బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:24

జాతీయస్థాయిలో మెరిసిన విద్యార్థులు

జాతీయస్థాయిలో మెరిసిన విద్యార్థులు

  • పీజీ సెట్‌లో డిగ్రీ గురుకులాల ప్రతిభ
  • ప్రముఖ ఐఐటీ కళాశాలలకు ఎంపిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షల్లో సత్తాచాటారు. ఐఐటీ, జేఏఎం (జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ ఎమ్మెస్సీ)-2020 ఫలితాల్లో ప్రతిభచాటి ప్రముఖ ఐఐటీ, ఎన్‌ఐటీ కళాశాలల్లోని ఎం ఎస్సీ కోర్సుల్లో సీట్లు సాధించారు. టీఎస్‌డబ్ల్యూఆర్డీసీకి చెందిన విద్యార్థులు.. నాగలక్ష్మి (వికారాబాద్‌) ఎనలైటికల్‌ కెమిస్ట్రీలో, రాణి (మహేంద్ర హిల్స్‌) కెమిస్ట్రీలో, అశ్విని (బుద్వేల్‌) ఫిజిక్స్‌ కోర్సులో ప్రవేశాలకు వరంగల్‌ ఎన్‌ఐటీలో సీట్లు దక్కించుకున్నారు. యామిని సుప్రియ (మహేంద్ర హిల్స్‌) లైఫ్‌సైన్సెస్‌లో రౌర్కెల ఎన్‌ఐటీలో, శ్రీలత (బుద్వేల్‌) కంప్యూటర్‌ సైన్స్‌ తిరుచిరాపల్లి ఎన్‌ఐటీలో, సాయిశివాని ఎంఎస్సీ కెమిస్ట్రీ మణిపూర్‌ ఐఐటీలో సీట్లు సాధించారు.

 టీటీడబ్ల్యూఆర్డీసీకి చెందిన విద్యార్థులు.. కే గిరిజాకుమారి (సూర్యాపేట) ఎంఎస్సీ కెమిస్ట్రీ తిరుపతి ఐఐటీలో, ఎం వంశీకృష్ణ (కరీంనగర్‌), కే అనిల్‌కుమార్‌ (నాగర్‌కర్నూల్‌) సురత్కల్‌ ఎన్‌ఐటీలో సీట్లు పొందారు. అర్హత మార్కులు సాధించిన ఎల్‌ కవిత, ఎం అరుణ్‌కుమార్‌, జీ ఈశ్వరికి ఆయా కళాశాలల్లో సీట్ల ఎంపిక జరుగాల్సి ఉన్నది. వీరితోపాటు జేఏఎంలో అర్హత పొందిన.. కే రాణి ఎంబీజెడ్‌సీ కోర్సు పాట్నా ఐఐటీలో, కే ఉమా ఎంపీసీ కోర్సు బీహార్‌ ఐఐటీ కళాశాలలో సీట్లు సాధించారు. జాతీయస్థాయిలో సత్తాచాటిన విద్యార్థులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు.  


logo