సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:39:55

సామాన్యుడి జీవితాన్ని మార్చాలి

సామాన్యుడి జీవితాన్ని మార్చాలి

  • సాంకేతికతను ఆ లక్ష్యంతో ఉపయోగించాలి
  • అనేక రంగాల్లో కృత్రిమ మేధకు అవకాశాలు
  • ఆధునిక టెక్నాలజీని ప్రభుత్వాలు అందుకోవాలి
  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌
  • రాష్ట్రంలో ఏఐపై లోతైన అవగాహన ఉన్న నాయకత్వం
  • నాస్కామ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ దేబ్‌జానీఘోష్‌ ప్రశంస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా నూతన టెక్నాలజీ దూసుకువస్తున్నదని, దీనిద్వారా సామాన్యుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరమున్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఫుడ్‌ సెక్యూరిటీ, మెడికల్‌-హెల్త్‌కేర్‌, అగ్రికల్చర్‌, గవర్నెన్స్‌, లాఅండ్‌ ఆర్డర్‌ తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పెద్దఎత్తున వినియోగించుకునే అవకాశాలున్నాయని తెలిపారు. బుధవారం నాస్కామ్‌తో నిర్వహించిన ‘ఎక్స్‌పీరియన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' సదస్సులో భాగంగా ఐటీ పరిశ్రమలో కృత్రిమ మేధ పాత్ర- భారతదేశం చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్‌తో చర్చాగోష్ఠి నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2020ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇయర్‌గా ప్రకటించామని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేట్టామని తెలిపారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, ఇంటెల్‌, త్రిపుల్‌ఐటీ, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ వంటి ప్రఖ్యాత సంస్థలతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నదని    వివరించారు. 

డాటా వినియోగంపై గోప్యత అవసరం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగానికి పెద్దఎత్తున డాటా అవసరమవుతుందని, డాటా వివియోగంపై జాగ్రత్తతో వ్యవహరిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డాటా వినియోగం- వ్యక్తిగత గోప్యత అంశాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనలోనూ డాటా వినియోగంపై చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఓపెన్‌ డాటా పాలసీ కింద ఇప్పటికే వివిధ శాఖల సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం, విద్యారంగం, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం ఏర్పడాలని చెప్పారు. వ్యవసాయరంగంలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్‌ ప్రాజెక్టును చేపట్టిందని వివరించారు. విత్తనం దగ్గరనుంచి పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చేదాకా ఉన్న అనేక ప్రక్రియల్లో కృత్రిమ మేధ ఉపయోగంపై ఈ ప్రాజెక్టుతో రైతులలో అవగాహన పెరుగుతుందన్నారు. విద్యారంగంలోనూ అనేక ప్రయోజనాలకు కారణమయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ వ్యక్తంచేసిన అభిప్రాయాలతో నాస్కామ్‌ ఏకీభవించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌కు నాస్కామ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ దేబ్‌ జానీఘోష్‌ అభినందనలు తెలిపారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై తెలంగాణలో లోతైన అవగాహన కలిగిన రాజకీయ నాయకత్వం ఉన్నదని ప్రశంసించారు. నాస్కామ్‌ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సర్వే ఆఫ్‌ ఇండియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో నాస్కామ్‌ రూపొందించిన నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదలచేశారు.

ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలి

  • రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్‌

కరోనా నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని కోరారు. జిలాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, కలెక్టరేట్‌ భవన సముదాయ నిర్మాణ పనులు, రైతు వేదికల నిర్మాణాల పురోగతి, 154 గ్రామాల్లో పల్లెప్రకృతి వనాల పనులు జరుగుతున్న తీరును ఆయా శాఖల అధికారులతో బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో సమీక్షించారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డాటా వినియోగం- వ్యక్తిగత గోప్యత అంశాలపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనలోనూ డాటా వినియోగంపై చర్చ జరుగాల్సిన అవసరం ఉంది. 

-మంత్రి కే తారకరామారావు

తాజావార్తలు


logo