శనివారం 04 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 18:46:14

న‌ర్సాపూర్ ఫారెస్ట్.. ప‌క్షుల‌కు నిల‌యం..

న‌ర్సాపూర్ ఫారెస్ట్.. ప‌క్షుల‌కు నిల‌యం..

హైద‌రాబాద్ : ఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ నెల 25న ఉద‌యం 11 గంట‌ల‌కు న‌ర్సాపూర్ ఫారెస్ట్(మెద‌క్ జిల్లా) వేదిక‌గా ప్రారంభించ‌నున్నారు. మ‌రి ఈ ఫారెస్టు ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసుకుందాం. న‌ర్సాపూర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియా ప‌క్షుల‌కు స్వ‌ర్గ‌ధామం. 11,576 హెక్టార్ల‌లో విస్త‌రించి ఉన్న రిజ‌ర్వ్ ఫారెస్టు.. 256 ప‌క్షి జాతుల‌కు నిల‌యంగా ఉంది. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 434 ప‌క్షి జాతులు ఉండ‌గా, కేవ‌లం న‌ర్సాపూర్ రిజ‌ర్వ్ ఫారెస్టులోనే 60 శాతం ప‌క్షి జాతుల‌ను చూడొచ్చు. అయితే ఈ ఏరియా హైద‌రాబాద్ కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నందున‌.. ప‌క్షి ప్రేమికుల‌కు హాట్ స్పాట్ గా మారింది. ప‌క్షుల కిల‌కిల రావాలు వినేందుకు.. వాటిని వీక్షించి.. కెమెరాల్లో బంధించేందుకు ప‌క్షి ప్రేమికులు క్ర‌మం త‌ప్ప‌కుండా న‌ర్సాపూర్ ఫారెస్టును సంద‌ర్శిస్తారు.

న‌ర్సాపూర్ రిజ‌ర్వు ఫారెస్టులో గుర్తించిన 256 ప‌క్షి జాతుల్లో.. 173 స్థానిక ప‌క్షులు. ఇవి న‌ర్సాపూర్ అడవిలోనే నివ‌సిస్తున్నాయి. మ‌రో 83 ప‌క్షుల‌ను వ‌ల‌స ప‌క్షులుగా వ‌ర్గీక‌రించారు. ఈ వ‌ల‌స ప‌క్షులు కేవ‌లం శీతాకాలం, వేస‌విలోనే అడ‌విని సంద‌ర్శిస్తాయి. ఆ ప‌క్షుల‌కు పుట్టిన పిల్ల‌ల్లో ప‌రిప‌క్వ‌త వ‌చ్చిన త‌ర్వాత త‌మ సొంత ప్రాంతాల‌కు ప్ర‌యాణ‌మ‌వుతాయి. హైద‌రాబాద్ బ‌ర్డింగ్ పాల్స్(హెచ్ బీ పీ) ప‌క్షి జాతుల ఉనికిని ఫోటోలు తీసేందుకు, డాక్యుమెంట‌రీని చిత్రీక‌రించేందుకు క్ర‌మం త‌ప్ప‌కుండా న‌ర్సాపూర్ అడ‌వికి వ‌స్తారు. 


logo