తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు..


Thu,January 7, 2016 01:19 AM

The formation of Telangana Medical Council

-ఆరుగురు సభ్యులను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు
-చైర్మన్‌ను ఎన్నుకోనున్న కౌన్సిల్ సభ్యులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరుగురు వైద్యులతో ఈ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కాలేజీ టీచింగ్ స్టాఫ్‌నుంచి డాక్టర్ రాజ్ సిద్ధార్థ్ (అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్), డాక్టర్ వీ రాజలింగం (అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తమాలజీ, సరోజినీదేవి కంటి దవాఖాన), రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌నుంచి నలుగురు.. డాక్టర్ రామక్రిష్ణారెడ్డి (ఫిజీషియన్, హైదరాబాద్), ఈ రవీందర్‌రెడ్డి (పిడియాట్రీషియన్, నిజామాబాద్), డాక్టర్ సీహెచ్ జగన్మోహన్‌రావు (ఆఫ్తమాలజిస్ట్, కరీంనగర్), బీ రమేశ్‌కుమార్ (అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్)లను ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్‌కు నామినేట్ చేసింది.

వీరితో పాటు ఎక్స్- అఫీషియో సభ్యులుగా డీఎంఈ, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్, కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ వ్యవహరించనున్నారు. వైద్యుల రిజిస్ట్రేషన్స్, సీనియర్ వైద్యుల రెన్యూవల్స్, వైద్య ప్రమాణాల పాటింపు, నిరంతర వైద్య విద్య (సీఎంఈ) కార్యక్రమాలన్నీ ఈ కౌన్సిల్ పరిధిలోనే జరుగుతాయి. మొన్నటివరకు ఏపీ మెడికల్ కౌన్సిల్ కిందే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగాయి. తాజాగా ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఇందులోనుంచే ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నారు. ఎథిక్స్ కమిటీ (నైతిక ప్రమాణాల సంఘం), ఎగ్జిక్యూటివ్ కమిటీలను కూడా తర్వాత ఈ కౌన్సిల్ మెంబర్లు ఏర్పాటు చేసుకుంటారు.

-కౌన్సిల్ ఏం చేస్తుంది?
ఇక నుంచి తెలంగాణలో వైద్యసేవలు అందించాలనుకునే వారెవరైనా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఎంబీబీఎస్ పూర్తయ్యాక రిజిస్టర్ చేసుకుంటేనే వారికి ప్రాక్టీసు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. వైద్య వృత్తికీ, ప్రభుత్వానికీ మధ్య మెడికల్ కౌన్సిల్ అనుసంధానంగా, నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. రాష్ట్ర వైద్య మండలి ప్రధాన కర్తవ్యం వైద్యుల పేర్ల నమోదుతోపాటు వైద్యులంతా నియమ నిబంధనలు, ప్రమాణాలు పాటించేలా చూడటం. చికిత్సలో నిర్లక్ష్యం మూలంగా తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించి ఎవరికి ఫిర్యాదు చేసినా.. మెడికల్ కౌన్సిలే దీనికి పరిష్కారం చూపుతుంది. ఈ బాధ్యతను దేశంలో ఎంసీఐ చూసుకుంటే.. రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఎవరైనా వైద్యులు తప్పు చేసినట్లు రుజువైతే చర్య తీసుకునే అధికారం కూడా దీనికి ఉంటుంది. ఎవరైనా వైద్యుల నిర్లక్ష్యం మూలంగా తమకు చికిత్సలో అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే అది ముందుగా వైద్య మండలి చైర్మన్‌కు అందుతుంది. ఆయన దాన్ని నైతిక ప్రమాణాల కమిటీకి పంపిస్తారు. ఎతిక్స్ కమిటీలో సభ్యులు ఇద్దరు మినహా అందరూ వైద్యమండలికి చెందిన వారే ఉంటారు.

ఆ ఇద్దరినీ పేరు పొందిన నిపుణుల సూచన మేరకు ఎంపిక చేసి నియమిస్తారు. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆ కమిటీ దానిపై అభిప్రాయాన్ని అందిస్తుంది. ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా సందేహముంటే ఆ కమిటీ ఇతర నిపుణుల సలహాలను కూడా తీసుకుంటుంది. నైతిక కమిటీ అభిప్రాయంపై వైద్య మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరిగి చర్చిస్తుంది. అనంతరం సర్వసభ్య బృందం కూడా దాన్ని పరిశీలిస్తుంది. ఫిర్యాదు అందిన తర్వాత ఫిర్యాదు చేసినవారినీ, సంబంధిత వైద్యుడిని కూడా పిలిచి మండలి ప్రశ్నిస్తుంది. వివరణ కోరుతుంది. ప్రజలనుంచి అందే ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి వీలైనంత త్వరగా ఫిర్యాదును పరిష్కరించేందుకు మెడికల్ కౌన్సిల్ ప్రయత్నిస్తుంది. వైద్యులపై ఫిర్యాదు చేయాలనుకునేవారు రూ.20 విలువైన స్టాంప్ పేపర్‌పై రాసి వైద్య మండలికి పంపించాలి. కేస్ వివరాలు, డిశ్చార్జి పత్రాలు జతచేయాలి. దొంగ డిగ్రీలను ప్రకటించుకున్నారని ఫిర్యాదు చేస్తే ఆ డాక్టర్ పేరుతో నడుస్తున్న హాస్పిటల్ బోర్డు ఫోటో, ప్రిస్క్రిప్షన్‌లను పంపించాల్సి ఉంటుంది.

-నా వంతు బాధ్యత నిర్వహిస్తా
నాపై నమ్ముకంతో మెడికల్ కౌన్సిల్‌లో సభ్యుడిగా అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే కౌన్సిల్‌లో నావంతు బాధ్యత నెరవేర్చుతా. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. అందుకు మా వంతు బాధ్యత నిర్వహిస్తాం. వైద్యులు నైతిక ప్రమాణాలు పాటించేలా.. ప్రజలకు సేవ చేసేలా అవకాశం దొరకడం సంతోషంగా ఉంది.
- బీ రమేశ్ కుమార్

-దళిత వైద్యునిగా నా సేవలు గుర్తించారు
దళిత వైద్యునిగా నీతి, నిజాయతీతో పనిచేయడాన్ని ప్రభుత్వం గుర్తించింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, ఆశీర్వదించిన డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరికి, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుకు, ఎంపీ వినోద్‌కు కృతజ్ఞతలు. ప్రజలకు, ప్రజారోగ్యానికి, వైద్యులకు మధ్య వారధిగా పనిచేస్తాను.
- బంటు రాజ్ సిద్ధార్థ్

-పేదలకు అండగా ప్రభుత్వ వైద్యం ఉండాలి
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, వైద్యారోగ్య మంత్రి లకా్ష్మరెడ్డికి కృతజ్ఞతలు. ఉమ్మడి రాష్ట్రం లో ఐదేండ్లపాటు మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా చేశాను. నీతి, నిజాయతీని గుర్తించి ప్రభుత్వం అవకాశం కల్పించింది. చాలా సంతోషంగా ఉంది.
- ఈ రవీంద్రారెడ్డి

1731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles