శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 17:26:43

రాష్ట్ర ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు జాతీయ గుర్తింపు

రాష్ట్ర ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు జాతీయ గుర్తింపు

హైదరాబాద్‌ : తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ కౌన్సిల్‌చే A+ కేటగిరి విద్యాసంస్థగా రాష్ట్ర ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌సీఆర్‌ఐ)కు గుర్తింపు దక్కింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కృషి ఫలితమన్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

 సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ సమీపంలోని ములుగులో తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. ఫారెస్ట్రీ ఎడ్యూకేషన్‌, రీసెర్చ్‌, మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యా సంస్థను తీర్చిదిద్దారు. 2016లో ప్రారంభమైన ఈ కాలేజీ దేశంలోనే ప్రతిష్టాత్మక కాలేజీగా రూపుదిద్దుకుంది. ఎఫ్‌సీఆర్‌ఐలో సిల్వికల్చర్‌ అండ్‌ అగ్రో ఫారెస్ట్రీ, నేచురల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్సర్వేషన్‌, వైల్డ్‌లైఫ్‌ అండ్‌ హాబిటేట్‌ మేనేజ్‌మెంట్‌, ఫారెస్ట్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ యుటిలైజేషన్‌, ట్రీ బ్రీడింగ్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, ఫారెస్ట్‌ ఎకాలజీ అండ్‌ ైక్లెమేట్‌ సైన్స్‌, బేసిక్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ కాలేజీ విద్యార్థినికి ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్‌ యూనివర్సిటీలో ఎం.ఎస్‌ కోర్సులో సీటు కూడా దక్కింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఈ ఘనత సాధించింది. కోర్సు ఫీజు మాఫీతో పాటు నెలకు 1500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను విద్యార్థిని దక్కించుకుంది.


logo