బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:38:37

రూపాయికి యాభై రెట్ల ఫలితం

రూపాయికి యాభై రెట్ల ఫలితం

  • నేషనల్‌ మాన్‌సూన్‌ మిషన్‌తో భారీగా తగ్గిన పంటనష్టాలు 
  • రైతుల అభిప్రాయాల ఆధారంగా వెల్లడించిన ఎస్సీఏఈఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కచ్చితమైన ముం దస్తు వాతావరణ హెచ్చరికలతో పంటల నష్టాన్ని నివారించడం వీలవుతున్నది. వాతావరణ మార్పులను కచ్చితంగా అంచనా వేసేలా కేంద్రం రూపొందించిన ‘మాన్‌సూన్‌ మిషన్‌ అండ్‌ హై ఫర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ ఫెసిలిటీ’ సత్ఫలితాలు ఇస్తున్నది. ఐదేండ్లలో దీనికోసం రూ.వెయ్యికోట్లు వెచ్చించగా.. ప్రతిరూపాయికి, రూ.50 విలువైన ఫలితం వచ్చినట్టు తేలింది. రూ.50,447 కోట్ల మేర పంటలు నష్టపోకుండా కాపాడటం వీలయింది. దేశవ్యాప్తంగా వేలమంది రైతులు, మత్స్యకారులను చేసిన సర్వే ద్వారా ఈ మేరకు ఫలితాలు వెల్లడైనట్టు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఐప్లెడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) తెలిపింది. కచ్చితమైన వాతావరణ అంచనాల ద్వారా దేశవ్యాప్తంగా 1.7  కోట్ల వ్యవసాయ కుటుంబాలకు మేలు జరిగిందని, 53 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు ఈ సమాచారం ఉపకరించిందని వెల్లడించింది.

భారత వాతావరణశాఖ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) సంస్థలు సంయుక్తంగా జిల్లాలస్థాయిలో అగ్రోమెట్‌ ఫీల్డ్‌ యూనిట్లు ఏర్పాటుచేసి వాటిద్వారా వారానికి రెండుసార్లు రైతుల ఫోన్‌నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారాన్ని అందించారు. మేఘదూత్‌ వంటి యాప్స్‌, ఐఎండీ వెబ్‌సైట్‌, కిసాన్‌ పోర్టళ్లు, మీడియా ఇలా పలు మాధ్యమాల ద్వారా ఇచ్చిన సమాచారం అందించింది. మత్స్యకారులు, పాడిరైతులకు ఈ సమాచారం ఎంతో ఉపకరించింది. ప్రస్తుత సమాచారం ఉపయుక్తంగా ఉన్నదని, సముద్ర వాతావరణ పరిస్థితులపై రోజువారీగా తమకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అలర్ట్‌ పంపితే మరింత ఉపయోగపడుతుందని మత్స్యకారులు కోరుతున్నట్టు సర్వే వెల్లడించింది.