ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 03:00:19

మహిళలపై నేరాలను ఉపేక్షించం

మహిళలపై నేరాలను ఉపేక్షించం

  • మమత కుటుంబానికి న్యాయం చేస్తాం
  • యాదవ సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. మహిళల రక్షణలో రాజీలేకుండా పనిచేస్తున్నట్లు ఆమె చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామస్థులు, యాదవ సంఘం ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను కలిశారు. న్యావనందిలో హత్యకు గురైన పుర్రె మమత కేసులో నిందితులకు కఠిన శిక్షపడేలా కృషి చేయాలని యాదవ సంఘం నాయకులు ఆమెకు విన్నవించారు. వెంటనే ఆమె నిజామాబాద్‌ సీపీ కార్తికేయతో ఫోన్‌లో మాట్లాడి కేసు దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. మమత కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కవిత యాదవ సంఘం ప్రతినిధులకు ధైర్యం చెప్పారు. లోతైన దర్యాప్తు జరిపి నిందితులు ఎంతటి వారైనా పట్టుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని కవిత గుర్తుచేశారు.