్‌ అవర్‌' ముగియటంతో మరణాలు
  • ముప్పు తప్పాలంటే జాగ్రత్తలు తప్పనిసరి
  • ఎక్కడివారు అక్కడ ఉండటమే ఉత్తమం
  • ప్రజలను హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు

కరోనా మహమ్మారి క్రమంగా పట్నం నుంచి పల్లెలకు పాకుతున్నది. నిన్నటివరకు హైదరాబాద్‌లో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఇప్పుడు జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కొందరు నిర్లక్ష్యంతో వైరస్‌ను ఊళ్లకు మోసుకెళ్తుండగా, మరికొందరు తెలియకుండానే వాహకులుగా మారుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగుల్లో కొందరు వర్క్‌ ఫ్రం హోం పేరుతో, ఉపాధిలేక మరికొందరు ఇంటి బాటపడుతున్నారు. లక్షణాలు కనిపించకుండానే దాడిచేస్తున్న కరోనా వైరస్‌ వీరిలో ఉండటంతో స్థానికవ్యాప్తి పెరుగుతున్నది.

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిపై అవగాహన పెరగటంతో హైదరాబాద్‌లో చాలామంది కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ర్యాపిడ్‌టెస్ట్‌లు అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితాల్లో పాజిటివ్‌ అని తెలియగానే కొంత మంది గుట్టుచప్పుడు కాకుండా ఊళ్లకు వెళ్తున్నారు. మరికొందరు పరీక్షల సమయంలో తప్పుడు చిరునామాలు ఇస్తూ.. పాజిటివ్‌ అని తెలియగానే ఫోన్లను స్విచ్‌ఆఫ్‌లో పెట్టి నగరం నుంచి మాయమవుతున్నారని వైద్యాధికారులు చెప్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వాళ్లలో కొందరు అన్నిరకాల మందులతో వెళ్తుండగా, మరికొంత మంది క్వారంటైన్‌ పేరుతో ఊళ్లకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలామంది తమకు తెలియకుండానే దారిపొడవునా వైరస్‌ను వ్యాప్తిచేస్తున్నారు. తోటి ఉద్యోగులకు కరోనా సోకిందని తెలియగానే మిగతావాళ్లు సొంతూళ్లకు వెళ్తున్నారు. క్రమంలో ఇండ్లకు వెళ్లిన వారం, పదిరోజుల తర్వాత కొందరికి లక్షణాలు బయటపడటం, లేదా వైరస్‌ బారిన పడటం జరుగుతున్నది. ఈ విధంగా ప్రత్యక్షం, పరోక్షంగా వైరస్‌ను నగరం నుంచి పల్లెలకు మోసుకెళ్తున్నారని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నిర్వహించిన సర్వేలోనూ గ్రామాల్లో ఇప్పటికీ కరోనా జాగ్రత్తలపై అవగాహన తక్కువేనని తేలింది. మాస్కులు, హ్యాండ్‌వాష్‌, శానిటైజర్లు వాడటం, పరిశుభ్రత తదితర అంశాల్లో ఇంకా అవగాహన పెరుగాలని సూచించింది. నిర్లక్ష్యం కూడా గ్రామాల్లో శాపం గా మారుతున్నది. కరోనా కాటేస్తుందని తెలిసినా.. వందలమందితో దావత్‌లు, రాత్రుళ్లు మందుబాబుల సిట్టింగ్‌లు, దోస్తులతో కలిసి పర్యటనలు, నలుగురైదుగురు గుమికూడి ఆడుకోవడం వంటివి నిరాటంకంగా కొనసాగాయి. సూర్యాపేటలో వైరస్‌వ్యాప్తికి కారణమైన ‘అష్టాచెమ్మా’ ఘటనే ఉదాహరణ. ‘తెలిసినవాళ్లే కదా’ అనే భావనతో కలిసిమెలిసి తిరుగడం వంటివి చేటుగా మారాయి.

గోల్డెన్‌ అవర్‌ అత్యంత కీలకం

దవాఖానకు తీసుకెళ్లాక కాసేపటికే రోగి చనిపోతే.. ‘కాస్త ముందే తీసుకొచ్చి ఉంటే బతికించేవాళ్లం..’ అన్న మాటను డాక్టర్ల నోట వింటుంటాం. ఈ వ్యవధినే గోల్డెన్‌ అవర్‌ అంటారు. పల్లెల్లో కరోనా సోకిన రోగిని, పట్నానికి తీసుకొచ్చేలోపే మరణిస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి.



logo