శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:11

అర్వింద్‌.. మాటలు జాగ్రత్త

అర్వింద్‌.. మాటలు జాగ్రత్త

  • నీ దొంగ వేషాలు వరంగల్‌లో సాగవు 
  • నిజామాబాద్‌ ఎంపీ తీరుపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం ఫైర్‌
  • కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా: నన్నపునేని 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాదని.. ఆయన అధర్మపురి అర్వింద్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ నిజామాబాద్‌ ప్రజలను మోసం చేసిన అర్వింద్‌ అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తూ.. తామే చేసినట్టుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోజులు కొడుతున్నదని, వరంగల్‌లోని ఇద్దరు ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’ అని ఆదివారం జిల్లాకు వచ్చిన నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఆరోపించడంపై దాస్యం వినయ్‌భాస్కర్‌, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేనినరేందర్‌ మండిపడ్డారు. అర్వింద్‌ మీడియా సమావేశం నిర్వహించి అసత్య ఆరోపణలు చేసిన విషయాన్ని తెలుసుకున్న కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడే బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న అర్వింద్‌ కాన్వాయిపై కోడిగుడ్లు విసిరారు. 

ఈ ఘటనకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై దాస్యం వినయభాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ స్పందిస్తూ.. అర్వింద్‌ అసత్య ఆరోపణలను ఖండించారు. గెలిచిన ఆరు నెలలకే నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెస్తానని నమ్మబలికారని, పసుపు బోర్డు అడిగిన రైతులతో అసలు తనకు పసుపు రైతులు ఓటేయలేదని బుకాయించడంఅర్వింద్‌కే చెల్లిందని దాస్యం వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. 

దేశవ్యాప్తంగా కరోనా కోరల్లో చిక్కుకుంటే వారిని ఆదుకోవటానికి అని చెప్పి రూ.20 లక్షల కోట్లతో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ వల్ల ఎంతమంది పేదలకు న్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రజా తీర్పును గౌరవించి నిజామాబాద్‌లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని దాస్యం తెలిపారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ.. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ 420లాగా వ్యవహరిస్తున్నారన్నారు. గజం జాగా కబ్జా చేసినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ అన్న సంగతి కూడా మరిచిపోయి మాట్లాడటం అర్వింద్‌కు తగదన్నారు.

తాజావార్తలు


logo