శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 03:42:37

నోములకు కన్నీటి వీడ్కోలు

నోములకు కన్నీటి వీడ్కోలు

  • అధికార లాంఛనాలతో నర్సింహయ్య అంత్యక్రియలు   
  • హాజరైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
  • ఎమ్మెల్యే స్వగ్రామం పాలెంలో అంతిమసంస్కారాలు   
  • పాల్గొన్న మండలి చైర్మన్‌, మంత్రులు, పలువురు నేతలు 
  • తరలివచ్చిన అభిమానులు

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలోని నోముల వ్యవసాయక్షేత్రంలో ఆయన కుమారుడు భగత్‌ అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. సీఎం హైదరాబాద్‌ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో పాలెంలోని స్మృతివనానికి చేరుకున్నారు. ఆయనతోపాటు మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు. నర్సింహయ్య భౌతికకాయంపై సీఎం కేసీఆర్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. నోముల కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉన్న ఆయ న చిన్నకుమార్తె బుధవారం రాత్రి చేరుకోవడంతో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. నకిరేకల్‌లోని స్వగృహం నుంచి ఉదయం 8.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున వెంటరాగా 9 కిలోమీటర్ల దూరంలోని పాలెం స్మృతివనానికి 11.15 గంటలకు అంతిమయాత్ర చేరుకున్నది. అక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నర్సింహయ్య మృతదేహానికి పలువురు నివాళి అర్పించారు. 

భారీగా తరలివచ్చిన నేతలు

రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాడెమోస్తూ నర్సింహయ్య భౌతికకాయాన్ని చితిపైకి చేర్చారు. సీఎం కేసీఆర్‌, ఇతర నేతలందరూ గంధపు చెక్కలు ఉంచి నమస్కారంచేశారు. అనంతరం అధికార లాం ఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కుమారుడు భగత్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. నిర్ణీత షెడ్యూల్‌ 35 నిమిషాలే అయినా సీఎం కేసీఆర్‌ గంటపాటు అక్కడే ఉండి అంత్యక్రియలు ముగిశాక హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, ఎన్‌ భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, గాదరి కిశోర్‌కుమార్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, జెడ్పీ చైర్మన్లు బండా నరేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.