బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:09

తాటాకులా నీరా కేఫ్‌

తాటాకులా నీరా కేఫ్‌

  • అత్యాధునిక హంగులతో పదిస్టాల్స్‌ నిర్మాణం
  • తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యం
  • 250 మంది కూర్చునేలా ఏర్పాటు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు, అత్యాధునిక హంగులతో నిర్మాణాల కలబోతగా నెక్లెస్‌రోడ్డులో నీరాకేఫ్‌ కొలువుదీరనున్నది. 1800 చదరపు మీటర్ల స్థలంలో.. రూ.3 కోట్లతో నిర్మించే నీరాకేఫ్‌కు గురువారం శంకుస్థాపన జరుగనున్నది. ప్రజలకు ఆరోగ్యకరమైన నీరాను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నీరా పాలసీని తీసుకువచ్చింది. వెయ్యి చదరపు మీటర్లలో కేఫ్‌ స్టాళ్లు, 800 చ.మీ. ఓపెన్‌స్పేస్‌లో హుస్సేన్‌సాగర్‌ వ్యూ కన్పించేలా సీటింగ్‌ ఏర్పాటుచేస్తున్న నీరాకేఫ్‌ మొత్తంగా చూస్తే తాటాకు ఆకృతిని పోలి ఉంటుంది. 

ఇవీ ప్రధాన ప్రత్యేకతలు

  • మొత్తం పది స్టాళ్లు ఉంటాయి. వీటిలో ప్రధాన స్టాల్‌ అయిన నీరాస్టాల్‌ 10 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. మిగిలిన తొమ్మిది స్టాళ్లు 5 మీటర్ల పొడవు..5 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. 
  • గ్రౌండ్‌ఫ్లోర్‌ అంతా స్టాళ్లు..నీరా కేఫ్‌కు వచ్చినవారు కూర్చునేలా డిజైన్‌చేస్తున్నారు. మొదటి అంతస్తులో 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బాంక్వెట్‌హాల్‌ నిర్మిసారు. దీనిని ప్రత్యేక కార్యక్రమాలకు అద్దె ఇస్తారు.
  • నీరాస్టాల్‌తోపాటు ఇతర స్టాళ్లలో తలకాయకూర, బోటి, గుడాలు, పాయా తదితరరకాల తెలంగాణ వంటకాలు నోరూరించనున్నాయి.  
  • మొత్తం స్టాల్‌లో కొంతవరకు పూర్తి ఏసీ, మరికొంతవరకు సెమీ ఏసీ, కేఫ్‌ ముందు రోడ్డువైపు, హుస్సేన్‌సాగర్‌వైపు వ్యూలో కూర్చునేలా సీటింగ్‌ చేస్తున్నారు. 
  • హుస్సేన్‌సాగర్‌వైపు కూర్చునే సీట్లను తాటి మొద్దులు, ఈత మొద్దులపై కూర్చున్నట్టుగా అనిపించేలా చెక్కతో చేయనున్నారు. నీరాకేఫ్‌లో ఒకేసారి మొత్తం 250 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తారు. 
  • స్టాళ్లకు రెండువైపులా కొనుగోలుదారులు వచ్చి కొనుగోలు చేసేలా ఏర్పాటు ఉండడం మరింత సౌకర్యవంతంగా ఉండనున్నది.  
  • కేఫ్‌ ముందుభాగంలో ఒకేసారి 20 కార్ల వరకు రోడ్డు వెంట ఆన్‌స్ట్రీట్‌ పార్కింగ్‌ చేసుకునేలా డిజైన్‌ చేశారు. మిగిలినవారు లేక్‌వ్యూ పోలీస్‌స్టేషన్‌ వెంట, పీపుల్స్‌ప్లాజా వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసుకునే వీలుంటుంది.  


logo