బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 12, 2020 ,

ఎన్నార్సీ.. సీఏఏపై చర్చ అవసరం

ఎన్నార్సీ.. సీఏఏపై చర్చ అవసరం

రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు లోబడి మాత్రమే చట్టాలు రావాలని, వీటిని కాదని ఏ చట్టం తీసుకొచ్చినా చెల్లుబా టు కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు.

  • రాజ్యాంగ సూత్రాలకు లోబడే చట్టాలు రావాలి
  • సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

చిక్కడపల్లి: రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు లోబడి మాత్రమే చట్టాలు రావాలని, వీటిని కాదని ఏ చట్టం తీసుకొచ్చినా చెల్లుబా టు కాదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌) వంటి చట్టాలు మౌలిక సూత్రాలకు లోబడి ఉన్నాయా? లేదా అనే విషయంపై చర్చ జరుగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే సమయంలో వివిధ రూపాల్లో తొలుత ప్రజల ముందు చర్చకుపెట్టి అమలుచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆలిండియా లాయర్‌ యూనియన్‌ (ఐలు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘పౌరసత్వం అంటే ఏమిటి- రాజ్యాం గం’ అనే అంశంపై శనివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఒక మతం ప్రాతిపదికన చట్టం తీసుకురావడం సబబుకాదన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాదంగా మారాయని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా? లేదా అనే అంశం పెండింగ్‌లో ఉన్నదని, మనం సమర్పించే ఆధారాలు, వినిపించే వాదనలు బలంగా ఉండాలని అన్నారు. 

దేశంలోని విదేశీయుల పరిస్థితి ఏమిటి?

ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌ వంటి చట్టాలు వచ్చాక దేశంలో ఉన్న విదేశీయుల పరిస్థితి ఏమిటనే అనుమానం కలుగుతున్నదని కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ ప్రొ ఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. విదేశీయులుగా గుర్తించినప్పటికీ వారందరిని ఎక్కడ ఉంచుతారని ప్రశ్నించారు. దేశంలో 80 కోట్ల మంది గుర్తింపుపొందనివారు ఉంటారని, వారంతా దేశపౌరులుగా నిరూపించుకోవాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఐలు ఉపాధ్యక్షుడు పార్థసారథి పాల్గొన్నారు.


logo