ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 01:48:05

చట్ట సవరణతో అరాచకమే

చట్ట సవరణతో అరాచకమే

  • పేదల విద్యుత్‌ సబ్సిడీలకు ఎసరు 
  • రైతులు గృహ వినియోగదారులపై మోయలేని భారం
  • డిస్కంలు కనుమరుగు.. ప్రైవేటీకరణ దిశగా విద్యుత్‌
  • ‘నమస్తే తెలంగాణ’తో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ నమస్తే తెలంగాణ: సంక్షేమ రాజ్యాల్లో ఏ చట్టమైనా ప్రజలకు ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి. కానీ ప్రజల నడ్డివిరిచి కొంతమందికి మేలుచేసే చట్టాలు చేస్తే అది సంక్షేమ ప్రభుత్వం అనిపించుకోదు. కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన విద్యుత్‌ చట్టసవరణ బిల్లులో ప్రజాప్రయోజనాలకంటే కొద్దిమంది వ్యాపారస్తుల ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి. ఈ బిల్లు చట్టమైతే మొత్తం విద్యుత్‌ వ్యవస్థే ప్రైవేటుపరమై సామాన్యులపై పెరుభారం పడుతుందన్నారు. విద్యుత్‌చట్ట సవరణ బిల్లు-2020పై ‘నమస్తే తెలంగాణ’కు మంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.

విద్యుత్‌ చట్ట సవరణల బిల్లు-2020తో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

ఈ బిల్లుతో ముఖ్యంగా మూడుఅంశాల్లో భారీగా మార్పులు కలుగుతాయి. మన రాష్ట్రంలో 24.4 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఈ రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇకపై ఉండదు. 69 లక్షలమంది గృహ వినియోగదారులతోపాటు 100 యూనిట్ల లోపు విద్యుత్‌ వాడుతున్న ఎస్సీ, ఎస్టీలకు ఇది గుదిబండగా మారుతుంది. కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌కే అందరూ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. ఇది సామాన్యులపై పెను భారం మోపుతుంది.  రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్‌, సభ్యులను కేంద్రం నియమిస్తుంది. టారిఫ్‌ల నిర్ణయాధికారం రాష్ర్టాల పరిధిలో ఉండదు. దాంతో పునర్వినియోగ ఇంధనం ఎంతమేర కొనాలనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. కేంద్రం చెప్పినంత కొనకపోతే జరిమానా విధిస్తారు. ప్రైవేటీకరణ దిశగా డిస్కంలు వెళ్తాయి. చివరికి డిస్కంలు అనేవే ఉండవు. సబ్‌ లైసెన్సీలు వచ్చి వారికి నచ్చినవారివద్ద ఓపెన్‌ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తారు. దీనివల్ల అరాచకం ఏర్పడే ప్రమాదం ఉంది. 

పునర్వినియోగ ఇంధనంలో జలవిద్యుత్‌ను చేర్చడంవల్ల మనపై పడే ప్రభావం ?

ప్రస్తుత చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం ఎంత పునర్వినియోగ ఇంధనం కొనాలనేది రాష్ట్ర ఈఆర్సీ నిర్ణయిస్తుంది. మన రాష్ట్రంలో ప్రస్తుతం 7 శాతం పునర్వనియోగ ఇంధనం వాడమన్నారు. మనం అలాగే చేస్తున్నాం. కొత్తచట్టంలో 18-20 శాతం వాడాలని ఆదేశిస్తే ఖచ్చితంగా అంత వాడాల్సిందే. ఒకవేళ అంత కొనలేకపోతే మనపై జరిమానాలు విధిస్తారు. దీనివల్ల సమస్యలు వస్తాయి.  మనవద్ద జలవిద్యుత్‌కు సంబంధించి నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులున్నాయి. కానీ అవి ఈ చట్టం పరిధిలోకి రావు. కొత్తచట్టం వచ్చిన తర్వాత పీపీఏలు చేసుకున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారట. ఉత్తరభారతంలో కొత్తగా భారీగా జలవిద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అవన్నీ ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలవి. ప్రైవేటు ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చడమే దీనివెనుక ఉన్న లక్ష్యం.

నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పెట్టడం వెనుక ఉద్దేశమేమిటి? 

కొత్త చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ పెట్టబోతున్నారు. వాస్తవానికి ఇప్పుడు స్టేట్‌, రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లున్నాయి. వీటి ద్వారానే ఏ ఊరికి ఎంత విద్యుత్‌ అవసరం ఏ ప్రాంతానికి ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించి సరఫరా చేస్తుంటారు. కానీ కొత్త చట్టం ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండు గూడేనికైనా హైదరాబాద్‌ నగరానికైనా ఎంత విద్యుత్‌ ఇవ్వాలన్నది నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నిర్ణయిస్తుంది. ఇదో అసంబద్ద ఏర్పాటు. మన అవసరాలు పరిస్థితులు వాళ్లకు వివరించి విద్యుత్‌ కేటాయింపు జరిగేలోపు పరిస్థితి చేయిదాటిపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వాలు వెంటనే డబ్బులు చెల్లించకపోయినా  ఉత్పత్తి సంస్థలు విద్యుత్‌ను ఇస్తున్నాయి. ఇకనుంచి ఎల్సీ ఓపెన్‌చేసి విద్యుత్‌ను కొనాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వాలవద్ద డబ్బు లేకుంటే విద్యుత్‌ కొనుక్కునే అవకాశం ఉండదు. దాంతో రాష్ర్టాలు అంధకారంలో మగ్గిపోతాయి.

ఈఆర్సీ చైర్మన్‌, సభ్యులను నియమించే అధికారం కేంద్రం తీసుకోవటంపై మీ అభిప్రాయం? 

విద్యుత్‌ నియంత్రణ మండలిని కూడా కేంద్రమే నిర్ణయిస్తామంటోంది. ఇది మరో కుట్ర. ప్రతీ రెండేండ్లకోసారి దేశంలోని రెండు రాష్ర్టాల చీఫ్‌ సెక్రటరీస్థాయి అధికారులతో ఈఆర్సీలను ఏర్పాటు చేస్తామంటున్నారు. రాష్ట్రప్రభుత్వ అభ్యంతరాలను వాళ్లు వినకపోవచ్చు. ఈఆర్సీకి పోటీగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తారు. ఎవైనా ఫిర్యాదులుంటే వాళ్లకే తెలుపాలి. ఈఆర్‌సీకి ఏలాంటి అధికారాలుండవు. ఇక్కడకూడా కేంద్ర నిర్ణయమే అంతిమం అవుతుంది. రాష్ట్రప్రభుత్వం ఆశయాలు, లక్ష్యాలు, ప్రజల పరిస్థితి, విద్యుత్‌ సంస్థలకున్న వనరులు, అవకాశాలను కేంద్ర సంస్థలు పట్టించుకోవు. అంతిమంగా ప్రజలపై ఆ ప్రభావం ఉంటుంది. 

ఇది ప్రైవేటీకరణ దిశగా మళ్లేలా కనపడుతున్నదా?

ప్రైవేటు విద్యుత్‌ సంస్థలు, ఆపరేటర్లు కోరినట్టుగా చట్టం ఉన్నది. డిస్కంలలోకి సబ్‌ లెసెన్సీలు, ఫ్రాంచైజీలు ప్రవేశిస్తే ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళినట్టే. దీని పర్యావసనంగా ధరలు పెరుగుతాయి. పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబాయి, నాగ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ప్రజలకు ఏరకంగానూ మేలు జరుగలేదు.అనుకూల, సానుకూల ఫలితాలు రాలేదు. ప్రజావ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వందశాతం వ్యతిరేకిస్తాం. ఈ బిల్లు ఉద్యోగులకు కూడా వ్యతిరేకమైనదే.

వినియోగదారుడికి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానం వల్ల లాభమా? నష్టమా?

ప్రస్తుతం టారిఫ్‌లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. విద్యుత్‌ ఛార్జీలపై రెగ్యులేటరీ కమిషన్‌ ఇచ్చే సూచనల మేరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. క్రాస్‌ సబ్సిడీ ఇవ్వటం ద్వారా కొన్నివర్గాలకు చేయూత లభిస్తుంది.  కొత్తచట్టం అమలులోకివస్తే వీరికి సబ్సిడీ ఇవ్వడం సాధ్యంకాదు. అంతేకాకుండా రాష్ట్రంలో రైతులకు సంబంధించిన 25 లక్షల విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టాల్సి వస్తుంది. మీటర్‌ రీడింగ్‌ప్రకారం రైతు మొదట విద్యుత్‌ బిల్లు కట్టాలి. లేదంటే కరెంటు కట్‌ చేస్తరు. రాష్ట్రప్రభుత్వం రైతులకు నేరుగా సబ్సిడీ ఇచ్చుకోవచ్చని కొత్తచట్టంలో ప్రతిపాదించారు. రాష్ర్టాలపై పెనుభారం మోపాలన్నదే వాళ్ల లక్ష్యంగా కనిపిస్తున్నది. 


logo