బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 00:04:37

తెలుగును వెలిగించిన యోగి

తెలుగును వెలిగించిన యోగి

  • తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌ వెల్చాల కొండలరావుతో  ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక  ఇంటర్వ్యూ..   

అకాడమీలతో అక్షరాలను దిద్దించి.. తెలుగు చదువులకు చలువ పందిళ్లు వేసిన భాషా స్వాప్నికుడు పీవీ.  మన భాషకు, విద్యారంగానికి  పీవీ కన్నా ఎక్కువ సేవ చేసిన వారెవరూ  లేరంటున్నారు తెలుగు అకాడమీ  మాజీ డైరెక్టర్‌ వెల్చాల కొండలరావు.


పీవీని తొలిసారిగా ఎప్పుడు కలిశారు? 

పీవీ అప్పటికి ఇంకా రాజకీయాల్లో  ముందుకు రాలేదు. మా నాన్న కేశవరావుతో సాహితీ  మిత్రత్వం ఉండేది. అలా మా నాయన నా పెండ్లికి ఆయనను ఆహ్వానించారు. ఆ రోజుల్లో పల్లెల్లో  పెళ్లిళ్లు జరిగితే కూర్చోవడానికి కుర్చీలు ఉండేవి కావు. జంపఖానాల మీదనే కూర్చునేవారు. పెండ్లికి వచ్చిన ఆయన అలా సాదాసీదా మనిషిగా జంపఖానాల మీదనే కూర్చున్నారు. అలా ఆయన్ను తొలిసారి ప్రత్యక్షంగా చూశా.  ఆ తర్వాత నేను కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. అప్పటి కళాశాల ప్రిన్సిపాల్‌ ఐవీ చలపతిరావుతో పీవీకి స్నేహం ఉండేది. ఆయన్ను కలుస్తుండేందుకు పీవీ అప్పుడప్పుడు కాలేజీకి వస్తుండేవారు. ఈ క్రమంలో వారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. నేను  శాతవాహన కాలేజీ పీజీ ప్రిన్సిపాల్‌ అయ్యాక మా మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. ఎంతలా అంటే వారు ఎప్పుడు కరీంనగర్‌ వచ్చిన నేను తప్పక కలిసేవాడిని. 

పీవీ రాష్ట్ర విద్యాశాఖమంత్రిగా పనిచేశారు. ఒక విద్యావేత్తగా విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషిని  వివరిస్తారా? 

పీవీ విద్యాభివృద్ధి కోసం ఎవరూ చేయలేని కృషిని చేశారు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఉన్నాయి. ఒక ఉదాహరణ  చెబుతా.. జగిత్యాల కళాశాల ఏర్పాటు చేశారు. ఆ కళాశాలకు అఫిలియేషన్‌ ఇవ్వడానికి యూనివర్సిటీ కమిషన్‌ వచ్చింది. అక్కడి భవనాలను చూసి ఇక్కడ కాలేజీ పెడతారా? అని నిర్ఘాంత పోయారు. అప్పుడు పీవీ జోక్యం చేసుకుని ఒకనాడు కరీంనగర్‌  కాలేజీని కూడా ఇలాగే ప్రారంభించాం. ఇప్పుడు ఎంత ఎదిగిందో చూశారు కదా? అన్నారు. పీవీ అన్నట్టుగానే ఆ తరువాత కాలంలో జగిత్యాల కాలేజీ మంచి  పేరుతెచ్చుకుంది. 

భాషాభివృద్ధికి పీవీ చేసిన కృషిని వివరిస్తారా.? 

తెలుగు అకాడమీ ఏర్పాటు అనంతరం భాషాభివృద్ధికి కూడా పీవీ క్రియాశీలకంగా కృషి చేశారు. ఒక్క పాఠ్యపుస్తకాల ప్రచురణ కోసమే కాకుండా భాషాభివృద్ధికి కూడా తెలుగు అకాడమీ  దోహదపడాలనేది ఆయన అభిలాష. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించేవారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలుగులోనే మాట్లాడి భాషా ఔన్యత్యాన్ని ఇనుమడింపజేశారు. పారిభాషిక, పరిపాలన భాష పదకోశాలను అకాడమీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాహితీ సంస్థలు కూడా క్రియాశీలకంగా పనిచేశాయి. 

భాష వల్లే ఓడిపోయామని ఒక సందర్భంలో పీవీ అన్నారట. దీని వెనుకగల కారణం? 

ఒక భాష ప్రభావం ఆ సమాజంపై ఏమేరకు ఉంటుందో అన్న విషయం పీవీగారికి చాలా బాగా  తెలుసు. అందుకు ఒక ఉదాహరణ చెబుతా. ప్రధానిగా చేశాక రెండో దఫా ఎన్నికల్లో  కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఆ తర్వాత ఉన్నతాధికారులు, రాజకీయ మేధావులతో  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మనం ఎందుకు ఓడిపోయాం? అని అక్కడున్నవారందరినీ పీవీ ప్రశ్నించారు. ఎవరూ జవాబివ్వక పోవడంతో తిరిగి పీవీగారే.. కేవలం భాష వల్లనే మనం ఓడిపోయామన్నారు. మనం సామాన్యుల కోసం పనిచేశాం. వాళ్ల దగ్గరికి వెళ్లి వారి  భాషలో మాట్లాడకుండా.. మనం చేసిన పనుల గురించి మీరు ఇంగ్లిష్‌లో మాట్లాడి ఉంటారు. అందుకే ఓడిపోయాం అన్నారు. పీవీ నిష్పక్షపాతంగా ఉంటారు. ఆయన కుల, మతవాది కాదు.  ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన ఓ యోగి. 

పీవీ సాన్నిహిత్యంలో మీరు మరచిపోలేని జ్ఞాపకం?

పీవీ సాన్నిహిత్యంలో సాగిన ప్రతి క్షణమూ ఒక మధురజ్ఞాపకమే. నేను తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నా. అందులో భాగంగా మహారాష్ట్రలోని చాందాకు గెరిల్లా శిక్షణ కోసం వెళ్లా. అక్కడ శిక్షణ ఇచ్చింది ఎవరో కాదు పీవీనే.  నేను విశ్వనాథ సాహిత్య పీఠం స్థాపించి ‘జయంతి’ని తిరిగి నడపగలగడం వారికి ఎంతో నచ్చింది. దానిని చూసి ‘మీ జయంతి ఎంతో బాగస్తున్నది’ అంటూ ప్రశంసించారు. విశ్వనాథ సత్యనారాయణపై జయంతి ప్రత్యేక సంచిక కోసం ఒక  సందేశం పంపాలని పీవీని కోరాను నేను. అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. దీంతో చివరికి నన్నే రాసి ఆ ప్రతిని పం పించామన్నారు. రాసి అది వారికి  పంపా ను. పీవీ దానిని చూసి ఒక్క గీత కూడా పెట్టకుండా సంత కం చేసి తిరిగిపంపారు. అది నేను  ఎప్పటికీ మరచిపోను. 

‘విట్‌ అండ్‌ విజ్‌డమ్‌ ఆఫ్‌ పీవీ’ పుస్తకాన్ని ఎందుకు ప్రచురించాల్సి వచ్చింది?

ఏదో ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఎవరో మేధావి పీవీలో హాస్యం, వ్యంగ్యం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న నా చెవినపడేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అంతే పీవీ పుస్తకాలను, ఉపన్యాసాలను వడబోశాను. అందులో భాగంగానే ‘విట్‌ అండ్‌ విజ్‌డమ్‌ ఆఫ్‌ పీవీ’ అనే 50 పేజీల పుస్తకాన్ని ప్రచురించాను. దానిని వారికి అందజేసి ఇది చదవండి. పీవీ వ్యంగ్యాన్ని చవిచూడండి అంటూ సమాధానమిచ్చా. 

తెలుగు అకాడమీ ఏర్పాటు నేపథ్యం

తెలుగు భాషాభివృద్ధికి పీవీ చేసినంత కృషి బహుశా వేరెవరూ చేయలేదు. బద్రిరాజు కృష్ణమూర్తితో కలిసి తెలుగు అకాడమీ ఏర్పాటులో కీలక భూమిక  పోషించారు. తొలి చైర్మన్‌గా వ్యవహరించారు. భాషాభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేశారు. పీవీతో పాటుగా తెలంగాణకు చెందిన అనాటి  చాలామంది నాయకులు ఉర్దూ మీడియంలోనే విద్యనభ్యసించారు. ఇప్పుడు ఇంగ్లిష్‌ భాషకు ఎంతటి ఆదరణ ఉన్నదో ఆ సమయంలో తెలుగు టీచర్లకు, తెలుగు భాషకు అంతటి  గౌరవముండేది. కానీ క్రమంగా తెలుగు తన ప్రాభవాన్ని కొల్పోవడం ప్రారంభమైంది. ఆ సంధికాలంలోనే పీవీ తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.

పాముపడగ కింది కప్పలం కాదు

గ్రామ చావడి అయినా.. విశ్వవేదిక అయినా పీవీకి ఫరక్‌ పడదు. చెప్పాల్సిన నలుగు మాటలను చెప్పే తీరుతారు. ఐక్యరాజ్య సమితిలో ఓ సారి పెత్తందారీ దేశాలను తనదైన శైలిలో ఉతికి ఆరేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను పెట్టుబడిదారీ దేశాలు పాము పడగ కింద ఉన్న కప్పల్లా చూస్తామంటే సహించబోము అని గర్జించారు. కొత్తగా స్వాతంత్య్రం పొంది అభివృద్ధి వైపు పురోగమిస్తున్న దేశాల తరపున వకల్తా పుచ్చుకున్నారు. ఆధిపత్య ఎత్తుగడలకు పోతే తస్మాత్‌ జాగ్రత్త అని దీని సారంశం. 

- ఇంటర్వ్యూ.. మ్యాకం రవికుమార్‌


logo