గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:15

కేవీకే-వైరాకు జాతీయ అవార్డు

కేవీకే-వైరాకు జాతీయ అవార్డు

  • వినూత్న పద్ధతిలో పంటల సాగుకు చేసిన కృషికి గుర్తింపు 
  • కరీంనగర్‌ జిల్లా మహిళా రైతు లక్ష్మికి జగ్జీవన్‌రామ్‌ పురస్కారం 
  • అవార్డులను ప్రకటించిన ఐకార్‌ 

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/జమ్మికుంట: పంటల సాగులో వినూత్న పద్ధతులను ప్రొత్సహించినందుకుగాను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)కు ప్రతిష్ఠాత్మకమైన పండి ట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ్‌ కృషి  ప్రోత్సాహన్‌ అవార్డు దక్కింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్‌) 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఈ అవార్డును ప్రకటించారు. జోన్‌-10(తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి) పరిధిలో మొత్తం 71 కేవీకేలు పోటీ పడగా వైరా-కేవీకేకు అవార్డు దక్కడం గమనార్హం. వివిధ రకాల  వరిసాగు పద్ధతులపై.. ముఖ్యంగా యంత్రాల ద్వారా నాటు వేయడం, డైరెక్ట్‌ సీడెడ్‌ రైస్‌, పొడి దుక్కిలో వరి విత్తనాలు వేసి నీటి పారుదల కిందకు తీసుకురావడం, సెలినిటిని తట్టుకునే సిద్ది(డబ్ల్యూజీఎల్‌-44) వరి రకాన్ని రైతులలో ప్రమోట్‌ చేయడంలో కేవీకే కృషి చేసింది.  

కరీంనగర్‌ జిల్లా రైతు లక్ష్మికి పురస్కారం

తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించే ‘విత్తనాలు వెదజల్లే’ పద్ధతిలో వరి సాగు చేస్తున్న  కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొం డపల్కల గ్రామానికి చెందిన రూపిరెడ్డి లక్ష్మి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జగ్జీవన్‌రామ్‌ పురస్కారానికి ఎంపికైంది.  కొవిడ్‌ కారణంగా డిజిటల్‌ విధానంలో కార్యక్రమం నిర్వహించగా..  పురస్కారా న్ని నేరుగా లక్ష్మి ఇంటికే పంపించనున్నారు. కేవీకే-వైరా, లక్ష్మికి జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల జోనల్‌ అటార్మీ డైరెక్టర్‌ డాక్టర్‌ వైజీ ప్రసాద్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ప్రవీణ్‌రావు, ఉత్తర తెలంగాణ ఏడీఆర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

 20 విభాగాల్లో 160 అవార్డులు

వ్యవసాయ రంగంలో కృషి చేసిన వారికి ఏటా ఐకార్‌ అవార్డులను అందిస్తున్నది. ఈ ఏడాదికి 20 విభాగాల్లో  160 అవార్డులను ప్రకటించింది. ఇందులో మూడు యూనివర్సిటీలు, రెండు ఏఐసీఆర్‌పీ, 14 కేవీకేలు, 94 మంది శాస్త్రవేత్తలు, 31మంది రైతులు, ఆరుగురు జర్నలిస్టు లు,  10 మంది ఐకార్‌ ఉద్యోగులు ఉన్నారు. అవార్డు పొందిన 141 వ్యక్తుల్లో 19 మంది మహిళలు ఉండటం విశేషం. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ మెనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావుకు అగ్రికల్చర్‌ సైన్స్‌ పరిశోధనల్లో రఫిఅహ్మద్‌ కిడ్వాయ్‌ అవార్డు, ఎక్స్‌టెన్షన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం అధిపతి బీఎస్‌ సోన్‌టక్కి కి స్వామి సహజానంద సరస్వతి ఔట్‌స్టాండింగ్‌ ఎక్స్‌టెన్షన్‌ సైంటిస్ట్‌ అవార్డు దక్కింది. వీరితో పాటు ఎన్‌ విజయలక్ష్మి, ఎస్‌ఎన్‌ రసూల్‌కు జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి.  సోర్గమ్‌పై పరిశోధనలకుగాను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌)హైదరాబాద్‌కు చౌదరీ దేవిలాల్‌ ఔట్‌స్టాడింగ్‌ అవార్డు దక్కింది. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి విశేష కృషి చేసిన పాత్రికేయులకిచ్చే చౌదరి చరణ్‌సింగ్‌  అవార్డు.. అన్నదాత ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ హరికృష్ణకు  దక్కింది. 


logo